*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*336 వ రోజు*
*కౌరవశిబిరంలో విషాదచ్ఛాయలు*
కౌరవ శిబిరంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. సుయోధనుడు తనలో తాను ఇలా తర్కించుకున్నాడు. " అర్జునుడికి కోపం వచ్చిన దేవతలకే అలవి కాడు. ఇక ద్రోణుడు, కర్ణుడు ఎంత అని నేడు తేటతెల్లం అయింది. ద్రోణుడు, కర్ణుడు మమ్ము ఎంత ఆదుకొనవలెనని ప్రయత్నించినా అర్జునుడి ముందు శక్తిహీనులు అయ్యారు " అనుకుంటూ ద్రోణుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! ప్రతిరోజు యుద్ధంలో మనకు అపజయం పాండవులకు విజయం లభిస్తుంది. నా తమ్ములతో సహా అనేక యోధులు మరణించారు. ఆ శిఖండి కారణంగా మహాబలవంతుడైన భీష్ముడు పడిపోయాడు. మన సైన్యంలో ఏడు అక్షౌహినుల సైన్యం మరణించారు. సైంధవుడు మరణించాడు, మన కొరకు ప్రాణాలు లెక్క చేయక యుద్ధము చేయవచ్చిన రాజులు అసువులు బాసారు. ఇక నేను పాండవులను వధించి విజయం సాధించడమో లేక వీరస్వర్గం అలంకరించడమో మాత్రమే మిగిలి ఉంది . మరేదైనా మార్గం ఉంటే శలవివ్వండి. మీకు అర్జునుడు ప్రియశిష్యుడు ఆ కారణంగా అతడు చేజిక్కినా చంపక వదిలివేయడమే కాక అతడికి సాయం చేస్తున్నారు. కర్ణుడు ఎంతటి వీరుడైనా యుద్ధనైపుణ్యంలో కాని కార్య సాధనలో కాని మీకు సాటి రాడు. ఉపాయము అనుభము ఉన్న మీరు మాకు సహకరించడం లేదు. కర్ణుడు ఎంత ప్రయత్నించినా సైంధవుని రక్షించ లేక పోయాడు. సామర్ధ్యం కలిగిన మీరు కాపాడ లేదు " అన్నాడు.
*ద్రోణుని వ్యధ*
సుయోధనుడి ములుకుల వంటి మాటలకు నొచ్చుకున్నద్రోణుడు " సుయోధనా ! నా గుండెలు తూట్లు పొడిచే మాటలు ఎందుకు మాట్లాడతావు. కృష్ణుని సాయం ఉన్నంత వరకు అర్జునుడిని గెలవడం అసాధ్యమని నీకు ముందే చెప్పాను నీవు వినలేదు. దేవతలకే గెలువ శక్యము కాని భీష్ముని పడగొట్టిన అర్జునుడికి సాధ్యము కానిదేముంది. నేను నీ పక్షాన యుద్ధము చేస్తున్నది నా అభిమానం కాపాడు కోవడనికే కాని పాండవులను జయిస్తానని కాదు. సుయోధనా ! నాడు నిండు సభలో శకుని చేత పాచికలాడించి పాండవులను అనేక విధముల అవమానించి హింసించావు. నేడు ఆ పాచికలే అర్జునుడి బాణాలై నిన్ను బాధిస్తున్నాయి. వాటిని నిలువరించడం ఎవరి తరం చెప్పు. విదురుడు ఎంత చెప్పినా వినక నాడు పాండుసతిని కొలువు కూటముకు ఈడ్చి చేసిన అవమానం ఊరక పోతుందా ! ఆ వీరపత్నిని నిండు సభలో నీవు, దుశ్శాసనుడు, కర్ణుడు తూలనాడి అన్న మాటలు ఊరకే పోతాయా ! ప్రశస్త చరితులైన పాండుసుతులను అధికారమదంతో కళ్ళు నెత్తికెక్కి చేసిన అవమానం మీకు చెరుపు చేయదా ! సుయోధనా ! మీరు చేసిన అవమానములు సహించి అరణ్య అజ్ఞాత వాసం ముగించుకుని అంతా మరచి వారికి రావలసిన అర్ధభాగం అడిగితే నీవు కనికరం లేక నిర్ధాక్షిణ్యంగా నిరాకరించావు. ఇంత అధర్మవర్తనుడివైన నీ తరఫున యుద్ధం చేస్తున్న నేను ఒక బ్రాహ్మణుడినా ! నాది ఒక బ్రాహ్మణ జన్మా ! నేనంటే శకట వ్యూహం వద్ద ఉన్నాను సైంధవునికి సమీపంలో ఉన్న నువ్వు, కర్ణుడు మిగిలి యోధులు ఏమి చేసారు. నీవు వారందరిని మాటలతో ఎందుకు బాధించవు నన్ను మాత్రమే నిందుస్తున్నావెందుకు వారు నీకు కావలసిన వారు నేను కానా ! యుద్ధసమయంలో పాండవయోధులు వారి శరములతో బాధిస్తున్నారు అలసి వచ్చిన నా మనసును నీవు నీ మాటలతో బాధిస్తున్నావు ఇది నీకు న్యాయమా ! గతజల సేతుబంధన మేలనయ్యా ! రేపటి యుద్ధంలో మీరంతా వీరోచితంగా పోరాడండి. నా వంతుకు నేను పాంచాలురను వధిస్తాను. కావలసిన కార్యము మీద మనసుంచి సైన్యాలను యుద్ధోన్ముఖులను చెయ్యి. వారి మనసులో ఉత్సాహాన్ని నింపి నీవు కూడా నీ పరాక్రమము చూపు. రేపు నేను యుద్ధభూమికి వెళ్ళి జరగరానిది జరిగి తిరిగి రాకుంటే అశ్వత్థామ తట్టుకోలేడు. నా మాటగా అశ్వత్థామకు చెప్పు " నాయనా అశ్వత్థామా ! బ్రాహ్మణుల ఎడ, వృద్ధుల ఎడ భక్తి శ్రద్ధలు చూపుతూ ధర్మవర్తనుడవై మెలగుము. నేను చంపగా మిగిలిన పాంచాల వీరులను నీవు తుదముట్టించుము. ఇదే నా కడపటి సందేశం " అన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి