26, ఆగస్టు 2020, బుధవారం

ఏల్చూరి సుబ్రహ్మణ్యం శతజయంతి


ఈరోజు  (26-8-2020) *ఆంధ్రజ్యోతి* ఎడిటోరియల్ పేజీలో వ్యాసం🌹 *నయాగరా నవ్య జలపాతం ఏల్చూరి* // నయాగరా కవుల్లో ఒకడిగా  సుప్రసిద్ధుడు,కవిగా, రచయితగా, పాత్రికేయుడిగా బహుముఖీనంగా వికసించిన ఏల్చూరి సుబ్రహ్మణ్యం శతజయంతి నేడు. ఆధునిక తెలుగు కవులలో అచ్చమైన అభ్యుదయానికి ఆదిపురుషుల వంటి కవులలో ఏల్చూరి సుబ్రహ్మణ్యం ప్రథమ శ్రేణీయులు."అరసంకు కేల్చూపిన కవుల దిట్ట", అని ఆరుద్రతో అనిపించుకున్న ఘటికుడు. శ్రీ శ్రీ, ఆరుద్ర,అబ్బూరి వరదరాజేశ్వరరావు కవిత్రయంగా రాసిన "మేమే" కావ్యాన్ని అంకితం పొందిన అసాధ్యుడు ఏల్చూరి. "వేసాలమారి లోకపు మోసాలను తాగి తాగి మూర్ఛిల్లిన ఈ కాసింత కావ్యపాత్రకు  జీససు నీవై కళాసు చేద్దూ ఏసూ! " అంటూ శ్రీశ్రీ అంకిత పద్యాలు కూడా రాశారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యంను శ్రీశ్రీ ముద్దుగా ఏసు, అని పిలిచేవారు. అరసంతో వీరి అనుబంధం అపురూపం. తొలి తరం  అరసం సభల్లో పాల్గొన్న సభ్యుల్లో గణనీయుడు ఏల్చూరి. నవ్య కళాపరిషత్ స్థాపించి, విభిన్న కళల నవ్యత్వ సృష్టికి  మూలస్తంభంగా నిలిచిన నవ్య ఆలోచనా ప్రసన్నుడు. వీరి సారస్వత జీవిత ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. ఈ అభ్యుదయకవి  ఆగస్టు 26, 1920లో పలనాటి ముఖద్వారం నరసరావుపేటలో పుట్టారు. వీరి స్వగ్రామం ఏల్చూరు. ఈ గ్రామం సుప్రసిద్ధ పురుషుల నివాసంగా సుప్రసిద్ధం. ప్రఖ్యాత  కొప్పరపు సోదరకవుల అవధాన విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది. నేటి కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి  (పూర్వాశ్రమ ప్రసాదరాయ కులపతి) కూడా ఇదే గ్రామానికి చెందినవారు. ప్రపంచ ప్రఖ్యాత వేణుగాన విద్వాంసులు ఏల్చూరి విజయరాఘవరావు కూడా ఈ ఊరివారే. వీరు ఏల్చూరి సుబ్రహ్మణ్యంకు స్వయంగా సోదరులు. ఇంతటి సారస్వత మూలాల మట్టివాసన పులుముకొని పైకొచ్చిన విలక్షణుడు ఏల్చూరి. ఉద్దండులైన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు, నాయని సుబ్బారావు, అక్కిరాజు రామయ్య, మద్దులపల్లి గురుబ్రహ్మశర్మ, భాగవతుల వెంకటసుబ్బారావు దగ్గర వీరు నరసరావుపేటలో శిష్యరికం చేశారు. తొలినాళ్లలోనే బలమైన సారస్వతమైన  పునాదులు వేసుకున్నారు. నరసరావుపేట నుండి ప్రయాణం విజయవాడకు మరలింది. కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారి  ఇంట్లోనే ఉండి, బి.ఏ పూర్తి చేశారు. కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ముగ్గురు విద్యార్థి దశలో స్నేహితులు. ఆ స్నేహం కవితగా ప్రవహించింది. 1944 ఆగస్టులో వీరి " నయాగరా" కవితా సంకలనం ఆవిష్కృతమైంది. ఈ కావ్యాన్ని అనిసెట్టి సుబ్బారావు - లక్ష్మి దంపతులకు పెళ్లికానుకగా అంకితం చేశారు. ఈ సంకలనాన్ని విశ్వనాథ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం తొలిరోజుల్లో పద్య సాహిత్యపు ఆకర్షణలో పడ్డారు. ఏల్చూరి నృసింహస్వామిపై శతకం కూడా రాశారు. తదనంతరం,  అభ్యుదయం - కమ్యూనిజం బాటలోనే నడిచారు. శ్రీశ్రీ ప్రభావంతోనే ఈ మార్గం పట్టారు. మహాప్రస్థానం సంకలనంలో "మరోప్రపంచం" కవితలోని, నయాగరా వలె ఉరకండి... ప్రేరణతో, వీరి  కవితా సంకలనానికి "నయాగరా" అనే పేరు పెట్టుకున్నారు.అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో అచ్చయిన తొలి కవితా సంపుటిగా దీనికి పేరు దక్కింది. దీనిద్వారా నయాగరా కవులుగా చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ దగ్గర మూడేళ్ళు చదువుకున్నా, వారి ప్రభావానికి లోను కాలేదు. కవిగా, గురువుగా విశ్వనాథను గౌరవిస్తూనే, తన సొంత పంథాలోనే నడిచారు. శ్రీ శ్రీ ప్రభావంతో కవితా మార్గాన్ని ఎంచుకున్నా, పదబంధాల నిర్మాణంలో తనదైన శైలినే నిలుపుకున్నారు. భావం అభ్యుదయమైనా, రూపంలో నవ్యత్వం, ప్రబంధ బంధురత చాటుకున్నారు. సకల ప్రజా సముద్ధర్త, సుప్తోద్ధృత జీవశక్తి, తమసగర్భ దళనహేతి,బంధీకృత ధనిక శక్తి, రక్తారుణ కుసుమం, బానిస సంద్రం మొదలైన కొంగ్రొత్త పదబంధాలు సృష్టించారు. కవిగా సర్వ స్వతంత్రుడుగా కవితా యానం సాగించారు. విశ్వనాథ, శ్రీశ్రీ ఇద్దరి పట్లా జీవితాంతం గురుభావమే నిలుపుకున్నాడు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం  నా దగ్గర మూడేళ్లు చదువుకొని, అతను ఏమి నేర్చుకున్నాడో నాకు తెలియదు కానీ, నేను అతని దగ్గర నుండి చుట్ట తాగడం నేర్చుకున్నానని విశ్వనాథ చమత్కరించాడు. అలా, గురుశిష్యులకు "చుట్టరికం" కుదిరింది. ఏల్చూరి కవితల్లో "ప్రజాశక్తి" సుప్రసిద్ధం. ఠాగూర్ చంద్రసింగ్, విజయముద్ర కూడా ఎందరినో ఆకర్షించాయి. సోవియట్ సాహిత్యంలో ప్రసిద్ధమైన బోల్షెవిక్ విప్లవాన్ని ఏల్చూరి అద్భుతమైన కవితా వస్తువుగా మలచుకున్నారు. గ్రెగోరియన్ కాలెండర్ ప్రకారం నవంబర్ 7, 1917 నాడు ఈ సంఘటన జరిగింది."నవంబర్ 7" శీర్షికతో సుదీర్ఘమైన కవిత రాశారు. 1956లో విశాలాంధ్ర పత్రిక ఈ కవితను ప్రచురించింది. తెలుగు సాహిత్యంలో తొలి దీర్ఘకవితగా చరిత్రకెక్కింది. చలం, గుర్రం జాషువా కూడా ఏల్చూరికి సారస్వతమైన స్ఫూర్తిని నింపారు. పులుపుల శివయ్య, కొల్లా వెంకయ్య ప్రభావంతో ఏల్చూరి సుబ్రహ్మణ్యం కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి ప్రవేశించారు. ఎన్నో ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఎన్నో పత్రికల్లో పనిచేసినా, సోవియట్ భూమి పత్రికతో ఉన్న అనుబంధం సుదీర్ఘమైంది. 1961 నుండి 1988వరకూ, 27సంవత్సరాలపాటు సంపాదకవర్గంలో కీలకమైన సభ్యుడిగా ఉండి, సంపాదకుని హోదాలో పదవీవిరమణ చేశారు. ఇంగ్లీష్ లో వచ్చిన ఎన్నో వందలాది రష్యన్ కవితలను తెలుగులోకి  అనువాదం చేశారు. సోవియట్ భూమి పత్రికలో సుమారు 40 వేల పేజీల అనువాద రచన చేశారు. అభ్యుదయకవిగా ఎంత సృష్టిచేశారో, అంతకు మించిన కృషి పాత్రికేయుడిగా చేశారు. 1940 లో 20 ఏళ్ళ వయస్సులోనే నరసరావుపేటలో "సన్యాసి", అనే పత్రికను, “చిత్ర” అనే పత్రికను స్వయంగా స్థాపించారు. క్రాంతి, పొగాకులోకం, తెలుగుదేశం, నేత, సోషలిస్టు, అభ్యుదయ మొదలైన పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.1941-42 ప్రాంతంలో మాగంటి బాపినీడు సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రసర్వస్వంకు సహాయ సంపాదకులుగా బాధ్యత వహించారు. జరుక్ శాస్త్రి, రాయప్రోలు రాజశేఖర్ మొదలైనవారితో కలిసి ఆకాశవాణికి ఎన్నో స్క్రిప్ట్లు అందించారు. మద్రాస్ లో కొంతకాలం సినిమాలకు పాటలు కూడా రాశారు. సంగీతలక్ష్మి, పంచకళ్యాణి-దొంగలరాణి, కథానాయకురాలు మొదలైన సినిమాలకు రాసిన పాటలు బాగా హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ తో చిన్ననాటి నుండి స్నేహం ఉంది. విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఎన్టీఆర్ ఏల్చూరికి జూనియర్. విశ్వనాథ సత్యనారాయణ దగ్గర వీళ్ళందరూ బాగా కలిసేవారు. సంగీతలక్ష్మి సినిమాలో ఎన్టీఆర్ హీరో. ఘంటసాల, పి.సుశీల పాడిన “కలో నిజమో కమ్మని ఈ క్షణం” పాట ఎంతో జనాదరణ పొందింది. విజయవాడ స్నేహాన్ని గుర్తుపెట్టుకొని, ఎన్టీఆర్ ఏల్చూరిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు. జగ్గయ్య - ఏల్చూరి ప్రాణస్నేహితుల్లా మెలిగారు. 1960 లో, సుప్రసిద్ధ సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యశర్మ రాసిన తొలినవల "చంద్రునికో నూలుపోగు"కు  పీఠిక రాసి, పాఠకలోకానికి పరిచయం చేశారు. పురాణం వారు ఏల్చూరిని గురువుగా భావించేవారు. త్రివేణి పత్రిక సంపాదకులుగా ప్రఖ్యాతులైన కోలవెన్ను రామకోటేశ్వరరావు స్ఫూర్తితో ఏల్చూరి సుబ్రహ్మణ్యం పత్రికా స్థాపన, రచనల వైపు మళ్లారు. దేశిరాజు కృష్ణశర్మ, బెల్లంకొండ రాఘవరావు నరసరావుపేటలో ఏల్చూరికి నైతికస్ఫూర్తిని ఇచ్చినవారు. అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, దేవరకొండ బాలగంగాధర తిలక్, దండమూడి కేశవరావు మొదలైన ప్రతిభామూర్తుల తొలి రచనలు ఏల్చూరివారు స్థాపించిన సన్యాసి పత్రికలోనే అచ్చుకు నోచుకున్నాయి. ఈయన స్థాపించిన నవ్యకళా పరిషత్ లో రెంటాల గోపాలకృష్ణ, సముద్రాల రామానుజాచార్యులు, తిలక్, అనిసెట్టి, కుందుర్తి ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు మొదలైన అభ్యుదయ కవులందరూ సభ్యులే. నయాగరా కవిగా ప్రసిద్ధులైన ఏల్చూరి సారస్వత జీవితం పలు మార్గాల్లో శాఖోప శాఖలుగా విస్తరించింది. జీవితంలో ఎక్కువ భాగం మద్రాస్, హైదరాబాద్ లో గడిచింది. కథలు, కవితలు, కావ్యాలు, వ్యాసాలు, గీతాలు వంటి విభిన్న ప్రక్రియల్లో తన అచ్చపు ముద్రవేసుకున్న అభ్యుదయగామి ఏల్చూరి సుబ్రహ్మణ్యం జీవితం - కవిత్వం రెండూ జలపాతాలే. ప్రతిభ, ప్రేమ రంగరించుకున్న విశేష సారస్వతమూర్తిని, శతజయంతి సందర్భంగా హృదయపు తలపుల్లో తలచుకుందాం. -మాశర్మ🙏
*************************

కామెంట్‌లు లేవు: