26, ఆగస్టు 2020, బుధవారం

రామాయణమ్.42


...
కైక ఇచ్చిన ఆభరణాన్ని విసుగుతో ,కోపంతో నేలకేసికొట్టింది మంథర!.మూఢురాలా శోకించవలసిన సమయంలో ఈ ఆనందమేమిటి? నిన్ను చూసి నాకు నవ్వువస్తున్నది ! సపత్నులవృద్ధికి సంతసించే స్త్రీని నిన్నే చూశా!.
.
కౌసల్య కొంతసేపటి తరువాత రాజమాత అవుతుంది ! నీవేమవుతావు? ఆవిడ ఎదురుగా చేతులు కట్టుకు నిల్చొనే దాసి అవుతావా? .
.
రాముడు రాజు అయితే భరతుడు సేవకుడై ఊడిగం చేస్తాడా? .
.
ఈ విధంగా మాట్లాడుతున్న మంథరను చూసి రాముడి గూర్చి నీకేమి తెలుసని మాట్లాడుతున్నావు? రాముడెట్లాంటి వాడో వినవే అని కైక చెప్పదొడగింది!.
.
ధర్మజ్ఞో గురుభిర్దాన్తః కృతజ్ఞః సత్యవాక్చుచిః
రామో రాజ్ఞః సుతో జ్యేష్ఠో యౌవరాజ్యమతోర్హతి!.
.
రాముడు ధర్మాత్ముడు ! పెద్దలవద్ద విద్యాబుద్ధులు నేర్చినవాడు ,కృతజ్ఞుడు ,సత్యవచనాలుపలికేవాడు! నిర్మలమయిన చరితకలవాడు పైగా పెద్దకొడుకు ! అతడే రాజవ్వటానికి అర్హుడు ! ఒసే గూనిదానా! తన తమ్ములను తండ్రిలాగా చూసుకుంటాడే! నూరుసంవత్సరములు రాముడుపాలించిన పిదప భరతుడు పరిపాలింపగలడు !
.
ఇది అత్యంత ఆనందదాయకము ,కళ్యాణకరము అయిన సమయము అనవసరంగా రోదించకు.
.
వాడు ! నా రాముడు ! నా ఒడిలో పెరిగినవాడు ! భరతునికన్నా నాకు వాడే ఎక్కువ!

అయినా రాముడికి రాజ్యముంటే అది భరతుడికి కూడా ఉన్నట్లే! తమ్ములంటే ఏవిధమైన భేదభావం లేనివాడు రాముడు!
.
ఆ మాటలు విని దీర్ఘంగా నిట్టూర్చి మంథర ! నీ కొడుకును నీకు దూరంగా పెంచాడు దశరధుడు ! రాముడికి లక్ష్మణుడు అంటేనే ప్రేమ ,ఏ విధంగా చూసినా రాముడితరువాత అతని కొడుకులు రాజులు అవుతారు!  నీ కొడుకెందుకవుతాడు?
.
నీ కొడుకును రాముడు చంపివేసినా చంపివేయవచ్చు! తన రాజ్యాధికారానికి అడ్డం వస్తాడేమోనని!
.
నీకు శాశ్వతమైన అవమానం !.దుఃఖం!
.
అయిపోయింది ! అమృతం ఒలికిపోయింది ! హృదయం నిండా అమృతాన్ని నింపుకున్న కైక మంధరమాటలకు దాన్ని ఒలకపోసుకొని కాలకూటవిషంతో నింపింది! .
.
కన్నులెర్రబడ్డవి దెబ్బతిన్నపాములాగా బుస్సున లేచింది ! చెక్కిళ్ళు ఎర్రబడ్డవి నెయ్యిపోయగా భగ్గున మండే జ్వాలలాగ అయ్యింది ఆవిడ మానసం ! ..
.
ఆ రాముడిని ఇప్పుడే అడవుల పాల్జేస్తాను చూసుకో అంటూ దిగ్గున లేచింది!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
*****************

కామెంట్‌లు లేవు: