18, డిసెంబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత - 113*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                             *ధార్మికగీత - 113*

                                       *****

       *శ్లో:- మృత్పిండమేకం బహుభాoడరూపం ౹*

              *సౌవర్ణ మేకం బహు భూషణాని ౹*   

               *గోక్షీర మేకం బహు ధేను జాతం ౹*

               *ఏకః పరాత్మా బహు దేహవర్తీ  ౹౹*

                                        *****

*భా:- లోకంలో వివిధ ఆకారాలు, రంగులు, సాంద్రతలలో మట్టి పాత్రలు కన బడుతున్నా, వాటి నిర్మాణంలో వాడే "మట్టి" అనే పదార్థం ఒకటే. అందాన్ని రెట్టింపుతో ఇనుమడింప జేసే నగలు లెక్కకు మిక్కిలిగా, కంటికి ఇంపుగా, సొంపుగా ఉన్నా,  వాటి తయారీలో వాడబడే "బంగారం" మాత్రం ఒకటే.  సమీకృత ఆహార మైన పాల నిచ్చే గోమాతలు వివిధ రంగులు, ఆకృతులకు చెందిన వైనా  "ఆవు పాలు" మాత్రం ఒకటే. అలాగే  దేహధారులు ఎందరున్నా  వాటిలో ఉన్న "ఆత్మ " అనేది ఒకటే. దేవుడు ఒక్కడే. సృష్టికార్యంలో ఉంటే "బ్రహ్మ" అని; పోషణ కార్యంలో  ఉంటే "విష్ణువు" అని; లయం చేసే కార్యంలో ఉంటే "శివుడు" అని అంటున్నాము గదా! బల్బు, ఫ్యాను,టివి,ఫ్రిజ్, సెల్ చేసే పనులు వేరైనా వాటికి కావలసిన ఇంధనం విద్యుత్తే గదా!  ప్రతి దేహంలో ఆత్మ రూపంలో భగవాను డున్నాడు. "సర్వ ప్రాణుల యందు ఆత్మ రూపములో ఉన్న నన్ను చూడగలిగినవాడు;  అలాగే సకల ప్రాణికోటిని నా యందు  అంతర్గతముగా ఆత్మ రూపంలో చూడగలిగినవాడును నాకు నిజమైన భక్తుడ"ని గీత చెప్పుచున్నది. కాన అందరు ఆత్మ స్వరూపులే అన్న భావనలో ఉండాలి. సర్వ జీవ పురస్కారము, తిరస్కారము భగవంతునికే  చెందుతాయి. అందుకనే "ఆత్మవత్ సర్వభూతాని" అని చెప్పబడుచున్నది. ప్రార్థనలో "భూతదయాం విస్తారయ!- తారయ సంసార సాగరతః " అని, "నితాంతాపార భూత దయయును- తాపస మందార! నాకు దయ చేయ గదే! అని ప్రామాణికంగా చెప్పబడు చున్నది. ఆత్యాత్మిక చింతనతో జ్ఞాన సంపన్నులై, మానవాళి  ఆత్మ సాక్షాత్కారమునకు నిరంతర సాధన చేయాలని సారాంశము,*.

                                   *****

                   *సమర్పణ   :  పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: