*వచనకవితకు సంస్కృతాంధ్రమూలాలు - 3*
*కాదంబరి గద్యకావ్యంలో ఉత్కలికా గద్యం*
కాదంబరి గద్యకావ్యంలోని సమాసగుంఫితమైన గద్యానికి ఇది ఒక ఉదాహరణ.
*తాత! చంద్రాపీడ! విదితవేదితవ్యస్యాऽధీతసర్వశాస్త్రస్య తే నాల్పమప్యుపదేష్టవ్యమస్తి.*
నాయనా! చంద్రాపీడ! తెలిసికోవలసినదంతయూ తెలిసి కొన్న వాడవు నువ్వు. అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసిన వాడవు. నీకు ఇంకనూ ఉపదేశించవలసినదేదియూ లేదు.
*కేవలం చ నిసర్గత ఏవాऽభానుభేద్యమరత్నాలోకచ్ఛేద్యమప్రదీపప్రభాపనేయమతిగహనం తమో యౌవనప్రభవమ్.*
కేవలము స్వభావము చేతనే దీపప్రభలచేత కాని, రత్నకాంతులచేతకాని, సూర్యునిచేతకాని, తొలగింపబడలేని అతి గహనమైనది *యౌవనము వలన మనిషికి కలిగే చీకటి*.
*అపరిణామోపశమో దారుణో లక్ష్మీమదః.*
పరిణామము తరువాత కూడా ఉపశమనము లేని అతిదారుణమైనది *లక్ష్మీ మదము*. (అనగా సంపదలవల్ల కలిగే మదము). *కష్టమనంజనవర్త్తిసాధ్యమపరమైశ్వర్యతిమిరాంధత్వమ్.*
ఏ విధమైన కాటుగమందులచేతనూ ఎంత కష్టపడినా నివారింప శక్యము కానిది *ఐశ్వర్యపు చీకటి వల్ల కలిగే గుడ్డితనము*.
*అశిశిరోపచారహార్య్యోऽతితీవ్రో దర్పదాహజ్వరోష్మా.*
ఎటువంటి శీతలోపచారములవల్లనూ తగ్గనంత అతి తీవ్రమైనది *దర్పాగ్ని వలన ఏర్పడిన జ్వరము యొక్క వేడి*.
*సతతమమూలమంత్రగమ్యో విషమో విషయవిషాస్వాదమోహః*.
ఎప్పటికీ ఏ మంత్రములవల్లనూ తగ్గనిది
*ప్రాపంచికవిషయములనూ ఆస్వాదించడం వల్ల ఏర్పడిన మోహము*.
*నిత్యమస్నానశౌచబధ్యో రాగమలావలేపః.*
ఎటువంటి స్నానాది శౌచవిధులచేతనూ తొలగింప శక్యము కానిది *రాగమలము* (రాగము = అహంకారము+మమకారము)
*అజస్రమక్షపావసానప్రబోధా ఘోరా చ రాజ్యసుఖసన్నిపాతనిద్రా భవతీతి, విస్తరేణాభిధీయసే*.
ఎప్పటికీ రాత్రి గడిచి తెల్లవారినా మెలకువ రాని అతిఘోరమైనది *రాజ్యసుఖవశమున ఏర్పడిన సన్నిపాతనిద్ర* ... ఈ విషయములు నీకు తెలియవలెను అని ఇప్పుడు చెప్పబడుచున్నది.
*గర్భేశ్వరత్వమభినవయౌవనత్వమప్రతిమరూపత్వమమానుషశక్తిత్వం చేతి మహతీయం ఖల్వనర్థపరంపరా సర్వా.*
*పుట్టుకతోనే వచ్చిన రాచరికపు అధికారం, నవయౌవనత్వము, సాటిలేని అందమైన రూపము, అమానుషమైన శక్తులు*... ఇవన్నీ గొప్ప అనర్థపరంపరలో భాగములు.
*అవినయానామేకైకమప్యేషామాయతనమ్, కిముత సమవాయః.*
*అవినయమునకు వీటిలో ఏ ఒక్కటైనా చాలు. నాలుగూ కలిసి ఒకేచోట ఉంటే? చెప్పవలసింది ఏమున్నది?*
సంస్కృత కాదంబరీ గద్యకావ్యములో ఇటువంటి ఉదాహరణలు ఎన్నో. ఎన్నెన్నో. ఇలాగే ఈ కావ్యములో సరళచూర్ణగద్యసందర్భములూ ఎన్నో ఉన్నాయి.
నిడివి భయముతో ఉదాహరించుట లేదు. ఇవన్నీ వచనరూపములే. ఈగద్యకావ్యములలోని గద్యమును చదివే విధానమూ ఉన్నది.
వీటిని బట్టియే *గద్యం కవీనాం నికషం వదన్తి* (గద్యరచన కవికి గీటురాయి) అనే ఆధారవాక్యం వచ్చింది.
అలాగే సంస్కృత రూపకములలోనూ కేవలమారూపకసందర్భమునకు మాత్రమే చెందినవి కాక సార్వకాలిక అన్వయముకలిగిన వాక్యములు పదే పదే కనిపించును.
ముందు ముందు మరిన్ని ఉదాహరణములను గమనించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి