10, మార్చి 2021, బుధవారం

మన మహర్షులు - 43

 మన మహర్షులు - 43


శౌనక మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹


పూర్వం విజ్ఞానఖని తపస్సంపన్నుడైన ఒక మహర్షి శునకుడనే పేరుతో వుండేవాడు. ఆయన  కొడుకే మన శౌనక మహర్షి. 



శౌనకుడు వేదవేదాంగాలు నేర్చుకుని, అన్ని యజ్ఞాలు చేయించగల సామర్థ్యం వచ్చాక తపస్సు చేసుకుందుకు నైమిశారణ్యానికి వెళ్ళాడు.


 నైమిశారణ్యం ఎంత అందంగా వుండేదో కొంచెం మనం కూడా తెలుసుకుందాం...


నైమిశారణ్యం విష్ణుమూర్తి మందిరంలా, మాధవీ మన్మధులకి ఇష్టమయినట్లు, సరస్వతీదేవితో కలిసివున్న బ్రహ్మగారిల్లులా, ఈశ్వరసభలా, వహ్ని, వరుణ, సమీరణ చంద, రుద్ర, హైమవతీ, కుబేర, గాలవ, శాండిల్యలాంటి మునులతో కూడుకుని, కుబేరుడి ఖజానాలా, రఘురాముడి యుద్ధంలా, పరశురాముడి పౌరుషంలా, కురుక్షేత్రంలా ఇంకా వేదాల్లా గాయత్రీ నిలయమై అమరావతీ పట్టణంలా, వైకుంఠపురంలా, పురుషోత్తముడి

సేవకవసరమైన ఫలాల్తో, లంకానగరంలా, సుగ్రీవుడి సైన్యంలా, గొప్ప గొప్ప మునుల తపస్సులతో పవిత్రమై, సూర్యరథంలా ఉండేది. కాబట్టి  ఆ ప్రదేశానికి శ్రీవిష్ణుక్షేత్రం అనే పేరు వచ్చింది .


అలాంటి  నైమిశారణ్యంలో బ్రహ్మజ్ఞానిగా వెలిగిపోతున్న ఆ శౌనక మహర్షి ఎంతోమంది మునుల్ని శిష్యులుగా చేసుకుని ఉండిపోయాడు.


ఒకసారి శౌనకుడు వెయ్యి సంవత్సరాలు జరిగే సత్రయాగం చెయ్యాలని అనుకుని దాన్ని జరిపించడానికి సూతుణ్ణి ఎంచుకున్నాడు. సూతుడు ఎన్నో గ్రంథాలు చదివి, ఎన్నో పురాణాలు విని దివ్యజ్ఞానం పొందినవాడు.

 శౌనక మహర్షి కి ఇంకా అక్కడ మునులందరికి భగవంతుడి ఏకవింశత్యవతార కథలు అంటే విష్ణుమూర్తి 21 

అవతారాలు  ఎత్తిన కథలు, అన్ని పురాణలు కూడా వాళ్ళకి విన్పించాడు సూతుడు.


కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ శౌనకుడు లోకానికంతకీ మంచి జరగాలని ద్వాదశ సంవత్సర సత్రయాగం మొదలుపెట్టి మళ్ళీ సూతుణ్ణి పిలిచి మునులందరికీ భారత కథలు చెప్పించాడు.


ఈరకంగా నైమిశారణ్యం శౌనక మహర్షి చేసే యాగ సమయంలో విజ్ఞాన కథలు పురాణాలు, ఇతిహాసాలు, సూతుడు శౌనకాదులకి చెప్తుంటే ఆ ప్రదేశం పుణ్యక్షేత్రమై బ్రహ్మలోకంలా అనిపించేది.


పాండవులు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు గంగాతీరంలో ఒక చెట్టు కింద ఒక రాత్రి గడిపి మళ్ళీ బయలుదేరారు.


 అక్కడున్న బ్రాహ్మణులు   పాండవుల వెనకాలే బయలుదేరారు. 


 ధర్మరాజు శౌనక మహాముని చెప్పినట్లు విని సూర్యుడ్ని ఆరాధన చేసి, ఆయన

అనుగ్రహంతో అనేకవేల బ్రాహ్మణులకి అతిథిపూజ చేసి తర్వాత వెళ్ళాడు.


 మునులందరూ మళ్ళీ చేరి శౌనక మహామునిని పద్మపురాణం చెప్పించమని అడిగారు. అదే సమయానికి సూతుడు వచ్చాడు. అందరూ ఆనందించి మాకు పద్మపురాణం చెప్పమని అడిగారు.


పద్మపురాణమంటే విష్ణుమూర్తి నాభినుంచి పుట్టిన కమలం గురించి చెప్పేది. కల్పాంతంలో మత్స్యరూపంలో వున్న ఆదిదేవుడు సముద్రం నుంచి వేదవేదాంగ పురాణలతో పద్మపురాణం కూడా దేవలోకంలోనూ, మనుష్య లోకంలోనూ ప్రతిష్టించబడింది


దానిని హరి బ్రహ్మకీ, బ్రహ్మ నారదుడికి, నారదుడు వ్యాసుడుకి, వ్యాసుడు నాకు చెప్పారని సూతుడు శౌనకాది మహామునులకి పద్మపురాణం వివరంగా చెప్పాడు.


శౌనకమహర్షి బ్రహ్మాజ్ఞానిగా, బహువిధ యజ్ఞకర్తగా, మహాధర్మవేత్తగా కూడ ప్రసిద్ధికెక్కాడు.


జిజ్ఞాసువు శౌనకుడు అంగీరస మహర్షి వద్దకు వచ్చి "ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుంది?" అని అడిగిన ప్రశ్నకు అంగిరసుడు "పరావిద్య, అపరావిద్య అని రెండు రకాలు తెలుసుకోవలసినవి ఉన్నాయని బ్రహ్మవిదులు అంటారు. పరావిద్య అంటే పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. అపరావిద్య అంటే లౌకికమయిన ధర్మాధర్మాలకు సంబంధించినది. రెండవదానికంటే మొదటిది గొప్పది. దాన్ని తెలుసుకున్నవాడు సంసారచక్రం నుంచి విముక్తుడవుతాడు." అంటూ ముండకోపనిషత్తు అనే ఉపనిషత్తును అంగీరసుడు బోధించాడు.


శౌనక మహర్షి చరణవ్యూహ అను ధర్మశాస్త్రమునకు గ్రంథకర్త.


 'మదనరత్నప్రదీప' అనే ధర్మశాస్త్రం, 'చరణవ్యూహ' అనే ధర్మశాస్త్రం కూడ ఈయనవే. మను ధర్మశాస్త్రంలో శౌనకుడు ధర్మశాస్త్ర కర్తగా ఉండటమే కాకుండా 'ప్రణకల్ప అనే గ్రంథం కూడా రచించాడు


శౌనక మహర్షి సూతుడు చేత ఎన్నో పురాణాలు, భారత కథలు, విష్ణుకథలు అన్నీ చెప్పించడం వల్ల ఎంతోమంది మునులు విని తరించారు. ..


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

కామెంట్‌లు లేవు: