10, మార్చి 2021, బుధవారం

మొగిలిచెర్ల అవధూత

 *మహాశివరాత్రి..స్వామి ప్రసాదం..*


మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద మహాశివరాత్రి ఘనంగా జరుగుతుంది..RTC వారు సుమారు 80 ప్రత్యేక బస్సులు ఇక్కడికి కేటాయిస్తారు..వేలసంఖ్యలో భక్తులు శ్రీ స్వామివారి సమాధి దర్శనానికి వస్తారు..మేము కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తాము..సుమారు పదిహేను వేల మందికి అన్నప్రసాదం కూడా రెండుపూటలా ఏర్పాటు చేస్తాము..స్వామివారి వద్ద జరిగే ఈ అన్నదానానికి సంబంధించిన ఒక ముచ్చట ఈరోజు మీతో పంచుకుంటున్నాను..ఈ సంఘటన రెండు సంవత్సరాల క్రిందటిది..


"ఇది రెండో సంవత్సరం అన్నయ్యా..శివరాత్రి అన్నదానానికి సరుకులు తెచ్చి ఇవ్వడం..ఆ దత్తాత్రేయుడు చల్లంగా చూస్తే..ప్రతి ఏడూ శివరాత్రి అన్నదానానికి సరుకులు తెచ్చి ఇస్తాను..ఇప్పటి వరకూ మాకు ఏ లోటు చేయలేదు..ఆ తండ్రి మాతో ఉండబట్టే..మేమూ మా పిల్లలూ లక్షణంగా ఉన్నాము.." అని ఈశ్వరమ్మ చెపుతోంది..ఆవిడ చెప్పే మాటల్లో నిజముంది..గత పదేహేనేళ్లుగా ఈశ్వరమ్మను నేను గమనిస్తూనే వున్నాను..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చేటప్పుడు ఈశ్వరమ్మ ఏనాడూ ఖాళీ చేతులతో  రాలేదు..ఒక బియ్యపు బస్తా..లేదా..నూనె డబ్బా..లేదా..ఓ పాతిక కేజీలు కందిపప్పు..ఇలా ఏదో ఒక వస్తువు..అదికూడా అన్నదానానికి పనికి వచ్చే వస్తువులు తీసుకొని రావడం ఆవిడ అలవాటు..


పోయిన సంవత్సరం శివరాత్రికి ఒక నెల రోజుల ముందు శివరాత్రి రోజు మధ్యాహ్నం..మళ్లీ..రాత్రికి..చేయబోయే అన్నదానానికి ఎంత బియ్యం అవసరం అవుతాయని నన్ను అడిగింది..సుమారుగా ఒకటిన్నర టన్ను అవసరం అవుతాయి అని చెప్పాను..ఒక్క క్షణం ఆలోచించి.."ఆ మొత్తం బియ్యం నేను తెచ్చి ఇస్తాను..ఇంక నువ్వు ఎవరినీ అడగొద్దు" అని చెప్పింది..అలాగే అన్నాను..మళ్లీ ఒక గంట  తరువాత వచ్చి.."అన్నయ్యా..ఇప్పుడు మంటపం లో పడుకొని ఉంటే..నిద్ర పట్టింది.."ఒక్క బియ్యం ఇస్తే చాలదు కదా..మిగిలిన సరుకులు..కూరగాయలు..అన్నీ తెచ్చి ఇవ్వు.." అని స్వామి చెప్పినట్టు కలలో అనిపించింది..నిజమే కదా..అన్నీ ఉంటేనే కదా అన్నం పెట్టేది..ఆ సరుకుల పట్టీ కూడా ఇస్తే..అవి కూడా తెచ్చి ఇస్తా..ఇదిగో  నన్ను ఈ విధంగా చెయ్యమని ఇప్పుడే ఆ దత్తయ్య  చెప్పాడు..ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే..అందుకు కారణం ఈ స్వామే కదా..ఆయన మాకు ఇచ్చిన దాని నుంచి..మేము తిరిగి ఇస్తున్నాము..అంతే..అంతా ఆ నాయన చూసిన చల్లటి చూపు.." అని మాతో చెప్పింది...


ఈశ్వరమ్మ వాళ్లది పూర్తిగా వ్యవసాయాధారిత కుటుంబం..మొదటి సారి మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న నాటి నుంచీ..నేటివరకూ శ్రీ స్వామివారినే మనసారా నమ్మి కొలుచుకుంటున్నారు..తనకు కష్టం వచ్చినా..మొగలిచెర్ల కు వచ్చి శ్రీ స్వామివారి సమాధి వద్ద చెప్పుకొని.."స్వామికి నా కష్టం చెప్పుకున్నాను..ఇక ఆ తండ్రిదే భారం.." అని నిశ్చింతగా ఉండేది..ఆమె నమ్మకమో..లేక..ఆ సమాధిలో నిశ్చలంగా కూర్చున్న స్వామివారి కరుణో..తెలీదు కానీ..ఈశ్వరమ్మ కష్టం తేలికగా తీరిపోయేది..ఏదైనా సంతోషకరమైన వార్త విన్నప్పుడు కూడా స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళ్ళేది..సుఖ దుఃఖాలు రెండింటినీ స్వామివారి కి చెప్పుకుంటేనే ఆవిడకు తృప్తిగా ఉండేది..ఆ రెండింటినీ తనకు స్వామివారి ప్రసాదం క్రిందనే భావించడం..వాటిని సమంగా స్వీకరించడం ఆవిడకు అలవాటు..


అలా ఈశ్వరమ్మ కు స్వామివారి ఆదేశం అందింది..అన్నదానం కొరకు మార్గం సుగమం అయింది..ఇక వంటవాళ్లకు..ప్లేట్లు..గ్లాసులు..పందిళ్ళు..ఇత్యాదులకు మరో లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి..అందుకు కూడా దాతలు సహకరించారు..స్వామివారి వద్ద అన్నదానం చేయడానికి ఏనాడూ ఇబ్బంది పడలేదు కనుక..ఈ శివరాత్రికి కూడా భక్తులకు అన్నప్రసాదం సజావుగా అందించే ఏర్పాటు చేస్తున్నాము..


ఈ కార్యక్రమంలో మీరూ మీ శక్త్యానుసారం భాగస్వాములు కావొచ్చు..


సంకల్పం కలిగించేది..అందుకు మమ్మల్ని కార్యోన్ముఖులుగా చేసేది..అంతా స్వామివారే..ఆయన లీలలో ఇది ఒక భాగం మాత్రమే..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: