*దత్తుడు చూపిన దారి..*
"కొన్ని రోజులపాటు కేసు పొడిగించవచ్చు కానీ..మనం ఈ కేసు గెలవలేము..అన్ని రకాల ఆధారాలూ వాళ్ళవైపు బలంగా ఉన్నాయి..మరి ఎలాగ..?" అన్నారు లాయర్ గారు.."నేను కోరుకునేది కూడా ఆరేడు నెలల సమయం మాత్రమే..నేను వాళ్లకు బాకీ ఉన్నమాట నిజం..ఇప్పటికిప్పుడు అంత మొత్తాన్ని కట్టుకోలేను..నావద్ద ప్రస్తుతం ఉన్న డబ్బు వాళ్లకు ఇచ్చి..కొంత సమయం అడుగుదామని అనుకుంటున్నాను..కానీ వాళ్ళు అందుకు సుముఖంగా లేరు..కోర్టులోనే తేల్చుకుంటాము అని ఖచ్చితంగా చెప్పారు..అందువల్ల మీ సహాయం అడుగుతున్నాను.." అన్నాను.."అది కాదండీ..ప్రస్తుతం ఉన్న జడ్జీ గారు ఇలాటి కేసులకు ఎక్కువ సమయం ఇవ్వటం లేదు..త్వరగా ముగించి శిక్ష ఖరారు చేస్తున్నారు..మీరు జాగ్రత్త పడటం మంచిది..నా వరకూ ఓ రెండుమూడు నెలలు పొడిగించగలను..ఆలోపల మీరు మీ ప్రత్యర్థులతో రాజీ పడటం మంచిది..మీ అన్నయ్య గారు వృత్తిపరంగా నాకు మంచి స్నేహితులు..ఆ చనువుతో చెపుతున్నాను.." అన్నారు.."సరేనండీ..మీ ప్రయత్నం మీరు చేయండి..నేను మా ఊరు వెళ్లి.. ఆ దత్తాత్రేయుడి పాదాలు పట్టుకుంటాను..అంతకు మించి నాకు వేరే దిక్కు కూడా లేదు.." అని చెప్పాను..ఆరోజు కోర్టుకు హాజరయ్యాను..మరో పదిహేను రోజులకు వాయిదా వేసి పంపించారు..నేను మా ఊరు వచ్చేసాను..
మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర నిర్వహణా బాధ్యతలు తీసుకున్న తొలినాళ్లలో జరిగిన సంఘటన..అప్పట్లో నేను పూర్తిగా ఆర్ధిక సమస్యల్లో చిక్కుకొని వున్నాను..ఋణదాతల వత్తిడులు ఎక్కువగా ఉన్నాయి..వాటికి తోడు కోర్టు కేసులూ ఉన్నాయి..స్వామివారి మందిరం నిర్వహిస్తూ..ఈ బాధలను అనుభవిస్తూ..రోజులు గడుపుతున్నాను..ఆర్ధికంగా సమస్యల్లో వున్నప్పుడు..దగ్గరగా ఉన్నవాళ్లు కూడా దూరం జరిగిపోతారు..అది సహజం కూడా..విజయవాడ లో ఈ కేసు నడుస్తోంది..నా మీద కేసు పెట్టిన కంపెనీ వాళ్ళతో నేరుగా మాట్లాడదామని నేను శతవిధాల ప్రయత్నం చేసాను..కానీ కుదరలేదు..వాళ్ళు ఆ అవకాశమూ ఇవ్వలేదు..నేను వాళ్లకు బాకీ పడ్డ మొత్తం లో సగం చెల్లించడానికి సిద్ధంగా వున్నాను..మిగిలిన సగానికి కొంత సమయం తీసుకొని చెల్లించాలని నా ఆలోచన..వాళ్ళు కేవలం కోర్టు ద్వారానే విషయం తేల్చుకోవాలని అనుకున్నారు..
లాయర్ గారి వద్దనుంచి తిరిగి ఇంటికి వచ్చిన మరునాడు..మొగిలిచెర్ల కు మా దంపతులము వచ్చాము..విజయవాడలో లాయర్ గారితో జరిగిన సంభాషణ మొత్తం ఆవిడతో చెప్పాను.."స్వామివారి పాదాల వద్ద మన సమస్య విన్నవించుకుందాము..పరిష్కారం చూపుతారు అనే నమ్మకం నాకు ఉంది.." అని ఆవిడ చెప్పింది.."చూద్దాం.." అన్నాను..స్వామివారి మందిరానికి చేరిన వెంటనే కాళ్ళూ చేతులూ శుభ్రం చేసుకొని..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..మనసులోని ఆవేదనను చెప్పుకున్నాము..ఆ ప్రక్కరోజు శనివారం..స్వామివారి పల్లకీసేవ లో మా దంపతులము కూడా అర్చన చేయించుకున్నాము..ఆదివారం ఉదయం భక్తుల రాకపోకలతో ఉన్న హడావుడి లో నా సమస్య గురించి తాత్కాలికంగా మర్చిపోయాను..మధ్యాహ్నం అర్చకస్వామి స్వామివారికి నైవేద్యం పెట్టి..హారతి ఇచ్చే సమయం లో మళ్లీ మా దంపతులము స్వామివారిని మనసులోనే వేడుకున్నాము..
ఆరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయం లో మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోంచి నలుగురు వ్యక్తులు లోపలికి వచ్చారు..మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేసి..సమాధి ని దర్శించుకొని, తమ గోత్రనామాలతో అర్చన చేయించుకొని ఇవతలికి వచ్చారు.."మేము విజయవాడ నుంచి వచ్చామండీ..ఇద్దరం లాయర్ల గా ఉన్నాము..మరో ఇద్దరు ఆడిటర్లు..భైరవకోన చూద్దామని వచ్చాము..అక్కడ ఈ క్షేత్రం గురించి చెపితే..ఇలా వచ్చాము.." అన్నారు..
నాకెందుకో నా సమస్య వీళ్ళతో చెప్పాలని అనిపించింది..ఆ ఇద్దరు లాయర్లనూ కూర్చోబెట్టి విజయవాడ కోర్టు కేసు విషయం చెప్పాను..అంతా విన్నారు.."మీరు సగం డబ్బు చెల్లించడానికి సిద్ధంగా వున్నారు..మిగిలిన సగం చెల్లించడానికి మీకు మరో ఐదారు నెలల సమయం కావాలి..ఈ వార్త మీరు మీమీద కేసు వేసిన వాళ్ళతో చెప్పాలని అనుకున్నా..కుదరటం లేదు..అంతే కదా ప్రసాద్ గారూ..?" అన్నారు.."అవునండీ.." అన్నాను.."మీరేమీ కంగారు పడకండి..ఆ కంపెనీ తరఫున ఉన్న లాయర్ల లో నేనూ ఒకడిని..నేను వాళ్లకు చెపుతాను..మీరు నేరుగా వాళ్ళతో మాట్లాడే ఏర్పాటు చేస్తాను.." అని ఆ ఇద్దరిలో ఒకరు అన్నారు..నా నెంబర్ తీసుకున్నారు..కేసు నెంబరూ తీసుకున్నారు..వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..ఆ ప్రక్కరోజు సోమవారం ఉదయం పదిగంటల వేళ.."ప్రసాద్ గారూ..నిన్న మీతో మాట్లాడిన లాయర్ గారిని మాట్లాడుతున్నాను..మీరు చెప్పిన విషయం కంపెనీ వాళ్ళతో చెప్పాను..మిమ్మల్ని ఎల్లుండి బుధవారం రమ్మన్నారు..తప్పకుండా విజయవాడ రండి..మీతోబాటు మీ లాయర్ గారిని రమ్మనండి..నేనూ ఉంటాను..మాట్లాడుకుందాము.." అన్నారు..
"స్వామివారు మనకు దారి చూపిస్తారు అని ముందే చెప్పాను కదా..మీరు ఎల్లుండి విజయవాడ వెళ్ళండి.." అని మా ఆవిడ అన్నది..మళ్లీ ఇద్దరమూ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వచ్చాము..బుధవారం విజయవాడ వెళ్ళాను..నాతో మాట్లాడిన లాయర్ గారు వున్నారు..కంపెనీ ప్రతినిధుల తో నేరుగా మాట్లాడటం జరిగింది..ప్రస్తుతం నేను చెల్లించగలిగిన మొత్తాన్ని చెప్పాను..మరే అభ్యంతరమూ లేకుండా ఒప్పుకున్నారు..ఒక గంటలోపలే అంగీకారం కుదిరింది..తరువాతి వాయిదా నాటికి కేసు ఉపసంహరించుకోవాలని అనుకోవడం..అందుకు తగ్గ కాగితాలు సిద్ధం చేయడం కూడా జరిగిపోయింది..వాళ్ళను ఒప్పించిన ఆ లాయర్ గారికి కృతజ్ఞతలు చెప్పాను..
ఆరోజు మధ్యాహ్నం మా లాయర్ గారు నాతో మాట్లాడుతూ.."ప్రసాద్ గారూ మీరు అదృష్టవంతులు..ఈ కేసు లో ఆ కంపెనీ వాళ్ళు రాజీ పడకుండా వుండి ఉంటే..మీరు డబ్బూ కట్టాలి..పైగా శిక్ష కూడా పడేది..దైవమే మిమ్మల్ని కాపాడాడు.." అన్నారు..
ఆ దైవం వేరెవరో కాదు..మొగిలిచెర్ల లో సిద్ధిపొందిన అవధూత దత్తాత్రేయుడే అని వేరే చెప్పుకోవాలా?..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి