మన మహర్షులు- 42
శ్వేతకేతు మహర్షి
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
పూర్వం మంత్ర ద్రష్ట, మంత్రవేత్త, మంత్ర మహితుడు, మహాతపస్వి అయిన ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతుడు.
అష్టావక్రుడి మేనమామ శ్వేతకేతుడు. ఇద్దరూ ఒకే సమయంలో పుట్టారు.
స్వచ్చమైన తెల్లటి రంగుగల శరీరంతో పుట్టాడని శ్వేతకేతుడకి ఆ పేరు పెట్టారు.
అష్టావక్రుడు శ్వేతకేతుడు ఒకే చోట పెరిగారు. శ్వేతకేతుడు చిన్నతనంలోనే సర్వ వేదశాస్త్రాలు, వేద రహస్యాలు, ధర్మ మర్మాలు
తెలుసుకుని పూర్ణిమనాటి చంద్రుడిలా వెలిగిపోయాడు.
శ్వేతకేతుడు మహా తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొంది వేదతత్త్వం, క్రియాస్వరూపం,
కర్మఫల త్యాగం, ఆత్మజ్ఞానం సంపాదించి బాల సూర్యుడిలా ప్రకాశించాడు.
శ్వేతకేతుడికి వివాహం చేయ్యాలని నిర్ణయించుకున్నాడు ఉద్దాలకుడు .అదే సమయంలో మహాతపస్వి, వేదవేత్త, శాస్త్రవిజ్ఞుడు, ఆచారవంతుడు, ధర్మజ్ఞుడు
అయిన దేవల మహర్షి తన కూతురు సువర్చలకి పెళ్ళి చేయ్యాలని వరుడి కోసం వెతుకుతున్నాడు.
సువర్చల విద్య, వినయం, విజ్ఞానం, అందం అన్నీ కలబోసి లక్ష్మీదేవిలా వుంటుంది. ఎవర్నిచ్చి చెయ్యాలా? అని దేవలుడు ఆలోచిస్తున్నాడు.
తండ్రితో గ్రుడ్డివాడు, గ్రుడ్డివాడు కానివాడు ఒకే కాలంలో వున్న మహాత్ముడైతేనే నేను వివాహం చేసుకుంటానని చెప్పింది సువర్చల.
దేవల మహర్షి అల్లాంటివాడిని నువ్వే ఎంచుకోమని చెప్పాడు సువర్చలకి.
ఏకకాలంలో అంధుడై, అంధుడు కానివాడు ఎవరుంటారని ఒక్కొక్కళ్ళే వెళ్ళి పోతున్నారు.
శ్వేతకేతుడు దేవలుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నేను అలాంటివాడ్నే అన్నాడు సువర్చలకి వివరంగా చెప్పాడు.
ప్రపంచం మిధ్య, వినడం, మాట్లాడడం, చూడడం, తాకడం పన్లు చెయ్యడం ఇల్లాంటివన్నీ మిథ్య అని ఏ జ్ఞాన నేత్రానికి తెలుసో ఆ జ్ఞాన నేత్రం లేనివాడు గ్రుడ్డివాడు. అది నాకుంది కాబట్టి నేను గ్రుడ్డివాణ్ణి కాదు..
కాని నేను గ్రుడ్డివాణ్ణి .... లోకుల దృష్టిలో వాళ్ళల్లాగా నేను వస్తువులు చూడట్లేదు. వారి అజ్ఞాన దృష్టి నాకు లేదు. కాబట్టి వాళ్ళదృష్టిలో నేను గ్రుడ్డివాడిని.
ఈ విధంగా ఒకే క్షణంలో నేను గ్రుడ్డివాణ్ణి, గ్రుడ్డివాణ్ణి కాని వాణ్ణి కూడా. అందుకే నన్ను పెళ్ళి చేసుకోమన్నాడు శ్వేతకేతుడు.
సువర్చల అంగీకరించగానే దేవలుడు, ఉద్దాలకుణ్ణి మిగిలిన ఋషులందర్నీ పిలిచి సువర్చలాశ్వేతకేతులకి వివాహం జరిపించారు.
శ్వేతకేతుడు వేరే ఆశ్రమం ఏర్పాటు చేసుకుని గుహస్థధర్మం నిర్వర్తించాడు.
సువర్చాలా శ్వేతకేతులు ధర్మకార్యాలు చేస్తూ గుణవంతులైన సంతానాన్ని పొంది పితృదేవతల్ని, యజ్ఞాలు చేసి దేవతల్ని, తపస్సు అధ్యయనం అనే సత్ప్రవర్తనతో ఋషుల్ని సంతోషపెట్టి భూలోకంలోనే స్వర్గలోకం చూస్తూ అందరికీ చూపిస్తూ అపూర్వ దంపతుల్లా వెలిగారు
శ్వేతకేతుడు బ్రహ్మజ్ఞాన విషయాలన్నీ భార్యకి చెప్పి ఆమెని కూడా జ్ఞానవంతురాల్ని చేసి చివరికి ఇద్దరు సన్యాసం తీసుకుని మోక్షం పొందారు.
సమంగానది దగ్గర సోమకశిచి తీర్థం దగ్గర శ్వేతకేతు తపస్సు చేసిన ప్రదేశాన్ని "శ్వేతకేతుతీర్థం' అంటారు.
ఇక్కడే సరస్వతీదేవి మానుష రూపంలో శ్వేతకేతుడికి దర్శనమిచ్చింది.
ఈ విధంగా దంపతులిరువురు జ్ఞానదీక్షపరులై ధర్మజీవనం సాగించి మోక్షం పొందారు.
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి