27, ఏప్రిల్ 2021, మంగళవారం

#లచ్చి కథ.


               🌷🌷🌷

#లచ్చి 


"మామ్మా! ఇవాళ మా స్కూల్లో ఓ గమ్మత్తు జరిగింది" ఎనిమిది సంవత్సరాల సిద్దూ అన్నాడు. 


"ఏంటి కన్నా" మనవడి బుగ్గలు పుణికి అడిగింది సావిత్రమ్మ. 


రోజూ పడుకునే ముందు నాయనమ్మ చేత కథ చెప్పించుకుని గాని నిద్రపోడు 'సిద్దూ' అని ఇంట్లో అందరూ ముద్దుగా పిలుచుకునే సిద్దార్థ. 


"మామ్మా! లచ్చి తెలుసుకదా నీకు...దాన్ని నాక్లాస్మేట్ రంగడుతో పెళ్లి చేస్తానంటే పారిపోయి స్కూలుకొచ్చేసింది. వాళ్ళ నాన్న, అమ్మతో పాటు...రంగడు అమ్మా నాన్న కూడ వచ్చి దాన్ని లాక్కు పోతూంటే శారదా టీచర్ పట్టుకుని ఆపారు.


" ఏదీ మల్లిగాడి కూతురు లచ్చినా?!"అడిగింది ఆవిడ. 


అవునన్నట్లు తలూపేడు. 


"మరి వాడు ఊరుకున్నాడా?"  


"లేదు మామ్మా! ఇదిగో టీచరమ్మా నువ్విలా అడ్డొస్తే మరేదగుండదు" అని రంగడు నాన్న అన్నాడు. 


అప్పుడు "సరే మా అన్నయ్య పోలీసాఫీసరు ఫోన్ చేసి రప్పిస్తా" అని టీచర్ అంటోన్నా వినకుండా లాక్కెళ్ళి పోయారు" సిద్ధూ చెప్పింది విని. 


"అయ్యో బొడ్డూడని పిల్ల...దానికి పెళ్ళేమిటి...ఈ రోజుల్లో కూడా..." అనుకుంది. మనవడు కథ విని నిద్రపోయాక ఆవిడ ఈవిషయమే ఆలోచిస్తూ గతంలో కెళ్ళి పోయింది.  


***********


"ఈ సంవత్సరం సావిత్రి పెళ్లిచేసేద్దామను కుంటున్నాను" పరాంకుశం తన స్నేహితుడు తాతారావుతో అన్నాడు. 


"చక్కగా చదువుకుంటూన్న పిల్లకి పెళ్లికి తొందరేమొచ్చింది?" అని తాతారావు అంటే 


"ఇప్పటికే లేటుచేశానని మాఅమ్మ మొత్తుకుంటోంది.

ఆడపిల్లకు ఎనిమిది సంవత్సరాలు నిండకుండా చేయాలి. పిల్లకప్పుడే పన్నెండేళ్ళు నిండుతున్నాయని గొడవ చేస్తోందిరా! తప్పేటట్టులేదు" అన్నాడు. 


బయట అరుగుమీద మాట్లాడుకుంటున్న వారి సంభాషణ వింటున్న సావిత్రి భయంగా తల్లి వీరవేణి వంక చూసింది. 


"అమ్మా... నా కప్పుడే పెళ్ళేమిటమ్మా" కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వలేని నిస్సహాయస్థితి ఆమెది. 


 ఇంకా ఇప్పటికీ తన తోటి పిల్లలతో బొమ్మల పెళ్ళిళ్ళు చేసి ఆడుకుంటూన్న అమ్మాయికి పెళ్లి చేయడం తనకు కూడ ఇష్టంలేదని చెప్పలేని దయనీయస్థితిలో ఉంది. 


పెళ్ళయి ఏడాది తిరక్కుండానే మూడునెలల గర్భంతో  తలచెడి పుట్టింటికి చేరిన వీరవేణి...వారి ఆరుగురు సంతానంలో ఆఖరిది. 


అందరికంటే పెద్దవాడయిన అన్నయ్య పరాంకుశం ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే నలుగురు అక్కలకు జరిగే మర్యాద వితంతువైన తనకు దక్కదని తొందరలోనే అర్ధమయింది ఆమెకు. 


'అన్న ఇంట్లోనే ఉంటున్న తల్లిదండ్రులవద్ద కాక మరెక్కడ ఉండగలను...తన తలరాత ఇంతే' అనుకుని ఇంట్లో వదినగారికి అణగిమణగి ఉంటూ రోజులు నెట్టుకొస్తూంది. 


తనకు కలిగిన ఆడపిల్ల సావిత్రిలో భర్తను చూసుకుని దుఃఖాన్ని మరచి జీవితం సాగిస్తోంది. 


మరునాడు "అన్నయ్యా! సావిత్రి పెళ్ళికి తొందరేముంది?! మంచి మార్కులు వస్తున్నాయి. పోగ్రెస్ కార్డు మీద సంతకం చేసే నీకు నేను చెప్పనక్కరలేదు. స్కూల్ ఫైనల్ అయాక చేస్తే బాగుంటుందని..." వాక్యం పూర్తి చేయకుండా అన్నగారి ముఖంలోకి చూసింది. 


అతను సమాధాన మివ్వక పోయేసరికి కళ్ళల్లో 

తిరుగుతున్న నీళ్లను అతనికి కనపడనీయకుండా తలదించుకుని చెంగుతో కళ్ళు వత్తుకుంటూ వెనుదిరిగింది. 


సంబంధం చూసి ముహూర్తం కుదిరి పెళ్లిచేసి పంపడానికి సంవత్సరకాలం పట్టింది. ఎయిత్ పరీక్షలు వ్రాసి క్లాస్ ఫస్ట్ వచ్చిన సావిత్రి అయిదు వరకు చదివి అనంతరం పౌరోహిత్యం చేస్తున్న రామ్మూర్తికి ఇల్లాలయి అతని చిటికిన వేలు పట్టుకుని గృహిణిగా ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెట్టింది. 


సహజంగా బుద్ధిమంతురాలు...తల్లి ఒద్దికలో మేనమామ ఇంట పెరిగిన పిల్లేమొ ఎవరిని పన్నెత్తుమాట అనకుండా అనిపించుకోకుండా మసలేది. 


రామ్మూర్తికి ఐదుగురు అన్నలు ఇద్దరు అక్కలు ఒకచెల్లెలు వెరసి తొమ్మండుగురు వాళ్లు. అక్కచెల్లెళ్ళు ముగ్గురూ  పెళ్ళిళ్ళయినవాళ్ళే. ఐదుగురు అన్నల్లో పెద్దవాళ్ళిద్దరూ వ్యవసాయం చేస్తూంటే మూడోఅతను ఆ ఊరి దేవాలయంలో అర్చకుడుగా ఉన్నాడు. 


మిగిలిన ఇద్దరు రామ్మూర్తిలానే పురోహితులు. 


భర్త యొక్క పెద్దక్క ఇద్దరు కూతుళ్లు, చిన్నక్క కొడుకైన సూర్యం... సావిత్రి కన్న ఒకటిరెండు ఏళ్ళు పెద్దవాళ్ళే. 

వాళ్ళు రామ్మూర్తిని అందరిలాగే 'రామం' అనే పిలిచేవారు. 

సావిత్రిని మాత్రం ఆమెను ఏదైనా అడగాలన్నా, చెప్పవలసి వచ్చినా... మాటకు ముందు 'అత్తా' అని పిలిచి మరీ అడగడం చెప్పడం చేసేవారు. 


మగపిల్లవాడు పోనీ పేరుపెట్టి పిలిస్తే బాగోకపోవచ్చు కాని ఆడపిల్లలు 'సావిత్రి' అని పిలవచ్చుగా...! అని పెళ్ళయిన కొత్తలో అనుకునేది. 


ఇరుగుపొరుగు వారు కూడ...తన ఈడువారు తనకంటే పెద్దవాళ్ళు కూడ అలాగే పిలిచేవారు. మొదట్లో మనసు చివుక్కు మన్నా తర్వాత అలవాటయిపోయింది. 


రామ్మూర్తి చుట్టుపక్కల నాలుగయిదు గ్రామాలకు తానే పౌరోహిత్యం చేసేవాడు. సంపాదన బాగానే ఉండేది. అన్నదమ్ములు ఐకమత్యంతో మెలగడమే కాదు 

తోడికోడళ్ళు కూడ ఆ విధంగానే ఉంటూ ఏదైనా 

చిన్నచిన్న తగాదాలు వచ్చినా వెంటనే సర్దుకు పోయేవారు. 


సావిత్రికి ముందుగా ఒకమ్మాయి పుట్టింది. ఆతర్వాత 

పది సంవత్సరాలకు పుట్టినవాడే ఈ 'సిద్ధూ' తండ్రి.


సావిత్రికి ఏదైనా అసంతృప్తి అనేది ఉందీ అంటె అది కేవలం తన తల్లిని తమ ఇంట్లో ఉంచుకుని చూసుకోలేక పోయాననే బాధతో కూడిన ఆలోచనే. 


భర్త పోయి వేరేదిక్కులేక మేనమామ ఇంట్లో తన తల్లి పడే అవస్థ చూసి అనుకునేది... బాగా చదివి ఉద్యోగం చేసి అమ్మను తన వద్ద ఉంచుకోవాలని. అలా ఇష్ట పడిన అబ్బాయినే వివాహమాడాలని. 


అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం కాదేమో!!


రామ్మూర్తిని అడిగితే కాదనడని తెలుసు ఆమెకు.  


ఉమ్మడికుటుంబంలో అమ్మకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో నన్న భయంతో కొంత... అమ్మకూడ రావడానికి ఒప్పకోదేమో నన్న శంకతో కొంత... నోరువిప్పి అడగలేకపోయింది. 


పిల్లలు పెద్దయి వాళ్ళ చదువుల కోసమయితేనేమి

ప్రైవసీ కోసమైతేనేమి ఎవరికివారు వేరే వేరే ఊళ్ళు వెళ్లి విడి సంసారాలు ఏర్పడేవేళకు తల్లి కాలం చేసింది. ఈవిధంగా ఆమె కోరిక తీరలేదు. 


ఆలోచిస్తోన్న సావిత్రి నాలుగు సంవత్సరాల క్రితం గతించిన భర్తను తలచుకొని చిన్నగా నిట్టూర్పు విడిచి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది.


********


మర్నాడు సావిత్రమ్మ 'మల్లిగా' అని పిలిచే మల్లేశ్వర్రావుకు కబురంపి వచ్చాక మందలిస్తూంటే 


"ఆగిపోయిందమ్మా పెళ్ళి ఆ శారదమ్మ దయవల్ల" అన్నాడు. 


"ఆగిపోయిందా... హమ్మయ్య... అదిసరే దానికప్పుడే పెళ్లి చేద్దామని ఎందుకనుకున్నావురా!" అన్న ఆవిడతో  


"ఏం చేయనమ్మా ఆగణేష్ కాడ అప్పుతీసుకుని రెండేళ్ళవుతోంది. ఇంకొన్ని రోజులాగు తీర్సేత్తాను అంటోన్న ఇనకుండా పిల్లని నా కొడిక్కిచ్చి పెళ్ళయిన చేయి కాకుంటే వెంటనే బాకీయైన తీర్చేయ్ అంటూ ఒకటే గోలమ్మా" అన్నాడు.  


"పెళ్ళికి బాకీకి లింకేమిట్రా" విస్తుబోయిందావిడ. 


"పిల్లదాని తల్లి పోయిందని తెలుసు కదమ్మా మీకు. దాని పేరనున్న అరెకరం లచ్చికేగా ఎల్తది. ఇప్పుడు కాకపోయినా కాపరానికి పంపేటప్పుడు ఎలానూ ఇచ్చేత్తమని ఆడాస."


"అయితే మాత్రం ఊరి పెద్దలముందు పెట్టి తేల్చుకోవాలి అంతేకాని తల్లిలేని ఆ పసిదాని గొంతు కోద్దామనుకోవడం తప్పనిపించలేదట్రా! ఇప్పుడు శారద ఆపింది కాబట్టి సరిపోయింది. మళ్లీ ఈ అఘాయిత్యానికి పూనుకోరనేముంది! ఒరేయ్ మల్లిగా లచ్చి జీవితాన్ని 

నాశనం చేయకురా... నీరెండో పెళ్ళాం స్వయాన దాని పినతల్లేకదా! దానికెలా మనసొప్పిందిరా...!"


"ఆడొచ్చి గోలపెడుతుంటే  అదిమాత్తరం ఏటి సేత్తాదమ్మా దానికీ ఇట్టంలేదు ఇలా చేయడం...ఇక పర్వాలేదమ్మా పిల్లని శారదమ్మ గోరు తీసుకుపోయినారు.


"శారద తీసుకెళ్ళడమేమిటిరా" మళ్లీ ఆశ్చర్యపోయింది. 


"అవునమ్మా! పిల్లను చదివించి పెద్దయాక దానికిట్టమైన వాడికిచ్చి పెళ్లిచేసే బాద్దెత నేను తీసుకుంటున్నాను. ఇక నుంచి ఇది నా కూతురు అని చెప్పి తీసుకుపోయారమ్మా!"


ఆవిషయం విన్నాక ఆవిడ మనసు శాంతించింది. మల్లేశ్వర్రావు వెళ్ళిపోయాడు. 


*********


శారద గురించి చెప్పవలసి వస్తే ఆమె ఒక అభాగిని అనవచ్చు. మంచి సాంప్రదాయ కుటుంబంలో పుట్టింది. డిగ్రీ అనంతరం బియిడి చేసి టీచర్ పోస్టులో జాయినయిన వెంటనే కొలిగ్ అయిన శ్రావణ్ కుమార్ తో పెళ్ళయింది. 


తర్వాత తెలిసింది అతను శ్రావణ్ కాదని రావణ్ అని. 

ఇంకా చెప్పాలంటే రావణునితో పోల్చడం తప్పేనేమో  పురాణాల్లో ఎక్కడా రావణుడు స్త్రీని హింసించినట్లు చెప్పలేదనుకుంటా. 


శ్రావణ్ తిరుగుబోతే కాదు... శాడిస్ట్ కూడ. మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెడుతూంటే తట్టుకోలేక 

విడాకులు తీసుకుని ఒంటరిగా బతుకుతోంది. మళ్లీ పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అన్నా చేసుకోలేనంత 

విరక్తి కలిగేలా చేశాడు వాడు ఆమెకు. 


స్కూలుకు వచ్చి లచ్చిని లాక్కునిపోయాక వెంటనే అన్న జగదీశ్ కు ఫోన్ చేసి వచ్చినవెంటనే మల్లేశ్వర్రావు ఇంటికి బయలుదేరి వెళ్లారు. అప్పటికే పీటలమీద కూర్చోపెట్టి బ్రాహ్మణుడు మంత్రాలు చదువుతున్నాడు. లచ్చి ఏడుస్తోంది. చేతిలో చంటిబిడ్డను ఎత్తుకున్న సవతితల్లి (పినతల్లి) దీనంగా చూస్తోంది. వీళ్ళను చూసి గణేష్ భయపడి పారిపోబోతూంటే పట్టుకున్నాడు. 


మల్లేశ్వర్రావును గణేష్ ను జీపెక్కించబోతే కాళ్ళావేళ్ళాబడి బతిమాలుకొన్నారు. ఇకపై ఇలాంటి తప్పుడుపని సేయమని  అన్నా వదలలేదు. శారద చెప్పేక వదిలితే గణేష్...కొడుకుని పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు శారద లచ్చిని "నాతో వచ్చి ఉంటావా" అని అడిగి... అది ఒప్పుకున్నమీదట  


"అన్నయ్యా! లక్ష్మిని నాతో తీసుకువెళ్దామను కుంటున్నాను. దానికి నువ్వు ఏమంటావ్" అంది. 


"విషయం స్పష్టంగా చెప్తే కదా ఏమనడానికైనా" అతనన్నదానికి 


"ఇకనుంచి నాకు పెంపుడు కూతురు ఇది. దీని చదువుసంధ్యలు, పెళ్లి చేయడం సమస్తం నేనే చూసుకుంటాను. అదైనా నీవంగీకరిస్తేనే..." అంది. 


"అలాగే శారదా! పెళ్లిలో బుట్ట ఎత్తి తీసుకువచ్చే మేనమామగా ఓకే చెప్తున్నా" ఈవిధంగా నైన చెల్లెలు సంతోషంగా ఉంటే చాలని మనసులో అనుకున్నాడు. 


ఈవిధంగా బొమ్మలపెళ్ళిలాంటి ఆ ఘట్టం ముగిసింది.

🌷🌷🌷🌷🌷

#కమలాదేవి #పురాణపండ

కామెంట్‌లు లేవు: