మహాభారత తాత్పర్యము
ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉన్నది. ఎక్కడ లేనిది ఎక్కడా లేదు. అన్న వ్యాసుడి వాక్యం మహాభారతాన్ని స్థూలంగా వర్ణించేది. విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రతి అంశం దీనిలో నిక్షిప్తం కావడం వల్ల విశ్వం యొక్క తాత్పర్యం గ్రహించడం ఎంత కష్టమో, దీని తాత్పర్యం గ్రహించడం అంతే కష్టం. మహాభారత ఆరంభంలో రెండు చెట్లను వ్యాసుడు వర్ణించాడు. యుధిష్ఠిరుడనే ధర్మ వృక్షము, దుర్యోధనుడనే మన్యు వృక్షము ఈ గాథకి ప్రధాన ఆధారాలు. రెండు చెట్లు విడిగా వర్ణించడం వల్ల ఈ గాథంతా రెండు ప్రవాహాలుగా, సమాంతరంగా.. కొన్ని చోట్ల ఓతప్రోతంగా ప్రవహించినట్లు గ్రహించవచ్చు. మొత్తం గాథలో శంతనుడి కామ భావం, ఆధారంగా సత్యవతి వివాహం జరగడం భీష్ముడు రాజ్యత్యాగం చేయడం ఈ కథకు ఆధార బిందువు. అయితే, భీష్ముడి వంటి దైవాంశ సంభూతుడు, ఆద్యంతము వ్యాపించి ఉండటము, అతడు సమర సందర్భంలో ధర్మ పక్షంలో కాకుండా అధర్మ పక్షంలో నిలిచి పోవడం ఒక విలక్షణమైన విరోధాభాస. పతితమైన బ్రాహ్మణ్యం శస్త్రాన్ని ధరించడం ద్రోణుడి పాత్రలో వ్యక్తమైతే, ఆతడు ప్రతీకార వాంఛతో ద్రుపదుణ్ణి పరాభవించటం, ఏకలవు్యడి నుంచి గురుదక్షిణగా అంగుష్ఠాన్ని యాచించడం, మొత్తం యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా ప్రవర్తించటం ఒక విచిత్రమైన సన్నివేశం. అంతేకాక ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ఎప్పుడూ ధర్మ చైతన్యంతో సంబంధం లేకుండా అసూయతో జీవించటం, యుద్ధాంతంలో అపాండవం కరిష్యామి అని చనిపోతున్న దుర్యోధనుడికి వాగ్దానం చేసి నిద్రితులైన ఉప పాండవులను సంహరించటం, గర్భస్థుడైన ఉత్తరాసుతుణ్ణి సంహరించటానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించటం ఒక పిశాచావేశం లాగా గోచరిస్తుంది. అర్జునుడితో పాటు తాను రుద్ర ఆరాధకుడైనా, రుద్రుడి లోని ఆనుకూల్యాంశం ఇతణ్ణి ఎప్పుడూ ఆవేశించలేదు.
ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేకపోవడం, పాండురాజు దిగ్విజయాలు సాధించి అతని చేత నూరు అశ్వమేధాలు చేయించినా, చివరకు అరణ్యవాసంలో శాపగ్రస్తుడై మరణించటం వల్ల ధృతరాష్ట్రుడు, రాజు కావడం సంభవించింది. రాజ్యాధికారం కలిగిన గుడ్డివాడు, అతని ప్రవృత్తి అంతా అంతర్బహిర్చేతనలలో వైరుధ్యంతో పుత్ర మమకారం వల్ల పాండవుల యందు పెంచుకున్న అప్రీతి వల్ల ఒక నాటకంగా జీవితం గడపడం జరిగింది. మహా భారతానికి మొత్తం నాయకుడైన ధర్మరాజు ద్యూత వ్యసనం వల్ల ద్రౌపది దయ వల్ల కలిగిన రాజ్యం కూడా పోగొట్టుకోవడం అరణ్యవాస, అజ్ఞాత వాసములు చేయవలసి వచ్చింది. ధర్మరాజులో ఎంత మెత్తదనం ఉన్నదో అంతటి ప్రతీకారేచ్ఛ కూడా ఉన్నట్టు అది గడుసుదనం వల్ల చప్పబడినట్లు యుద్ధ పర్వాల్లో గోచరమవుతుంది. దుర్యోధనుడు క్రోధము, అసూయ ఈ రెండు లక్షణాలు మూర్తీభవించినవాడు. తనకు జన్మతః సంక్రమించని రాజ్యాధికారాన్ని పొంది దాన్ని ఇతరులతో పంచుకునే ఉద్దేశం లేకుండా దురాశ వల్ల పాండవులను చిన్ననాటి నుంచి ప్రతీకారేచ్ఛతో రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ విషయంలో అతడు చేయని దుష్కార్యం, పాపము మరెక్కడా లేదు. దుశ్శాసనుడు కేవలం సేవాధర్మం కలిగిన వాడే తప్ప అతని స్వతంత్రించి చేసిన కార్యమంటూ ఏమీ లేదు. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో కర్ణుడు ప్రవర్తించిన తీరు సజ్జనులకెవరికైనా సిగ్గు తెప్పించేదే. దుర్యోధనుని వస్త్రాపహరణాది దుష్కార్యాలకు ప్రేరేపించి తన దుష్టమైన వాక్కుల చేత భారతానికే కళంకం ఆపాదించినాడు. అతని లోని ధర్మవేతృత, దానుగుణం, పరాక్రమము, మిగిలిన గుణాలన్నీ ఈ ఒక్క దోషంతో తుడుచుకుపెట్టుకు పోతున్నవి.
అసలు విచిత్ర వీర్యుడు చనిపోయిన తరువాత సత్యవతి ప్రార్థననుసరించి భీష్ముడే రాజ్యాన్ని గ్రహిస్తే, చరిత్ర మరొకరకంగా ఉండేది. ఆతడు రాజు కాకున్నా, కాశీరాజు సభలో ఆతని పుత్రికలను బలవంతంగా తీసుకువచ్చినప్పుడు తరువాత అంబను విడిచిపుచ్చడం, ఆమె తిరిగి రాగా స్వీకరించకపోవడం ఆ పట్టుదలను నిలుపుకోవడం కోసం గురువుతో కూడా పోరాడటం, అనేక సందేహాలకు ధర్మ వైరుధ్యాలకు తార్కాణమైన అంశం. యుద్ధం తరువాత అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకు ఉపదేశం చేయడం తాను అంతకు ముందు ఆచరించిన దోషాలను తొలగించుకోవడం కోసం చేసిన ప్రాయశ్చిత్త కర్మగా కనిపిస్తుంది. అతని లోని కృష్ణ భక్తి తత్త్వ జ్ఞానం, ఇవేవీ అంపశయ్య మీదకు చేరేదాకా పనిచేసినట్టు లేవు. భీష్ముడు వసు రుద్రాదిత్యులలో వసువులు భూ చైతన్యానికి చెందిన వారు. అందువల్లనే శరీరాన్ని పోషించిన కౌరవుల యెడ ఆతడు కృతజ్ఞుడై ఉండటం జరిగి ఉండవచ్చు.
మహాభారతంలో ప్రధానంగా మూడు యజ్ఞాలు, కనిపిస్తుంటాయి. సర్పయాగము, రాజసూయం, అశ్వమేథం. సర్పయాగం ప్రతీకార బుద్ధితో ఒక వ్యక్తి చేసిన దోషానికి ఒక జాతిని సంహరించే కార్యం. అంతకు ముందు భార్గవ రాముడు క్షత్రియుల విషయంలో ఇదే పని చేశాడు. ఈ ప్రతీకార బుద్ధి వల్ల సత్వరజస్సులు అణగి తమోగుణం ఆవరిస్తుంది. భారత ఆరంభం ప్రవేశ ద్వారం ఈ తమస్సు చేత నిర్మింపబడ్డది. రాజసూయం రజో గుణ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది. ధర్మరాజు చక్రవర్తిగా అభిషేకింపబడటం దీని లక్ష్యం. దీని కోసం అతని తము్మలు నిర్వహించిన విజయయాత్రలు హింస లేనివని జన నష్టం లేనివని చెప్పడానికి అవకాశం లేదు. ధర్మరాజు యుద్ధానంతరం చేసిన రాజసూయం ఒక చక్రవర్తి చేయగలిగిన కార్యం. దీన్ని నిర్వహించినప్పుడు ఆ యాగంలో చేయబడే సర్వ త్యాగ లక్షణం చేత అది సత్వమయంగా నిర్వహింపబడి ఉండవచ్చు.
మహాభారతంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి, సనత్సుజాతీయము, రెండు భగవద్గీత, మూడు విష్ణు సహస్రనామము. సనత్సుజాతీయములో మృత్యువు యొక్క స్వరూపము చెప్పబడింది. మృత్యువంటే ప్రమాదము, ఏమరుపాటు. ఏమరుపాటు లేనివానికి సదా బ్రహ్మచైతన్యంలో నిలిచి ఉండేవానికి మృత్యువు అనేది ఉండదు. మనం అనుకునే మృత్యువు దేహముల యందు మాత్రమే. జాగ్రదవస్థలో నిలిచి ఉండేవాడు నిత్య జన్మ జన్మాంతరాలలో చైతన్య ధార తెగకుండా ఉండటం వల్ల మృత్యు అనుభవాన్ని పొందనే పొందడు. అట్లాగే భగవద్గీత కూడా మృత్యు తత్వాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. ``కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః'' నేను మృత్యు స్వరూపాన్ని లోకాన్ని నశింపజేయడం కోసమే ప్రవర్తిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ జీవితమంతా మృత్యుముఖంగా పయనించడమే దీని యథార్థ తత్త్వం. ఈ మృత్యు రహస్యాన్ని చెప్పడం కోసం కథాగతంగా నడుమ సావిత్రి ఉపాఖ్యానాన్ని వ్యాస మహర్షి ప్రపంచించడం జరిగింది. మృత్యువును తరించే లక్షణము ఈ గాథ ఉపనిషత్ సంప్రదాయం ప్రకారం నిర్వహించవలసిన యోగ రహస్యాన్ని చెప్పడం కోసం తెల్పబడింది. విష్ణు సహస్రనామము కూడా విశ్వం అనే శబ్దంతో ప్రారంభమై సర్వప్రహరణాయుధ శబ్దంతో పూర్తయి సృష్టి అంతా మృత్యుతీరానికి చేరుతున్న అంశాన్ని తెలియజేస్తుంది. అందువల్లనే మహాభారతానికి మృత్యువు పుత్రుడైన ధర్మరాజు నాయకత్వం వహిస్తున్నాడు. మొత్తం మహాభారతం సర్పయాగం నుంచి స్వర్గారోహణం దాకా మృత్యుహేలయై ప్రవర్తించింది. పాండవులందరూ మృత్యు పుత్రుడు తప్ప చివరకి మృతి చెందారు. అతని స్వర్గారోహణం కూడా నరక దర్శనం చేత మృత్యు తత్తా్వన్ని మరల మరల గుర్తు చేస్తుంది. అతని వెంట నడిచి వచ్చిన ధర్మరూపమైన శునకం కూడా మృత్యువునకు ప్రతీకయే కావచ్చును.
ఈ మొత్తం ఇతిహాసానికి కేంద్ర బిందువైన ద్రౌపది అగ్ని సంభూత. ఈ అగ్ని పంచభూతాలలో కేంద్ర స్థానంలో నిల్చి ఉంటుంది. పంచభూతాలు పంచపాండవులైతే, అగ్ని పార్థుడవుతాడు. ఈ పార్థుడు నరనారాయణులలోని నరుడనే తపస్వి. ఈ మృత్యుక్రీడ కోసం లోకంలో తమోమయ, రజోమయ శక్తులను తొలగించివేయడం కోసం అర్జునుడుగా ఈతడు అవతరించి లయకారకుడైన శివుని వరాన్ని పొంది కురుపాండవ యుద్ధాన్ని మొత్తం నిర్వహించాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ మొత్తం ఇతిహాస ప్రవర్తనలో ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకోలేదు. ఒక్క ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో మాత్రమే ఆయన వస్త్రప్రదానం చేసి ఆమెను రక్షించడం ద్వారా సర్వ జగత్ ప్రవృత్తికి మూలమైన స్త్రీత్వాన్ని చెదరకుండా కాపాడటం జరిగింది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఆయన సాక్షీభూతుడే. భగవద్గీత ఎంత ప్రవర్తించినా, దాని సారంగా తేలేది తస్మాత్ యుధ్యస్వ అన్న మాటయే. యుద్ధం చేయమని చెప్పడం స్థితికారకుడైన నారాయణ లక్షణం కాకుండా, రుద్రాంశ ఆవరించిన శివుని లక్షణంగా కనిపిస్తుంది. మొత్తం మహాభారతంలో ఈ దృష్టితో చూసినప్పుడు ఇదంతా హరిహరుల క్రీడవలె, మహామాతృ అంశమైన కాళికాదేవి వైభవం వలె గోచరిస్తుంది. ద్రౌపదీదేవి కాళికాదేవి యొక్క రూపాంతరమే.
కోవెల సువ్రసన్నాచార్య
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి