.*
🌷🌷🌷
సవరించబడిన అపస్వరం! #కథ
ఒక్కొక్క చటాయి తొంభై రెండు రూపాయులకు అమ్మితే ఆరోజు అమ్మిన పన్నెండు చటాయిల మొత్తం చెప్పమంటే.... పదకొండొందల నాలుగు...అని చటుక్కన నోటిలెక్కేసి చెప్పేయగలదు భన్సీ! లెక్కల్లో అంత చురుకు!
భన్సీ.... అంటే “ మురళి”....అమ్మ ఇష్టంగా పెట్టుకున్న పేరుట! మరి అంత ఇష్టమైన పేరుపెట్టి తొమ్మిదేళ్ళు అంత గారంగా పెంచుకున్న అమ్మ... నిర్దయగా తనను వదిలి ఎందుకు వెళ్ళిపోయిందో ఎప్పుడూ అర్ధం కాదు భన్సీకి! నాన్న మాటల బట్టీ... ఎవరో బీహారీఅంకుల్ తో అమ్మ పాట్నా వెళ్ళిపోయిందట. ఎప్పటికీ మరిక రాదట! “..... తలుచుకుంటేనే గుండెల్లోంచి దుఃఖం తన్నుకొస్తుంది భన్సీకి.
అయితే ఆ పిల్లకు తెలియని విషయం.... తల్లి ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు తరలించబడిందని.
అప్పారావు పోర్టులో కళాసీ! తాగుబోతు మొగుడి ఆగడాలు భరించలేక మొదటిభార్య కాల్చుకుని చచ్చిపోయింది.
ఒకరోజు స్టేషన్ దగ్గర చిన్నబట్టలమూట చేతిలో.... మూడేళ్ళ ఆడపిల్లను చంకలో పెట్టుకుని నీలూ.... భన్సీ వాళ్ళమ్మ...... మొహమాటంగా హిందీలో అడుక్కుంటూ అప్పారావు కంటపడింది.
భర్తపోయి, అత్తారి ఆరళ్ళు భరించలేక... బొకారో ఎక్స్ ప్రెస్ ఎక్కి పారిపోయి వచ్చానని చెప్పగానే.... దారిచూపిస్తానని చెప్పి ఇంటికి తెచ్చి పెట్టుకున్నాడు అప్పారావు. కొన్నాళ్ళకు తాళికట్టి సొంతం చేసుకున్నాడు!
అందమయిన పెళ్ళం మీద ఎవరి కన్ను పడుతుందా... అని అడుగడుగునా అనుమానం అతనికి. పొయ్యి మీంచి పెనం మీద పడ్డ చందమయింది నీలూకు. గుడ్డిలో మెల్లలా “ భన్సీ” ని మాత్రం బాగానే చూసుకునేవాడు! అదే పదివేలనుకుంది. కూతురి భవిష్యత్తుకోసం అప్పారావు మానసికంగా, శారీరకంగా పెట్టే హింసంతా భరించేది.
నీలూ...ఇంట్లోనే రోజుకు రెండొందల దాకా జొన్నరొట్టెలు చేసి... చుట్టుపక్కల కాలనీల్లో ... తన పొరుగున ఉన్న ఒరియా ఆమెతో అమ్మించి.... ఆ డబ్బులన్నీ అప్పారావు కంటపడకుండా దాచేది. అదే ఆమె కొంపముంచింది.
భన్సీ తొమ్మిదోపుట్టినరోజుకు ముందురోజు నీలూ ... పోర్టుస్కూల్లో చదువుకుంటున్న కూతురికోసం పక్కింటామెకు డబ్బిచ్చి... ఆమె భర్తద్వారా చక్కని ఆడపిల్లల సైకిల్ తెప్పించింది.
అర్ధరాత్రి చీట్లపేకలో డబ్బు పోగొట్టుకుని...పూటుగా తాగొచ్చి... నీలూను ఎలాగయినా కుళ్ళబొడిచి....అసహనం తీర్చుకోవాలని ఇంటికొచ్చిన అప్పారావు... వీధిగదిలో మూలన దుప్పటికప్పిన సైకిలును చూసాడు. లోపలగదిలో నీలూ పక్కన ముసుగేసుకుని పడుకున్న మనిషిని చూసాడు.
మరోమాట మాట్లాడకుండా కోడికోసే కత్తితెచ్చి.... నీలూని మంచం మీంచి లాగి..... జుట్టుపట్టి..... మెడమీద ఒక్క వేటువేసాడు. అంతే! ఆ అభాగ్యురాలి దుర్భాగ్యచరిత్ర ముగిసిపోయింది.
ఆ ముసుగుమనిషి తన తల్లి అని తెలుసుకునే సరికే దుర్మార్గం జరిగిపోయింది. తల్లిసాయంతో.......వంటింట్లో మట్టినేల తవ్వి, గొయ్యితీసి నీలూని కప్పెట్టేసాడు.
పక్కింట్లో పడుకున్న భన్సీకి తెల్లారేసరికల్లా కొత్తసైకిలు, తల్లి లేచిపోయిందన్న వార్త మిగిలాయి.
మరో వారానికల్లా పోర్టులో కళాసీ పని మూడులక్షలకు అమ్మేసుకుని..... అప్పారావు పరారు అయిపోయాడు.
ఇక మిగిలిపోయింది భన్సీ... అనాధ ముద్రవేసుకుని!
పక్కింటి సాహూ అంకుల్ పూర్ణామార్కెట్ సేట్ తో మాట్లాడి అమ్మడానికి చాపలు ఇప్పించాడు! సేట్ లేనప్పుడు గొడౌన్ లో కుర్రాడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తాడు. ఎవరితో చెప్పినా ఉన్న ఆధారం పోతుందని భయం!
చదువుకునే స్కూల్లో టీచరు తనింట్లో పిల్లలను చూసుకోడానికి పనిపిల్లగా చేరమంది. చేరనందుకు క్లాసులో ఏదో ఒక వంకపెట్టి కొడుతోంది. .
ఒక చాప అమ్మితే పదిరూపాయిలు వస్తాయి. రోజుకు ఇన్నని అమ్మితీరాలి.
వచ్చిన డబ్బులు వచ్చినట్టు సాహూ ఆంటీకిచ్చేస్తుంది. పాపం కడుపునిండా భోజనం పెడుతుంది ఆమె.... పూరీ జగన్నాధుని సేవలా భావించి!
రాత్రి పడుకోడానికి ఇంటికెళ్తే “ ముదనష్టపు ముండల్లారా! మీ వలన నా కొడుకు నాకు దూరమైపోయాడు”, అని అరుస్తూ పొయ్యిలోంచి కట్టె తీసి విసురుతుంది దాదీ.
భన్సీ కధ కొత్తదికాదు. ఆమె ఒక అపస్వరాల మురళి! ఆ పాపలా ఎందరో వీధుల్లో. ఏ బిడ్డ బతుకు కదిపినా కడలంత విషాదం. కరడుకట్టిన దౌష్ట్యవలయం వారిచుట్టూ. ఏ కష్టమో చేసుకుని బతుకుతూనే ఉంటారు. ఆశను వదలరు. ఆకలినీ వదలరు. ఏ దుర్ముహుర్తానో వీరి బతుకులు కాటేయడానికి అనుక్షణం అపాయం ఎదురుచూస్తూనే ఉంటుంది. అయినా భన్సీలా ఏటికి ఎదురీదుతారు.
***^^******^*****^*************
భన్సీకి పెద్దపరిక్షలు అయిపోయాయి! పువ్వుల రామూ దగ్గర మల్లెపూలూ, జాజుల దండలు తీసుకుని, బీచ్ లో అమ్మకుని వచ్చింది. సాహు అంకుల్ వాళ్ళు పూరీ వెళ్ళడంతో, ఇంటిబయట, ఆరుబయలు నులకమంచం వాల్చుకుని పడుకుంది! అర్ధరాత్రి “ భన్సీ! భన్సీ”! ... అంటూ ఎవరో కుదుపుతున్నారు. హడిలిపోయి లేచి చూసేసరికి... వీధిలైట్ కాంతిలో.. ఆమె తండ్రి అప్పారావు! “ నాన్నా!” అని అనబోయేలోగా నోరునొక్కేసి...” లే! మనం ఊరు వెళ్ళాలి!”.. అంటూ తొందరచేస్తున్నాడు.
నిద్రమత్తులోనే.. భన్సీ దండెం మీంచి తన బట్టలు చిన్నమూట కట్టుకుంది. తండ్రి కంటపడకుండా... తను దాచుకున్న డబ్బుల చిక్కం బట్టల మధ్య పెట్టుకుంది! బయట ఆగివున్న ఆటోలో ఎక్కాకా, కంచెరపాలెం దగ్గర రైల్వేట్రాక్ పక్కన పొదలదగ్గర దింపమన్నాడు అప్పారావు! అక్కడ కాసేపాగాకా, విశాఖ టు ఫరీదాబాద్ స్టీల్ సిటీ సమతా ఎక్సె ప్రెస్ అవుటర్ దగ్గర ఆగింది!... దానిలోకి... భన్సీని ఎక్కించి, తనూ ఎక్కేసాడు అప్పారావు! ఎర్రనికళ్ళతో, గుప్పున సారావాసనతో... భయంకరంగా ఉన్న తండ్రిని “ఎక్కడికెళ్తున్నాం “..అని అడిగే ధైర్యం కూడా లేకపోయింది భన్సీకి!
ముప్ఫైఆరు గంటల ప్రయాణం తరువాత,రైలు దిగి, క్రిక్కిరిసిన ఒక డొక్కుబస్సులో.. ఒక చిన్న పల్లెటూరు తీసుకెళ్ళాడు అప్పారావు...భన్సీని!
ఎర్రచీర కట్టుకుని, తలమీంచి ముసుగేసుకుని, నోట్లో జర్దాపాన్ నముల్తున్న ఒకామెను “ మీ అమ్మ “,అని పరిచయం చేసాడు. ఆమె చూస్తుంటే తండ్రికన్నా పెద్దదానిలా ఉంది. కానీ దయగానే ఉంది! “ ఆవో బేటీ! “... అంటూ లోపలికి తీసుకెళ్ళింది. వేసుకోడానికి మంచి బట్టలిచ్చింది. కడుపునిండా భోజనం పెట్టి, పడుకోమని మంచం చూపించింది. బడలికతో భన్సీ ఎన్నిగంటలు పడుకుందో తెలీదు! లేచేటప్పటికి ఇంట్లో సందడి వినిపిస్తోంది.
ఎర్రచీరామె... భన్సీకి టీతెచ్చి ఇచ్చింది. మెరుపులు మెరుపుల ఎర్ర లెహంగా ఇచ్చింది వేసుకోమని. భన్సీకి తల నున్నగా దువ్వి, మాంగ్ టీకా, మాథాపట్టీ తో అలంకరించింది. రెండు దండలకూ... బాజ్ బంధ్ లు కట్టింది! ముక్కుకు నత్తు పెట్టి, మెడలో పచ్లడా వేసింది! నడుముకు తగ్డీ ...వడ్డాణంలా తగిలించింది. భన్సీ రెండు చేతులూ తీసుకుని, మణికట్టుకు హాథ్ ఫూల్ తగిలించింది! ఆల్తా తో చేతుల్లో మెహందీ , కాళ్ళకు పారాణీ అద్దింది! మొహానికి మేకప్ చేసి, కళ్ళకు కాటుక, పెదాలకు ఎర్ర లిప్స్టిక్ పెట్టింది. కనుబొమల మీద... ఎరుపు, తెలుపు చుక్కలు పెట్టింది. చక్కని రాళ్ళ బిందీని బొట్టులా అమర్చింది. భన్సీకి ఏమవుతోందో అర్ధమవడం లేదు. కానీ అద్దంలో... అందంగా కనబడుతున్న తన ప్రతిబింబాన్ని చూసుకుని... మురిసిపోతోంది.
మరికొందరు తోడురాగా అప్పారావు, అతని భార్య అనబడే ఆమె... భన్సీని ఒక డొక్కు జీప్ లో కూర్చోపెట్టి, ఆరుగంటలు ప్రయాణించి... మరొక పల్లెటూరు చేరారు. ఆ మట్టిరోడ్లలో, మండువేసవిలో ప్రయాణం భన్సీకి నిస్త్రాణ తెప్పించింది.
అదొక పెద్దలోగిలిలో ఇల్లు! ఇంటిముందు వేపచెట్టుకింద, నులకమంచం మీద పాన్ నములుతూ ఒక ముసలమ్మ కూర్చునుంది. భన్సీ చేత ముసలమ్మ పాదాలు నొక్కిస్తూ... నమస్కారం చేయించారు. ఆ ముసలావిడ... భన్సీని చూసి తృప్తిగా తలాడించింది. “ యే లో పగిడీ!” అంటూ మొలలోంచి, కొంత డబ్బు తీసి అప్పారావు భార్య చేతిలో పెట్టింది. అందరూ కలిసి... ఇంటిలోకి వెళ్ళారు.
అక్కడ జరుగుతున్న పెళ్ళి ఏర్పాట్లు చూసి, భన్సీకి పైప్రాణాలు పైనే పోయాయి. బంధువుల ఇంటికి తెచ్చారనుకుంది, కానీ తనకు పెళ్ళిచెయ్యబోతున్నారని ఊహించలేకపోయింది! తండ్రి దగ్గరకు వెళ్ళబోయింది. అందరూ పాలల్లో భంగువేసుకుని తాగుతూ ...చిలుం పీలుస్తూ... ఈలోకంలో లేరు. సవితి తల్లి... భన్సీ చేతిమీద బలంగా చెయ్యి బిగించింది బయటకు పారిపోకుండా. మునపటి మార్దవం లేదిప్పుడు ఆమెలో!
ఇంతలో షేర్వాణీ వేసుకున్న చిన్న కుర్రాడిని తెచ్చారు. వాడికి ఎనిమిదేళ్ళయినా ఉంటాయో లేదో! బాగా ఏడ్చినట్టున్నాడు! కళ్ళూ, బుగ్గలూ ఎర్రగా వాచిపోయి ఉన్నాయి! ఇద్దరి మొహాలకూ మల్లెపూల పరదాలు తగిలించారు. తలో పూలదండ చేతికిచ్చి... బలవంతంగా ఒకరి మెడలో ఒకరికి వేయించారు. వరమాల కార్యక్రమం అయిపోయిందని... అందరూ పువ్వులు చల్లారు. పాపిట్లో సింధూరం పెట్టించారు! అగ్నిహోత్రం చుట్టూ, సప్తపది చేయించారు. పెళ్ళయిపోయిందన్నారు.
ఆ ఇంట్లో ఈ కుర్రాడి తల్లి, ముసలమ్మ తప్పా, మిగిలిన అందరూ మొగవారే ఉండడం గమనించింది భన్సీ! పూరీ, జిలేబీతో మంచి విందుభోజనం తిని, భన్సీని అక్కడే వదిలేసి...వెళ్ళిపోయారు ఆడపెళ్ళివారు! వెళ్తూ... కనీసం వస్తానని చెప్పకుండా, తూలుకుంటూ పోయాడు అప్పారావు,వాళ్ళిచ్చిన నోట్లు లెక్కపెట్టుకుంటూ!
చాపలమ్ముకుంటూ, చదువుకునే భన్సీ... ఇప్పుడు...ఉదయాన్నే ఇళ్ళూ, వాకిళ్లూ ఉడ్వాలి, గోలాలకు నిండా నీళ్ళుతోడాలి, గొడ్లకు మేతలేసి..పాలుపిండాలి! పెద్దపళ్ళెంలో... రెండుపూట్లా రెండుకేజీలకు పైగా గోధుంపిండి కలపాలి! అత్తగారు రొట్టెలు కాలుస్తుంటే... రొట్టెలు ఒత్తాలి. అవి గుండ్రంగా ఒత్తకపోతే... వేడి అట్లకాడతో ఒక్కటేసేది అత్తగారు. ఖాళీ సమయమంతా... ముసలమ్మకు నడుము, కాళ్ళూ ఒత్తాలి. కడుపునిండా తిండిపెట్టినా, బండెడు చాకిరీ చెయ్యడం భన్సీ కి శక్తికి మించిన పని!
భన్సీ పెళ్ళికొడుకు చందన్... తెలియక భన్సీని “దీదీ “...అని పిలుస్తూ... తన్నులు తినేవాడు. రోజు మొత్తం మీద భన్సీకి ఆనందాన్నిచ్చే పని చందన్ కు చదువుచెప్పడమే! మంచి పోషణ దొరకడం వలన భన్సీ ఆరునెలల్లో ఏపుగా పెరిగింది. మెల్లమెల్లగా ఆ ఇంటి మగవారి కళ్ళు భన్సీమీద పడసాగాయి. ఏదో వంకను ఆమెను తాకేవారు! బట్టలు,మిఠాయిలు తెచ్చిచ్చి మచ్చికచేసుకోవాలని ప్రయత్నించేవారు. ముసలమ్మ ఇదంతా గమనించి, వారిని కర్రతో కొట్టేది. “భన్సీ...ఈడేరేకా... మీ అందరి సొత్తూ అది. తొందరపడకండి!”... అంటూ అరిచేది. తల్లి వలన భన్సీకి హిందీ కొంచెంగా వచ్చు. మెల్లమెల్లగా ఆ ఇంట్లో వారి మాటలు, ప్రవర్తన అర్ధమై, తన పరిస్థితి ఏమవుతుందా అని తల్లడిల్లేది. తల్లిని తల్చుకుని ఏడ్చేది.
ఉత్తరభారతదేశంలో... ఆడశిశువుల భ్రూణహత్యల దుష్ఫలితమే... ఆడపిల్లల శాతం గణనీయంగా తగ్గి....ఈ బాల్యవివాహాలు! ఇలా ఆడపిల్లలకు ఓలిచ్చి కొనుక్కుని... అమ్మాయిలు దొరక్క బ్రహ్మచారుల్లా మిగిలిపోయిన ఇంటికొడుకులందరికీ ఉమ్మడిభార్యగా... ఆ పిల్లను మార్చడం... అతి పెద్ద దురాచారంగా ప్రబలిపోతోంది ఆ ప్రాంతాల్లో!
తెలివయిన భన్సీకి తన భవిష్యత్తు తెలుస్తోంది. పూర్తి గృహనిర్బంధం, సెల్ ఫోన్ ఆమెకు అందుబాటులో ఉంచకపోవడం, అనుక్షణం... పదిజతల కళ్ళు ఆమె మీద నిఘా, పూర్తిగా అపరిచితమైన ప్రాంతం... ఆమెను నిస్సహాయురాలిగా చేసాయి!
ఒకరోజు అదృష్టం ఆమె తలుపు తట్టింది. ఆ ప్రాంతమంతా జాతీయఎన్నికల హడావిడి మొదలయింది. భన్సీ మావగారు అక్కడి పంచాయత్ సభ్యుడు. అన్నదమ్ములంతా ఊరూవాడా ప్రచారం కోసం తిరుగుతున్నారు. ఆరోజు ఇంటిల్లిపాదీ ఫరీదాబాద్ వెళ్ళిపోయారు! జననాయక్ జనతాపార్టీ తో బీజేపీ పొత్తుపెట్టుకోవడంతో... ఆరోజు నరేంద్ర మోడీగారు ఫరీదాబాద్ లో పెద్ద బహిరంగసభలో, ప్రసంగించబోతున్నారు!
ఇంట్లో ముసలమ్మ, చందన్, భన్సీ మాత్రమే ఉన్నారు. చందన్ , భన్సీ దగ్గరకు వచ్చి రహస్యంగా...” దీదీ! రోడ్ మీదకు వెళ్ళినిలబడితే... మోడీజీ మీటింగ్ కు జనాలతో వెళ్ళే లారీలు కనిపిస్తాయి. ఆ లారీలెక్కి, ఫరీదాబాద్ వెళ్ళిపో! అక్కడ నుంచి మీ వూరు పారిపో! వీళ్ళు మంచివాళ్ళు కాదు! నువ్వు రావడానికి ముందు మా చాచాకి ఒకమ్మాయిని తెచ్చారు. రోజూ ఏడిచేది. పారిపోబోతే...తుపాకీతో కాల్చి చంపేసారు! ఇదిగో ఈ డబ్బులు తీసుకో! ఎలాగోలా పారిపో! ఈ కట్టెతో నా నెత్తిమీద కొట్టి, పారిపో....!” అంటుంటే... చందన్ బుగ్గమీద ముద్దుపెట్టుకుని... వాడు చెప్పినట్లే చేసింది ... ఫరీదాబాద్ చేరింది భన్సీ!
ఫరీదాబాద్ లో ప్రధాని ప్రసంగం స్వచ్ఛమైన హిందీలో గంగాఝరిలా సాగుతోంది! అందరూ మంత్రముగ్దులై వింటున్నారు. భన్సీ జనంలోంచి దారిచేసుకుని, వేదికకు దగ్గరగా, బేరికేడ్ల దగ్గర నిలబడింది. మోడీగారు నిర్భయా వంటి ఆడపిల్లల రక్షణ చట్టాల గురించి, బేటీ బచావ్, బేటీ పఢావ్....అంటూ, తమ ప్రసంగంలో మాట్లాడింది ...భన్సీ బుర్రలోకి చేరింది. ఈయనే నా రక్షకుడనుకుంది. ప్రసంగం ముగించి, వారు జనానికి చెయ్యూపుతూ... వేదిక దిగుతున్నారు. వారి చుట్టూ సుశిక్షితులైన సెక్యూరిటీ! జనం జయజయ ధ్వానాలు చేస్తున్నారు.
భన్సీ... మొత్తం ఊపిరిని తన గొంతులోకి తెచ్చుకుంది. ఎలుగెత్తి.... “ మోడీజీ! ముఝే బచావ్! మోడీజీ ముఝే బచావ్” అంటూ అరుస్తోంది! అనుక్షణం.. అటువంటి అసహాయుల పిలుపులకు... తన చెవులను, హృదయాన్ని, జీవితాన్నే అంకితం చేసిన ఆ నేత చెవిన... భన్సీ పిలుపు పడనే పడింది. ఒక్కసారి ఆగిపోయారు ఆయన. ముందువరసలో చేతులూపుతూ అసహాయంగా ఒక ఆడపిల్ల! భన్సీకి చెయ్యూపారు ఆయన! ! పక్కనే ఉన్న హర్యానా ఐజీ ఆఫ్ పోలీస్ కు సంకేతాలిచ్చారు! భన్సీకి అభయమిచ్చి... ఆయన హెలీపేడ్ వైపుకు తరలిపోయారు!
ఈరోజు భన్సీ న్యూఢిల్లీలో అత్యుత్తమ బాలికా సంరక్షకగృహంలో, అత్యంత భద్రత మధ్య చదువుకుంటోంది. ఇప్పుడామె కళ్ళ నిండా కలలు, ఆశయాలే... మోడీగారివంటి నాయకురాలిని అవ్వాలని, బాలికారక్షణకు కంకణం కట్టుకోవాలని!
ధన్యవాదాలతో
ఓలేటి శశికళ
ఈ కథకు మానవతారంగు తప్పా రాజకీయ రంగు లేదు. మిత్రులు గమనించాలి. ఇలాంటి బాలికల రక్షణార్ధం రాజకీయాలకు అతీతంగా అందరూ పనిచెయ్యాలి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి