27, ఏప్రిల్ 2021, మంగళవారం

కాంతమ్మత్త

 ఆవకాయ పచ్చడి ఏంట్రా, మీ సంకర భాషని పాతెయ్య. వాస్తవానికి పచ్చళ్ళు అంటే ఏమిటో, తొక్కు అంటే ఏమిటో, ఊరగాయ అంటే ఏమిటో తెలియకుండా ఏం బ్రతుకుతున్నారు, దిక్కుమాలిన గోలా? ఉప్పు, కారం, నూనె కలిపి ఊరేస్తే ఊరగాయ అనాలి. ఆవకాయ, మాగాయా మెంతికాయా వంటివి దంచి చేసిన దాన్ని తొక్కు అంటారు చింతకాయ వంటివి. తరిగి, వాడ్చి, లేదా నాన పెట్టి రుబ్బి చేసేవి పచ్చళ్ళు కొబ్బరి పచ్చడి, గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి, కంది పచ్చడి ఇటువంటివి. 


అంతే గానీ ప్రతీదీ పచ్చడి అనకూడదు. మీ మొహాలు సంతకెళ్ళ. తిని ఏడవడం రాకపోతే పోయింది నిజానికి దేన్ని ఏమి అంటారో కూడా తెలిసి చావక పోతే ఎలాగఱ్ఱా. ఇంతకీ క్రొత్త ఆవకాయలో మీగడ తరక నంజుకు తింటున్నారా ఒక దినము మజ్జిగ పులుసు పెట్టుకుని మాగాయా టెంక నంజుకు తిని ఏడవండి. మహా రంజుగా ఉంటుంది. వెధవ సోకులకు పోకుండా పెద్దరసాల పండు పెరుగులో వేసుకు జుఱ్ఱుకు తినండి. ఏ కాలం పండు ఆ కాలంలో తినాలి. దినామూ మూడు పూటలా మజ్జిగ త్రాగి అఘోరించండి, వేడి చేసి ఏడవకుండా ఉంటుంది. బోధ పడిందా ఢింబకుల్లారా !!!


మీ భాష తగలడ..పులుసుని సాంబారు అంటారా ! చారుని రసం అనీ, అన్నంని రైసు అనీ, పచ్చడిని చట్నీ అనీ, త్రాగే నీటిని వాటర్ అంటావురా!! దద్దమ్మా ! స్వఛ్ఛంగా తెలుగు మాట్లాడి ఏడవండి.

     

                        ఇట్లు

             మీ కాంతమ్మత్త


కామెంట్‌లు లేవు: