22, జూన్ 2021, మంగళవారం

ఆదిశంకరులు కైలాసగమనం

 ఆదిశంకరులు కైలాసగమనం


జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి 


జ్యేష్ఠ శుద్ధ ద్వాదశినాడు ఆదిశంకరులు కైలాస గమనం చేసినట్లు శంకరవిజయం చెబుతోంది. అయ్య కానుకగా అయిదు చంద్రమౌళీశ్వర లింగాలను, అమ్మ కానుకగా సౌందర్యలహరిని కైలాసం నుంచే శంకరులు తీసుకువచ్చారు. పరతత్వ నిరూపణ చేస్తూ, శ్రీవిద్యా రహస్యాలను బోధించే సౌందర్య లహరి పై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. 


శంకర వాజ్మయం మధురమైనది, శక్తివంతమైనది. ఎంత మధురమైనదో అంతే గంభీరమైనది. శాశ్వతత్వాన్ని సాధించుకున్నది. మంత్ర తంత్ర యంత్ర రహస్యాలకు అటపట్టు అయినా గౌడపాదుల సుభగోదయ స్తుతి ఆధారంగా సౌందర్యలహరిని శంకరులు రచించారు. దీనిని కైలాసం నుంచి తీసుకువచ్చారని కూడా విశ్వసిస్తారు. అనేక ఉపాసనా మర్మాలు, వేదాంత రహస్యాలు సౌందర్యలహరిలో శంకరులు నిక్షిప్తం చేశారు.


అందుకే శంకరుల కవితను మార్మీ సుకవిత్వం అన్నారు. లలితా సహస్రనామానికి వ్యాఖ్యానాన్ని కవితాత్మకంగా చెప్పినదే సౌందర్యలహరీ స్తోత్రం అనిపిస్తుంది. ఇది అనుభూతి కవిత్వం. ఇక సౌందర్య లహరిలో ప్రతిపదం మంత్రమయమే. అసలు సౌందర్య లహరి అనే పేరే ఒక మంత్రం 'సౌః - లం - హ్రీం' అనేవి మూడూ అమ్మవారి బీజాక్షరాలే. అందుకే సౌందర్యలహరి అనే పేరు తలచుకుంటేనే మంత్రం జపించిన ఫలితం కలుగుతుంది. సౌందర్యలహరీ స్తోత్రాన్ని వ్యాఖ్యాతలు రెండు భాగాలుగా విభజించారు. తత్వ రహస్యాలు, కుండలినీ యోగాలు, ఉపాసన మర్మాలు కలిగిన మొదటి 41 శ్లోకాలను ఆనందలహరి అని, చివరి 59 శ్లోకాలను సౌందర్యలహరి అన్నారు. మొదటి భాగంలో 'చిదానంద లహరీం, అంటూ రెండు సార్లు లహరి శబ్దం కనిపిస్తోంది. రెండో భాగంలోనే సౌందర్యలహరి అనే మాట వస్తోంది. తొలి భాగంలో లోతైన విషయాలెన్నో ఉంటాయి. ఇవి జ్ఞానయోగాన్నిస్తాయి. రెండో భాగంలో అమ్మవారి శిరస్సు మొదలుకుని పాదాల వరకూ రూపవర్ణన చేస్తారు. ఈ రూప వర్ణన సామాన్యునికి సైతం తేటతెల్లంగా బోధపడుతుంది. ధ్యానానికి అనువుగా ఉంటుంది. చదువుతుంటే అమ్మవారి రూపం కళ్లముందు కదలాడుతుంది.


శివుడంటే ఆనందం. అమ్మంటే సౌందర్యం అంటే అందం అని అందరం చెప్పుకునే అర్థం. అందమే ఆనందం కాదు. ఆనందంగా ఉండేదంతా అందమే. "ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్" అని ఉపనిషత్తులు చెబుతాయి. శంకరులు సౌందర్యలహరిలో చేసింది కూడా అదే. ఆనందమే సౌందర్యం అయితే సౌందర్య స్వరూపం ఏమిటి? చర్మమాంస ఆస్థిమయ శరీరంతో మనం ఊహించుకునేదే సౌందర్యమా అంటే ఆధ్యాత్మిక జగత్తులో రూపం కేవలం ప్రాథమిక స్థితి. రూప సౌందర్యాన్ని మెచ్చుకునే స్థితిని దాటి సాధకుడు మంత్ర సౌందర్యం వైపు దృష్టి మార్చాలి. ఆ తరువాత తత్వ సౌందర్యం, మహిమా సౌందర్యం, లీలా సౌందర్యం వంటివెన్నో ఉన్నాయి. మొత్తం మీద ఇంద్రియాలతో అనుభవించేది జడానందం. పరతత్త్వ ఉపాసనతో పొందేది చైతన్యమయమైన ఆనందం. చైతన్యశక్తి అమ్మ. ఆమెను తెలుసుకోవడమే చిదానందం.


లహరి అంటే ప్రవాహగుణం కలది అని అర్థం. సౌందర్య లహరి అంటే ప్రవహించే సౌందర్యం అని అర్థం. సర్వ జగత్తుకీ శక్తినందించే కాంతి తత్వం అమ్మ. బ్రహ్మాండాలకు ఆవల ప్రకాశిస్తూ సకల భువనాలపై నివసిస్తున్న అందరిపై వెలుగును ప్రసరిస్తుంది.

🙏🙏🙏

సేకరణ

https://chat.whatsapp.com/J2smXvOBzztJK9Nsz8h8oi

కామెంట్‌లు లేవు: