22, జూన్ 2021, మంగళవారం

బ్రహ్మ తత్వము

 *బ్రహ్మ తత్వము...(ఒక వ్యాఖ్య)*


బ్రహ్మ పదార్థాన్ని ఇది బ్రహ్మము అని వాక్కు ద్వారా వర్ణించి వేదం గూడా చెప్పలేదు. ఎవరూ  మనసు ద్వారా  కూడా బ్రహ్మాన్ని,  బ్రహ్మ తత్వాన్ని ఊహించి నిర్ణయించుకో లేరు. అంటే అది ఊహకు కూడా అందని విషయము. కానీ బ్రహ్మ పదార్థాన్ని వేదం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి, మరో విధంగా తెలుసు సుకోలేము అని  వేదం చెబుతుంది. ఈ మాటలన్నీ వేదం లోనే ఉన్నాయి.  ఇవి రెండు విరుద్ధమైన విషయాలు. బ్రహ్మాన్ని గురించి స్పష్టంగా చెప్పలేని వేదం బ్రహ్మాన్ని గుర్తించడానికి  ఎలా సహాయపడుతుంది. ఇది సమస్య.   వేదం వల్ల ఉపయోగం లేదు. మరో మార్గం లేదు. మరి బ్రహ్మాన్ని తెలుసుకునేది ఎలాగా. 


*ఈ సమస్యకు పరిష్కారాన్ని ఆదిశంకరులు ఈ విధంగా చెప్పారు.* : 


పూర్వకాలంలో చిన్నతనంలోనే పెళ్లిళ్లు అయ్యేవి. పిల్లవాడు పెళ్లి కాగానే చదువుకోవడం కోసం కాశీ కి వెళ్లే వాడు. ఆ కాలంలో ప్రయాణ సాధనాలు లేనందున కాశీకి వెళ్లి చదువుకుని రావడం దాదాపు పది పన్నెండు సంవత్సరాలు పట్టేది. అసలు తిరిగి రావడమే చాలా గొప్ప. అలా ఒక చోట ఒక పిల్లవాడు కాశీనుంచి పదేళ్లకో  15 ఏళ్లకో తిరిగి వచ్చాడు. మొదటిసారి మళ్లీ అత్తగారింటికి  వచ్చాడు. ఇలా అల్లుడు కాశీకి వెళ్లి తిరిగి వచ్చాడని అత్తగారింట్లో చాలా పెద్ద ఉత్సవం చేశారు. పిల్ల తాలూకు స్నేహితురాళ్లు కూడా చాలామంది వచ్చారు. వాళ్లకు ఈ పిల్లవాడు ఎవరో తెలీదు. అమ్మాయి ని అడిగారు. అప్పటి సాంప్రదాయాల ప్రకారం పిల్ల తన భర్తను పేరు పెట్టి పిలవకూడదు వేలుపెట్టి చూపించకూడదు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ తెల్లగా ఉంటాడు, 25 ఏళ్లు, గడ్డం ఉంటుంది వంటి కొన్ని గుర్తులు  చెప్పింది. ఈ స్నేహితురాళ్లు వాకిట్లో కూర్చున్న వాళ్లలో ఆ లక్షణాలు ఉన్న ఒక ఐదారుగురు అబ్బాయిలను చూసి అందులో ఈ పిల్ల భర్త ఎవరో తెలియక ఒక్కొక్కరిని చూపిస్తూ, మళ్లీ ఈ అమ్మాయినే అడిగారు. అందులో ఒకరిని చూపిస్తే వాడు మా పిన్ని కొడుకని, ఇంకొకరిని చూపిస్తే వాడు మేనత్త కొడుకని ఇంకొకడిని చూపిస్తే వాడు అత్తగారి వైపు బంధువని ఇలా అమ్మాయి మిగిలిన అందరినీ, కాదు కాదు అని చెప్పింది. ఆఖరకు స్నేహితురాళ్లు అసలు పిల్లవాణ్ణి చూపించినప్పుడు ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడుతూ ఊరుకుంది. స్నేహితురాళ్ళ కు అతడే ఈ పిల్ల భర్త అని తెలిసిపోయింది. ఈ కథలో  ప్రశ్న ఏమిటంటే ఆ అమ్మాయి తన స్నేహితురాళ్ళకు తన భర్తను పరిచయం చేసిందా లేదా? ఆ స్నేహితురాళ్లు ఆ పిల్ల భర్తను ఎవరి సహాయంతో కనిపెట్టారు?


ఆదిశంకరులు చెప్పేదేమిటంటే వేదం కూడా అచ్చంగా ఆ కథలో అమ్మాయిలాగా పరబ్రహ్మ కు సంబంధించిన కొన్ని లక్షణాలను చెబుతుంది. పరబ్రహ్మ కాని వాళ్ళు ఎవరో  చాలా స్పష్టంగా చెప్తుంది. పరబ్రహ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ చెప్పకుండా ఊరుకుంటుంది. కాబట్టి వేదం ద్వారా పరబ్రహ్మాన్ని కనిపెట్టడం వీలవుతుంది. స్పష్టంగా చెప్పడం చెప్పకపోవడం  అనే వేద వాక్యాలలో విరోధం ఏమీ లేదు అంటారు ఆయన. 


దక్షిణామూర్తి స్తోత్రం లో ఆదిశంకరులు *"మౌనవ్యాఖ్యా ప్రకటిత"* అని వర్ణించింది కూడా ఇదే. 


*ఆఖరి మెట్టు దగ్గరికి వెళ్లే టప్పటికి పరబ్రహ్మాన్ని మౌనం ద్వారానే వ్యాఖ్యా నిస్తారు. ఎంత గొప్ప గురువు కైనా ఇంకో మార్గం లేదు.*


*పవని నాగ ప్రదీప్*

కామెంట్‌లు లేవు: