23, ఆగస్టు 2021, సోమవారం

రుద్రం-లయం చేసేది

 *రుద్రం (శివ స్వరూపము)*


రుద్రం-లయం చేసేది/చీకట్లను నిర్మూలించేది/అజ్ఞానాన్ని తొలగించేది. 


రుద్రానికి సంబంధించి ఎన్నో కర్మకాండలను, యజుర్వేదము తన మంత్రభాగంలో వివరించడం జరిగింది. 

అవి రుద్రం, ఏకాదశ రుద్రం, లఘురుద్రం, మహారుద్రం, , అతిరుద్రంగా విభజించడం జరిగింది.


ఇందులో కర్మ భాగము : 


యజుర్వేద మంత్రభాగంలో పేర్కొన్న పదకొండు అనువాకాలకి *“రుద్రం”* అని పేరు. దీనిని ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకాన్ని *“రుద్రాభిషేకము”* అంటారు. 

ఈ పదకొండు అనువాకాల రుద్రాన్ని పదకొండుసార్లు పఠిస్తూ చేసే అభిషేకానికి *“ఏకాదశ రుద్రాభిషేకము”* లేదా *“రుద్రి”* అంటారు.


రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకాన్ని *లఘురుద్రాభిషేకమని*, ఇటువంటి పదకొండు లఘురుద్రాభిషేకాలను *మహారుద్రమని*, ఈ మహారుద్రాలు పదకొండయితే *అతిరుద్రమని* చెప్పబడింది.


ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే *రుద్రాభిషేకమని*, వీటిని హోమంలో వినియోగిస్తే *రుద్రయాగమని* సూచించడం జరిగింది. 


ఈ అభిషేక తీర్థాన్ని లేదా యాగ భస్మాన్ని జీవుడు భక్తితో గ్రహించటం ద్వారా, జీవాత్మను ఆశ్రయించి వున్న సమస్త దోషాలు తొలగిపోయి, *జీవుడు పరమాత్మలో ఐక్యం* చెందుతాడని చెప్పబడింది. 


ఇందులో జ్ఞాన విభాగము : 


“నారుద్రో రుద్రమర్చయేత్” అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడని చెప్పబడింది.


ఇది అంత సులభంగా సాధ్యపడదు. ఎంతో సాధన కావాలి. సాధనతో సత్యాన్ని గ్రహించాలి. సత్యమే ఆత్మగా గ్రహించాలి. తనలోనే సచ్చిదానంద స్వరూపునిగా విరాజిల్లే పరమశివుణ్ణి సర్వకాల, సర్వావస్థలయందు అనుభూతి పొందాలి. చివరికి *“చిదానందరూపః శివోహమ్! శివోహమ్!”* అన్న స్థితికి చేరుకోవాలి. అదే బ్రహ్మైక్య స్థితి. ఆ స్థితినే ఆదిశంకరులు తమ *“ఆత్మషట్కము”* లో ఎంతో సుళువుగా అభివర్ణించారు. 


రుద్రాభిషేక ఆచరణ : మహనీయులు *“మహాన్యాసము”* అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు అందించేరు. అప్పటినుంచి ఈ మహాన్యాసము రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి ఆచారణలోకి వచ్చింది. మహాన్యాసము అంటే *భక్తుడు రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేసే అధికారం పొందుటకు, వాటికి ముందు మహిమాన్వితుడైన రుద్రుని తన ఆత్మ యందు విశిష్టముగా నిలుపుకొనుటయే "రౌద్రీకరణము"*. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, *తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును*.


రుద్రములో నమకము, చమకము ఎంతో ముఖ్యమైనవి. *“నమః”* తో అంతమయ్యే శ్లోకాలు *నమకము* గాను, *“చమే”* తో అంతమయ్యే శ్లోకాలు *చమకంగా* చెప్పబడ్డాయి. నమకము రుద్రునికి *భక్తుని ప్రార్థనగా*, చమకము భక్తునికి *రుద్రుని ఆశీర్వచనముగా* చెప్పబడ్డాయి. *ఓం నమః శివాయ*🙏

కామెంట్‌లు లేవు: