23, ఆగస్టు 2021, సోమవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఆశ్రమం..ఆలయం..*


1975 వ సంవత్సరం మే నెల..కొద్దిరోజుల ముందు నేను పదవ తరగతి పరీక్షలు వ్రాసి, సెలవులకు మొగలిచెర్ల వచ్చి వున్నాను..ఆరోజుల్లో సెలవులకు ఇంటికి వస్తే..నేను గానీ మా అన్నయ్య కానీ..ప్రతిరోజూ ఉదయం సాయంత్రం రెండుపూటలా మొగలిచెర్ల లోని మా ఇంటివద్దనుంచి..ఎరువు ను ఎద్దుల బండిలో మా మాగాణి పొలానికి తీసుకెళ్లి అక్కడ చల్లి రావడం ఒక పనిగా చేయాల్సి వచ్చేది..మాగాణి పొలానికి వెళ్లాలంటే..విధిగా శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆశ్రమం నిర్మించుకున్న ఫకీరు మాన్యం మీదుగానే వెళ్ళాలి..నేను అలా మాగాణికి ఎరువును బండిలో తీసుకెళ్లే రోజుల్లో..ఒక్కొక్కసారి శ్రీ స్వామివారిని చూడటం కోసం..ఆశ్రమం ముందు ఎద్దుల బండి ఆపుకొని..లోపలికి వెళ్లే వాడిని..శ్రీ స్వామివారు ధ్యానం లో లేని సమయం లో..ఆశ్రమ ప్రాంగణంలో తిరుగుతూ వుండేవారు..కొద్దిసేపు వారి వద్ద గడిపి..మళ్లీ బండిని తీసుకొని ఇంటికి వచ్చేసేవాడిని..మే నెలలో ఆ కార్యక్రమం విధిగా ఉండేది..


ఒకరోజు ఉదయాన్నే నాన్నగారు నన్ను పిలచి.."ఒరేయ్..సుధాదేవమ్మ అక్కయ్యను తీసుకొని..ఈ నెలాఖరుకు ఢిల్లీ వెళతావా?..అక్కయ్యను మా తమ్ముడు పరమేశ్వర రావు దగ్గర వదిలి..నాలుగు రోజుల పాటు అక్కడ వుండి..తిరిగి వచ్చేసెయ్యి..మీ సెలవులు అయిపోయేనాటికి అక్కయ్య మళ్లీ తిరిగి కనిగిరి వచ్చేస్తుంది..ఆమెను ఢిల్లీ తీసుకెళ్లడానికి నువ్వు తోడుగా వెళ్ళు.." అన్నారు..ఆ మాట వినగానే ఎగిరి గంతేశాను.. నిజమే..అప్పట్లో ఢిల్లీ ప్రయాణం అనేది నా వరకూ ఒక గొప్ప కార్యక్రమం..సరే అన్నాను సంతోషంగా..ఆ సంతోషం లోనే బండికి ఎరువు నింపుకొని..ఎద్దులు కట్టుకొని..మాగాణి పొలానికి ఉత్సాహంగా బయలుదేరాను..తిరిగి వచ్చేటప్పుడు ఉదయం పది గంటల సమయం లో..శ్రీ స్వామివారు..ఆశ్రమం బైట వైపు..దాదాపుగా మేము ప్రయాణించే దారి దగ్గర..నిలబడి వున్నారు..స్వామివారిని చూడగానే..బండి ఆపి..ప్రక్కకు పెట్టి..గబ గబా ఆయన దగ్గరకు వెళ్ళాను..


అత్యంత ప్రశాంతంగా..చిరునవ్వుతో నన్ను చూసి.."తెల్లవారక ముందే బండి కట్టుకొని మాగాణికి వెళ్ళావా?..పెందలాడే తిరిగొస్తున్నావు?.." అన్నారు..

"అవును స్వామీ.." అన్నాను..


"రా!..లోపలికి వెళదాము.." అని, ఆశ్రమం లోపలికి దారితీశారు..

వెనుకనే వెళ్ళాను..


శ్రీ స్వామివారు బావి వద్దకు వెళ్లి..నీళ్లు తోడుకొని..కాళ్ళు చేతులు కడుక్కొని..వరండా లోకి వెళ్లి పద్మాసనం వేసుకొని కూర్చున్నారు..నేనూ కాళ్ళూ చేతులు కడుక్కొని..శ్రీ స్వామివారి కి ఎదురుగ్గా కొద్దీ దూరంలో కూర్చున్నాను..


"ఏదో ఆనందం లో ఉన్నావే?..ఏమిటి విషయం?.." అన్నారు..

ఢిల్లీ కి వెళుతున్నాననీ..మొదటిసారి దేశరాజధానిని చూస్తున్నానని..చెప్పాను..


పెద్దగా నవ్వారు..నవ్వడం ఆపి.."ప్రయాణం చేయడం మంచిదే.. అనుభవం వస్తుంది.." అని పైకి లేచి నిలబడ్డారు..నేనూ లేచాను..

"నా వెనకే రా.." అంటూ..ఆశ్రమ ప్రాంగణం అంతా..ప్రదక్షిణగా తిరిగారు..నేనూ శ్రీ స్వామివారి వెనుకే వెళ్ళాను..తిరిగి మళ్లీ బావి వద్దకు వచ్చి..

"ఈ ప్రహరీ లోపల ఉన్న ప్రదేశం అంతా..సరిగ్గా చూడు..రాబోయే రోజుల్లో ఈ ప్రదేశం ఒక దత్త క్షేత్రంగా మారినప్పుడు..ఈ ఆశ్రమం..ఆలయంగా మారుతుంది..ఇక్కడ చాలా మార్పులు వస్తాయి..నువ్వు చూస్తావు..గుర్తుపెట్టుకో.." అన్నారు..


శ్రీ స్వామివారు చెపుతున్న మాటలకు అప్పుడు అర్ధం గోచరించలేదు..రాబోయే రోజుల్లో..ఈ ఆశ్రమం..గుడి రూపం సంతరించుకుంటుందనీ..అలానే శ్రీ స్వామివారు కట్టించుకున్న ధ్యాన మందిరం తప్ప..మిగిలిన వన్నీ మారిపోతాయనీ..అందులో నా ప్రమేయం ఉంటుందనీ..నాకు అవగాహన లేదు..నన్ను అన్నీ గుర్తుపెట్టుకోమని ముందుగానే ఎందుకు చెప్పారో..ఇప్పుడు అవగతం అవుతున్నది..ఆనాటి ఆశ్రమ రూపు రేఖలు ఇప్పుడు మనసులో తప్ప వాస్తవం లో లేవు..రాబోయే రోజుల్లో నేనే ఆశ్రమ నిర్వహణ చేస్తానని శ్రీ స్వామివారికి ముందుగానే తెలుసా?..అందుకే పదే పదే.."సరిగ్గా చూడు..!..గుర్తు పెట్టుకో..!.." అని చెప్పారా?..ఈనాడు ఆలోచించుకుంటే..అవును అనే సమాధానం చెప్పుకోవాలి..


లౌకికంగా ఆనాడు ఢిల్లీ ప్రయాణం నాకు అత్యంత ఆనందం కలిగించే విషయంగా భావించాను..కానీ ఆధ్యాత్మికంగా శ్రీ స్వామివారు చూపిన ఆశ్రమ బాధ్యత ఇంకా గొప్పది అని ఇన్నాళ్లకు తెలిసింది..ఈ ఆధ్యాత్మిక ప్రయాణం లో ఎందరో భక్తుల అనుభవాలను తెలుసుకునే అవకాశం కలిగింది..అందుకు శ్రీ స్వామివారి పాదపద్మాలకు అనుక్షణం భక్తితో నమస్కారం చేసుకోవాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: