22, అక్టోబర్ 2021, శుక్రవారం

శ్రీమద్వాల్మీకి రామాయణం



ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

                ----------------------- 

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

  

                    1. చరిత్ర 


ప్రపంచ చరిత్రలు


    భారతదేశ చరిత్ర, ఐరోపా చరిత్ర, ప్రపంచ చరిత్ర - ఇలా అనేక చరిత్రలు పాఠ్యాంశాలుగా మనం చదువుకుంటూ ఉంటాం. 

    అవి వివిధ కాలాలో, వివిధ ప్రాంతాలలో, 

    సామ్రాజ్యాలనీ, నాగరికతలనీ వివరంగా తెలుపుతాయి. 

    చరిత్ర అనేది ఒక సంకలనం. గతంలోని వాస్తవాలని తెలియజేస్తుంది. 

    భారతదేశ చరిత్ర విషయంలో, వేదవిషయాలతోపాటుగా అనేక వాటిపై, ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో, వారికనుగుణంగా చొప్పించబడ్డాయి. 

    తద్వారా మన అసలు చరిత్ర మారిపోయింది. 


భారతీయ చరిత్ర ప్రత్యేకత - రామాయణం 


    పైన తెలిపిన ఆంగ్లేయులు మార్చిన వాటికి తావులేకుండా, 

    శ్రీమద్వాల్మీకి రామాయణంలో అద్భుతమైన చరిత్ర మనకి కనబడుతుంది. 

    ఆ రామాయణం చూస్తే, 

    ప్రధానంగా సూర్యవంశ, నిమివంశ చరిత్రలూ, రావణ చరిత్ర కనబడతాయి. 

    అవి మంచీచెడులు రెండురకాలనీ తెలియజేస్తాయి. 


సీతా - రాముల పూర్వుల చరిత్ర 


    సీతారాముల వివాహ సమయంలో దశరథుని మాటతో వశిష్ఠ మహర్షి, 

    బ్రహ్మతో మొదలుపెట్టి దశరథని వరకూ అయోధ్యను పాలించిన రాజుల వంశ క్రమాన్ని విశదపరూస్తూ, దశరథ సంతానాన్ని గూర్చి తెలియజేశారు. 

    నిమి చక్రవర్తితో మొదలుపెట్టి జనకుని వరకూ జనక మహారాజే మిథిలా నగర రాజుల చరిత్ర స్వయంగా చెప్పారు. 


భిన్న వయో ప్రమాణాలు     


    రావణుడు బ్రహ్మ నుంచీ నాలుగో తరంగా కనబడతాడు.  

    అయోధ్య రాజులలో అనరణ్యుని రావణుడు హింసించాడు. అనంతరం ఇరువది ఎనిమిది తరాల తరువాత శ్రీరామ జననం జరిగింది. 

    ఒక్కొక్క రాజు కాలం కూడ తక్కువేమీ కాదు. దశరథుడు అరవైవేల సంవత్సరాలు పరిపాలించాడు. 

    ఈ విషయాలు గమనిస్తే రావణుని జీవన ప్రమాణం అత్యధికమనీ, ఒకే కాలంలో గణనీయమైన వ్యత్యాసాలతో జీవనకాల ప్రమాణాలు ఉండేవని కూడా తెలుస్తుంది.      


భిన్న నాగరికతలు - ధార్మిక ప్రమాణం 


    అయోధ్యని పరిపాలించిన రాజులందరూ ధర్మాచరణ పరాయణులే. 

    అయోధ్యలో ధార్మిక జీవనంతో కూడిన నాగరికతా, 

    లంకలో భౌతిక భోగలాలసతోనూ కూడిన నాగరికతా ఎంతగానో అభివృద్ధి చెందినవిగా కనిపిస్తాయి. 

    కానీ సత్యధర్మాల విషయంలో ఆ రెంటిమధ్య వ్యత్యాసం మనకి స్పష్టంగా కనబడుతుంది. 


    మొదటి మూడు తరాలూ సత్యధర్మాలు కలిగియున్నా, రావణుడు ఆ వంశధర్మాన్నీ, సంప్రదాయాన్నీ విడిచి దుష్టప్రవర్తన కలిగియున్నప్పుడు, 

    అతని సోదరుడైన విభీషణుడు లంకాధిపతియై ధర్మబద్ధంగా పరిపాలించాడు. ఇది ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. 


      శ్రీమద్వాల్మీకీ రామాయణం మంచీచెడుల వ్యత్యాసాన్నీ, రెండురకాల వాస్తవ చరిత్రలనీ తెలియజేస్తుంది. 


ఒక్కొక్క రాజ చరిత్ర - అందే సందేశం 


      మధ్యమధ్యలో కొంతమంది రాజుల పరిపాలనలు కూడా శ్రీమద్రామాయణంలో ప్రస్తావించబడ్డాయి. 

    వాటిలో 

ఒక్కొక్క రాజు చరిత్ర ద్వారా ఒక్కొక్క ప్రత్యేక విషయం బోధపడుతుంది. 

    ఉదాహరణకి

  - రోమపాదుని చరిత్ర ద్వారా అనావృష్టి నివారణ, 

  - భగీరథుని విషయంలో, ఎన్ని అవరోధాలు వచ్చినా లక్ష్య సాధన (భగీరథ ప్రయత్నం), 

  - త్రిశంకు చరిత్ర ద్వారా అధర్మపరమైన వ్యక్తిగత కోర్కెలకి ఫలితాలు, 

  - కుశనాభుని వృత్తాంతం ద్వారా ఓర్పు కలిగియుండటం, 

  - నృగమహారాజు కథ ద్వారా రాజు ప్రజలకు అందుబాటులో ఉండవలసిన ఆవశ్యకత వంటి సందేశాలు మనకి అందుతాయి. 


ఉపదేశం   


పై అంశాలని పరిశీలిస్తే,  

    శ్రీమద్రామాయణంలోని చరిత్రలద్వారా, 

    ఈరోజు మనక్రియ రేపటికి చరిత్రగా మిగిలేందుకు, 

    మనం ఎలా ప్రవర్తించాలో తెలుపుతుంది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

కామెంట్‌లు లేవు: