22, అక్టోబర్ 2021, శుక్రవారం

మొగలిచెర్ల

 *దత్త రక్షణ..*


"అన్నయ్యా! రాజ్యానికి పెళ్ళికుదిరిందికదా..వెండి సామాను కొనాలి, అలాగే బంగారమూ కొనాలి..నీకెవరన్నా తెలిసినవాళ్ళ షాపు ఉందా?" అని మా చెల్లెలు గాయత్రి నాకు ఫోన్ చేసింది..ఇది 2007 డిసెంబర్ నాటి ముచ్చట..


బంగారానికి, వెండికి సంబంధించి నాకు తెలిసిన ఒకే ఒక్క షాపు, నా స్నేహితుడు గుఱ్ఱం వెంకటేశ్వర్లు దే! నెల్లూరు జిల్లా వింజమూరులో అతని దుకాణం..


ఇక్కడ శ్రీ గుఱ్ఱం వెంకటేశ్వర్లు గారి గురించి చెప్పుకోవాలి..


శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మాతల్లిదండ్రులను అడిగి మొగలిచెర్ల గ్రామంలో 5 ఎకరాల పొలం ఆశ్రమ నిర్మాణానికి తీసుకున్నారు..అందులో ఆశ్రమ నిర్మాణానికి, నెల్లూరు జిల్లా గొట్టిగుండాల గ్రామ వాస్తవ్యులు శ్రీ బొగ్గవరపు మీరాశెట్టి గారు, వారి ధర్మపత్ని ముందుకొచ్చారు..ఆ మీరాశెట్టిగారి మరదలి కుమారుడే ఈ వెంకటేశ్వర్లు..పెదనాన్న మీరాశెట్టి గారితో మొగలిచెర్ల వస్తూ పోతూ ఉండటం వలనా..వయసులో ఇద్దరం ఇంచుమించు సమానం గనుకా యిట్టె స్నేహితులుగా మారాము..1974 వ సంవత్సరం అంటే నాకు పద్నాలుగేళ్ళు వయసు..


2004 లో నేను మందిరం బాధ్యతలు తీసుకునే నాటికే వెంకటేశ్వర్లు గారికి నగల దుకాణం పెట్టి, వింజమూరు చుట్టుపక్కల చాలా మంచి పేరు తెచ్చుకున్నారు..నావరకూ వెండి, బంగారాల్లో ఏది కొనుగోలు చేయాలన్నా, ఇప్పటికీ అతనే దిక్కు.. గతయేడాది స్వామి వారి మందిరం వద్ద గోశాల కూడా నిర్మించారు..మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయుడి సేవలో తరిస్తున్న వ్యక్తీ..


సరే..గాయత్రి ఫోన్ చేయగానే, వెంటనే మరో ఆలోచన లేకుండా చెప్పాను, "మన వెంకటేశ్వర్లు ఉన్నాడు కదమ్మా..అతన్నే అడుగుదాం "అన్నాను..సరే అన్నది..


నేనూ, మా ఆవిడ జయలక్ష్మీ, చెల్లెలు గాయత్రి కలసి, సింగరాయకొండ నుంచి కార్లో నెల్లూరు వెళ్ళాము..వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చారు..మాకు కావాల్సిన వన్నీ దగ్గరుండి ఇప్పించి వెళ్ళారు..


వెళ్ళింది నెల్లూరు కనుకా..భోజనం వేళకు అక్కడే ఉన్నాం కనుకా..రెండో ఆలోచన లేకుండా, తరతరాల నుంచీ మంచి భోజనానికి కేరాఫ్ గా ఉన్న కోమలా విలాస్ లో భోజనం చేసి, తిరుగు ప్రయాణం అయ్యాము..


మా ఆవిడా, చెల్లెలు ఇద్దరూ వెనుక సీట్లో కూర్చున్నారు..నేను డ్రైవింగ్..ఇక కావలి ఓ 5కిలోమీటర్లు ఉందనగా.. హఠాత్తుగా సైకిల్ తొక్కుతూ రోడ్డుకు ఓ పక్కగా వెళుతున్న నడివయస్కుడు, కారుకు అడ్డం రావడం, 100కి.మీ..వేగంతో ఉన్న కారు అతన్ని గుద్దడం, ఆ మనిషి, బంతిలాగా యెగిరి, ముందు అద్దం మీద పడటం, ఆ అద్దం భళ్ళున పగిలి, ముక్కలు నా మీద లోపల పడటం, క్షణాల్లో జరిగిపోయాయి..


ఒక్క క్షణం మెదడు మొద్దుబారిపోయింది..అసలతను ప్రాణాలతో ఉన్నాడో లేడో తెలీదు..సహజంగా ఇలా ప్రమాదం జరిగిన వెంటనే, చుట్టుపక్కల వాళ్ళు ముందూ వెనుకా ఆలోచించకుండా వాహనం నడిపే వాడిని తిట్టడం, లేదా కొట్టడం కూడా జరుగుతుంది..


ఇక్కడే ఆ దత్తాత్రేయుడి లీల మాకందరికీ ప్రత్యక్షంగా కనబడింది..


కార్లో ఉన్న ఆడవాళ్ళిద్దరూ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు..నేను కారు దిగి, అతన్ని పైకి లేపే ప్రయత్నం చేసాను.."నేను నిలబడతానయ్యా" అన్న మాటలు అతని నోటివెంట వచ్చాయి..అతను నా సహాయంతో రోడ్డు డివైడర్ మీద కూర్చున్నాడు, మోకాలి వద్ద గాయం లోంచి కొద్దిగా రక్తం వస్తోంది..కానీ మనిషి స్పృహలోనే వున్నాడు..


ఈలోపల ప్రక్కనే ఉన్న పొలాలలోంచి ఓ 20మంది ఆడా, మగా వచ్చారు..రావడమే ఆలస్యం ఇద్దరు ఆడవాళ్ళు వెనుకసీటు వద్దకు వెళ్లి, మా ఆవిడతో, చెల్లెలి తో.."అమ్మా మీరేమీ కంగారు పడకండి, ఆయన మా మనిషే..మేము చూసుకుంటాము" అన్నారు..అలాగే ఓ వ్యక్తీ నాదగ్గరకు వచ్చి, "అయ్యా..నువ్వు మొగిలిచెర్ల లోని దత్తాత్రేయ స్వామి దగ్గర వుండే ఆయనవి కదూ..నమస్కారమయ్యా..మా వాడు తాగిఉన్నాడు..మేము కేకవేస్తూనే ఉన్నాము..నీ తప్పేమీ లేదు..ఆడాళ్ళు భయపడ్డట్టున్నారు..నువ్వు బయల్దేరి పో"! అన్నాడు..


నేను 108 కు ఫోన్ చేసాను."ఎందుకయ్యా..మేము తీసుకెళ్తాము వీడిని.."అంటూ దారిలో పోతున్న ఆటో ను మాట్లాడి అతన్ని కూర్చోబెట్టారు..నేను జేబులోంచి ఓ 4000 తీసి ఇవ్వబోయాను..వద్దంటే వద్దన్నారు..నా ఫోన్ నెంబర్ ఇచ్చి, కావలి లో హాస్పిటల్లో చేర్చి నాకు ఫోన్ చేయమన్నాను..నా విజిటింగ్ కార్డు చూసిన ఒకతను, "అయ్యా..నువ్వు మొగిలిచెర్ల స్వామి దగ్గరుంటావా..స్వామీ నమస్కారం అయ్యా" అంటూ ఆటో లో ఆ మనిషిని ఎక్కించుకొని వెళ్ళిపోయారు..కేవలం దత్తాత్రేయుడి కృపే ఆరోజు మాకు కనబడింది..


ప్రమాదం జరిగిన 15 నిమిషాల తరువాత, అద్దం పగిలిపోయిన మా కారు, మేము ముగ్గురమూ మిగిలాము..


ఇప్పటికీ ఆ వ్యక్తుల నుంచి నాకు ఫోన్ లేదు..ఒక్క నయాపైసా తీసుకోలేదు..ఏమీ లేదు..కావలి లో ఉన్న మా బావమరిది ఆరోజు సాయంత్రం అన్ని హాస్పిటళ్లకూ వెళ్లి విచారించాడు..ఎక్కడా ఇలాటి కేసు వచ్చిందని ఎవరూ చెప్పలేదు..


అన్ని వైపులా ఆ దత్తాత్రేయుడి దయ మాత్రం ఉంది..సహస్ర బాహువులతో మమ్మల్ని కాపాడాడని నేనూ నా భార్యా ఇప్పటికీ అనుకుంటాము..


నిజమే..


సర్వం..

దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..9440266380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: