1, నవంబర్ 2021, సోమవారం

రామాయణం Day -5*

 *రామాయణం Day -5*

     

నారదుని వలన నీకు ఏవిధముగా *రామ కథ* చెప్పబడెనో ఆ విధముగనే నీవు *రామ కథ* చెప్పు.


*రాముడు* ధర్మాత్ముడు,లోకములో శ్రేష్ఠమైన గుణములు అని మనము చెప్పుకొనేవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి!

*రాముని* గూర్చిన అన్నివిషయములు నీకు తేటతెల్లము కాగలవు!


" కురు రామకధాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమామ్"


మనస్సును రమింపచేసేది, పుణ్యప్రదము అయిన *రామకథను* అక్షర బద్ధం చేయి. నీవు వ్రాసిన ప్రతి విషయము అక్షరసత్యము కాగలదు!.


యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే

తావద్రామయణకధా లోకేషు ప్రచరిష్యతి!


....ఎప్పటి వరకైతే భూమిమీద పర్వతాలు నిలచి ఉంటాయో! 

ఎప్పటివరకైతే భూమి మీద నదులు పారుతూ ఉంటాయో

అప్పటివరకు భూమి మీద *రామకథ* ప్రాచుర్యంలో ఉంటుంది!.


అప్పటివరకు నీవు పుణ్యలోకాలలో స్వేచ్ఛగా సంచరించగలవు!

అని పలికి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనారు.


బ్రహ్మ వరంచేత మహర్షి మనోఫలకం మీద ( మనసు తెర మీద) *రామచరిత* మొత్తం కనపడజొచ్చింది! .


*రామకథను* అక్షరబద్ధం చేయటానికి మహర్షి సంకల్పం గావించుకొన్నారు! .


పూర్వము ఇక్ష్వాకులు అని ఒక రాజవంశముండేది! వారు కోసలదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవారు.

 అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొన్నారు.


విశాలమైన రాజమార్గాలతో శోభాయమానంగా ఉండే పట్టణం అయోధ్య! ఉన్నతమైన కోట బురుజులు, వందలకొద్దీ శతఘ్నులు మొహరించి ఉండేవి ! రాజ్య రక్షణ వ్యవస్థ శత్రు దుర్భేద్యంగా ఉండేది.

ప్రజలంతా ధనధాన్యసమృద్ధితో, సుఖసంతోషాలతో, ఆనందంగా ఏ లోటులేకుండా జీవనం సాగించేవారు .


ఆ సమయంలో దశరధుడు దేవేంద్రుడిలాగా రాజ్యపాలన చేస్తున్నాడు.

ప్రజలను కన్నబిడ్డలవలే చూసుకుంటూ ఉండేవారాయన!.


దశరధమహారాజు వద్ద ఎనమండుగురు మంత్రులుండేవారు!

వారు అపూర్వమైన మేధాశక్తి కలవారు! ఎదుటివ్యక్తి ముఖకవళికలను బట్టి వారి మనస్సులోని ఉద్దేశ్యము గ్రహించేవారు!

రాజుకు మేలుకలిగించేవి, హితకరంగా ఉండేవి,మరియు ఆయనకు ప్రియమైన పనులు చేయటంలో వారు కడు సమర్ధులు.


వారు వరుసగా, ధృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్దుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు .


వసిష్ఠ, వామదేవులు ప్రధాన ఋత్విక్కులు.


మంత్రులందరూ అత్యంత నిబద్ధతో మెలిగేవారు , పటిష్ఠమైన గూడచార వ్యవస్థ కలిగి , రాజ్యము నలుమూలలా ఏమి జరిగినా క్షణాలలో తెలిసేటట్లుగా ఏర్పాటు గావించుకొన్నారు.

ఆ మంత్రులు, స్వయముగా తమ పుత్రులు తప్పు చేసినా వారిని దండించడంలో వెనుకాడేవారుకాదు! 

వ్యక్తులు చేసిన అపరాధ తీవ్రతను బట్టి శిక్షలు అమలు చేస్తూ ఉండేవారు! ..


బలవంతుడయిన వ్యక్తి, బలహీనుడయిన వ్యక్తి ఒకే తప్పు చేస్తే బలవంతుడికి శిక్ష తీవ్రత ఎక్కువగా ఉండేది! ( సరిగ్గా నేటి వ్యవహారానికి పూర్తి వ్యతిరేకము).


రాజ్యము, రాజ్యాంగము అంటే భయభక్తులతో మెలిగేవారు!


రాజ్యమందు ఎక్కడా కూడా ప్రజలలో అసంతృప్తి లేకుండా అద్భుతమైన పరిపాలనా వ్యవస్థ కలిగి మహేంద్రవైభవంతో పరిపాలన సాగిస్తున్నాడు దశరధమహారాజు!


జానకిరామారావు వూటుకూరు గారి 

సౌజన్యం తో....... *जय श्रीराम*

కామెంట్‌లు లేవు: