1, నవంబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం*

 *1.11.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*


*గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*21.9 (తొమ్మిదవ శ్లోకము)*


*కర్మణ్యో గుణవాన్ కాలో ద్రవ్యతః స్వత ఏవ వా|*


*యతో నివర్తతే కర్మ స దోషోఽకర్మకః స్మృతః॥13051॥*


కర్మలు చక్కగా నెరవేరుటకు, అందుకు కావలసిన సామాగ్రి పూర్తిగా లభించుటకు అనువైన కాలమే పవిత్రమైనది. కర్మలను నిర్వహించుటకు తగిన సామాగ్రి లభించునట్టి, ఆగంతుకమైన లేదా సహజమైన దోషములచే కర్మలు కొనసాగనట్టి కాలము అపవిత్రము - - అశుద్ధము అని తెలియవలెను.


*21.10 (పదియవ శ్లోకము)*


*ద్రవ్యస్య శుద్ధ్యశుద్ధీ చ ద్రవ్యేణ వచనేన చ|*


*సంస్కారేణాథ కాలేన మహత్వాల్పతయాఽథ వా॥13052॥*


ద్రవ్యములు, వచనములు, సంస్కారములు, కాలము, అధికము, అల్పము మొదలగువానిని బట్టి పదార్థములయొక్క పవిత్రతను, అపవిత్రతను నిర్ణయింపవలెను.


పాత్రలు జలముచే పవిత్రములగును, మూత్రాదులచే అపవిత్రములగును. ఏదైనను ఒక వస్తువు పవిత్రమైనదా? అపవిత్రమైనదా? అను శంక కలిగినప్పుడు బ్రాహ్మణుడు చెప్పినమీదట అది పవిత్రమగును. లేనిచో అది అపవిత్రమగును. పుష్పాదులపై జలములను చల్లినప్పుడు అవి పవిత్రములగును. వాసన చూచినచో అవి అపవిత్రములగును. అప్పుడే వండిన అన్నము పవిత్రము. చద్దిఅన్నము అపవిత్రము. పెద్దపెద్ద సరోవరములు, నదులు మొదలగు వాటియందలి జలములు పవిత్రములు, చిన్నచిన్న గుంతలలోని నీరు అపవిత్రము.


*21.11 (పదకొండవ శ్లోకము)*


*శక్త్యాశక్త్యాథ వా బుద్ధ్యా సమృద్ధ్యా చ యదాత్మనే|*


*అఘం కుర్వంతి హి యథా దేశావస్థానుసారతః॥13053॥*


దేశకాల, అవస్థాది భేదములను అనుసరించి, శక్తినిబట్టి, అశక్తతనుబట్టి, బుద్ధిబలమునుబట్టి, సంపద్వైభవనములనుబట్టి దోషాదోషభావములు వర్తించును. ఉదాహరణమునకు గ్రహణాదుల సమయమున శక్తిగలవారు స్నానాదులను ఆచరింపకుండుట దోషమగును, శక్తిలేనివారి విషయమున అది దోషముగాదు. పుత్రజన్మాదుల విషయమున తెలిసి జాతాశౌచములను పాటింపకుండుట దోషము, తెలియనప్పుడు అది దోషముగాదు. అట్లే సంపద్వైభవములు కలిగియున్నప్పుడు జీర్ణ మలినాది వస్త్రములను ధరించుట దోషము, నిర్ధనుల విషయమున అది దోషముగాదు. దేశ, కాల, అవస్థాదుల విషయమునగూడ దోషాదోషములు ఇట్లే వర్తించును (ధనికుడు, దరిద్రుడు, బలవంతుడు, దుర్బలుడు, బుద్ధిమంతుడు, మూర్ఖుడు, ఉపద్రవములు, ప్రశాంతతగల దేశములు, యువకులు, వృద్ధులు, ఇత్యాది భేదములనుబట్టిగూడ దోషాదోషముల విచారణ (నిర్ణయము) చేయవలెను.


*21.12 (పండ్రెండవ శ్లోకము)*


*ధాన్యదార్వస్థితంతూనాం రసతైజసచర్మణామ్|*


*కాలవాయ్వగ్నిమృత్తోయైః పార్థివానాం యుతాయుతైః॥13054॥*


ధాన్యములు, కర్రలు, ఏనుగు దంతములు మొదలగు ఎముకలు, దారములు (వస్త్రములు), నెయ్యి, తేనె, ఉప్పు, నూనె మొదలగు రసపదార్థములు, బంగారము, కంచు మొదలగు తైజస వస్తువులు, చర్మవస్తువులు, మట్టి వస్తువులు మొదలగునవి కాలానుగుణముగను, వాయువు, అగ్ని, మట్టి, జలము మొదలగువాటివలన పరిశుద్ధములగును.


ధాన్యాదులు కాలానుగుణముగా, వాయువువలనను, దార్వాది (చెక్కమొదలగు) పాత్రలు, మట్టి, జలములతోడను, గజ దంతాదులు వాయువు, సూర్యరశ్మిచేతను, వస్త్రాదులు జలములవలనను, క్షీరాదులు కాచుటవలనను, బంగారము, కంచు మొదలగు లోహములు అగ్నివలనను, చర్మవస్తువులు తైలముతోను, అన్నము మొదలగు భోజన పదార్థములలో కేశములు వచ్చినప్పుడు వాటిని తీసివేసి, ఆజ్యసంస్కారము జరుపుటవలనను పరిశుద్ధములగును.


*21.13 (పదమూడవ శ్లోకము)*


*అమేధ్యలిప్తం యద్యేన గంధలేపం వ్యపోహతి|*


*భజతే ప్రకృతిం తస్య తచ్ఛౌచం తావదిష్యతే॥13055॥*


అపవిత్ర పదార్థములు అంటినప్పుడు దుర్గంధములు, మాలిన్యములు తొలగిపోయి యథాస్థితికి వచ్చునంతవరకు వాటిని శుభ్రపరచవలెను. అప్పుడవి పవిత్రములగును.


*21.14 (పదునాలుగవ శ్లోకము)*


*స్నానదానతపోఽవస్థా వీర్యసంస్కారకర్మభిః|*


*మత్స్మృత్యా చాత్మనః శౌచం శుద్ధః కర్మాచరేద్ద్విజః॥13056॥*


ద్విజులు (మానవులు) నన్ను (భగవంతుని) స్మరించుచు, చిత్తశుద్ధిని పొంది, స్నానము, దానము, తపస్సు, వయస్సు (కర్మానుష్ఠాన వయస్సు), శక్తి, ఉపనయనాది సంధ్యోపాసనాది సంస్కారములు మున్నగు వాటిని ఆచరింపవలెను. అప్పుడు ఆ కార్యములు పరిశుద్ధములు అగును. అట్లొనర్చిన పిమ్మట ఇతర కార్యములను నిర్వర్తింపవలెను.


*21.15 (పదునైదవ శ్లోకము)*


*మంత్రస్య చ పరిజ్ఞానం కర్మశుద్ధిర్మదర్పణమ్|*


*ధర్మః సంపద్యతే షడ్భిరధర్మస్తు విపర్యయః॥13057॥*


గురువుద్వారా ఉపదేశమును పొంది, దాని అర్థపరిజ్ఞానముతో మననము చేసినప్పుడు మంత్రశుద్ధి ఏర్పడును. కర్మములను భగవదర్పణము చేసినప్పుడే అవి పవిత్రములు (సార్థకములు) అగును. ఈవిధముగా దేశము, కాలము, పదార్థము, కర్త, మంత్రము, కర్మలు అను ఆరును శుద్ధమొనర్చుట ధర్మము, దీనికి వ్యతిరేకముగా ఆచరించినచో అవి పరిశుద్ధములుగావు. అట్లు చేయుట అధర్మము.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: