1, నవంబర్ 2021, సోమవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*486వ నామ మంత్రము* 1.11.2021


*ఓం శ్యామాభాయై నమః* 


శ్యామలవర్ణంలో భాసిల్లు రాకినీస్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్యామాభా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం శ్యామాభాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ రాకినీదేవిస్వరూపంతో భాసిల్లు ఆ జగన్మాతను ఆరాధించు సాధకులు సకలార్థసిద్ధిని పొందుటయే గాక, ఆ పరమేశ్వరిని హృదయస్థానమునందలి దహరాకాశంలో ప్రతిష్టించుకొని, ధ్యాన నిరతితో తరించుదురు.


అనాహతాబ్జనిలయమందు విలసిల్లు రాకినీస్వరూపిణియైన పరమేశ్వరి శ్యామల వర్ణముతో (నల్లని శరీర వర్ణముతో) భాసిల్లును. పదహారు వత్సరముల బాలికను *శ్యామ* అని అందురు. అమ్మవారు అటువంటి పదహారు వత్సరముల బాలికగా భాసిల్లుచున్నది గనుక, రాకినీస్వరూపిణియైన ఆ తల్లి *శ్యామాభా* అని యనబడినది. *భా* యని అనగా ప్రకాశించుట అని అర్థము. నల్లనికాంతితో భాసిల్లు రాకినీదేవి నలుపులోనే చక్కదనముగల నలుపు వర్ణము. అ నల్లని వర్ణముగల ముఖమునందు దొండపండువంటి పెదవులు, నక్షత్రకాంతులను ధిక్కరించే నాసాభరణముతో అమ్మవారు ప్రసన్నస్వరూపముతో భక్తులకు వరదాయనిగా గోచరిల్లు చుండును. సిందూరవర్ణశోభితమైన కుంకమతిలకముతో భాసిల్లు ఆ పరమేశ్వరి నల్లనిమోము నీలోత్పలమువలె (నల్లకలువవలె) తేజరిల్లుచున్నది. 


నీలోత్పలమువంటి మోము గలిగిన పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం శ్యామాభాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: