1, నవంబర్ 2021, సోమవారం

సంస్కృత మహాభాగవతం

 *1.11.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఇరువది ఒకటవ అధ్యాయము*


*గుణదోషముల వ్యవస్థయొక్క స్వరూపము - అందలి రహస్యము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీభగవానువాచ*


*21.1 (ప్రథమ శ్లోకము)*


*య ఏతాన్ మత్పథో హిత్వా భక్తిజ్ఞానక్రియాత్మకాన్|*


*క్షుద్రాన్ కామాంశ్చలైః ప్రాణైర్జుషంతః సంసరంతి తే॥13043॥*


*శ్రీకృష్ణభగవానుడు పలికెను* ఉద్ధవా! నేను ఉపదేశించిన మోక్షసాధకములైన భక్తి, జ్ఞాన, కర్మ మార్గములను వీడి చంచలములైన ఇంద్రియములద్వారా క్షుద్రములైన శబ్దాది విషయములను అనుభవించువారు పదేపదే జన్మమృత్యురూపమైన సంసారచక్రమున పరిభ్రమించుచుందురు.


*21.2 (రెండవ శ్లోకము)*


*స్వే స్వేఽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః|*


*విపర్యయస్తు దోషః స్యాదుభయోరేష నిశ్చయః॥13044॥*


మానవులు తమ తమ వర్ణాశ్రమ ధర్మముల యందు దృఢమైన నిష్ఠకలిగియుండుటయే గుణము. అందులకు విరుద్ధముగా ఇతర వర్ణాశ్రమ ధర్మములను ఆచరించుట దోషము. సారాంశమేమనగా గుణదోషములయొక్క నిర్ణయము ఆయా వ్యక్తుల అర్హతలనుబట్టి యుండును.


*21.3 (మూడవ శ్లోకము)*


*శుద్ధ్యశుద్ధీ విధీయేతే సమానేష్వపి వస్తుషు|*


*ద్రవ్యస్య విచికిత్సార్థం గుణదోషౌ శుభాఽశుభౌ॥13045॥*


తాత్త్విక (వాస్తవిక) దృష్టితో చూచినప్పుడు వస్తువులు అన్నియును సమానములే. వాటి ప్రయోజనమును బట్టి, వాటి గుణదోషములు నిర్ణయింపబడును. ద్రవ్యముయొక్క మంచి-చెడులను గురుంచి కలిగిన సందేహముసు నివారించుటకై ఆ ద్రవ్యమును చక్కగా పరిశీలించి నిరీక్షణ-పరీక్షణలద్వారా దాని సహజస్వభావమును గురుంచిన గుణదోషములు, శుభాశుభములు నిగ్గుదేల్చబడును.


*21.4 (నాలుగవ శ్లోకము)*


*ధర్మార్థం వ్యవహారార్థం యాత్రార్థమితి చానఘ|*


*దర్శితోఽయం మయాఽఽచారో ధర్మముద్వహతాం ధురమ్॥13046॥*


పుణ్యపురుషా! ఉద్ధవా! వర్ణాశ్రమ ధర్మానుష్ఠానము శాస్త్రసమ్మతముగా, లోకవ్యవహారమునకు అనుగుణముగా, వ్యక్తులయొక్క జీవనవిధానములకు తోడ్పడునదిగా ఉండవలెను. ధర్మబద్ధముగా జీవించువారికి కలిగే సందేహములను నివారించుటకొరకే ఆచార (ధర్మ)మును నేను మనువుద్వారా తెలిపియుంటిని.


*21.5 (ఐదవ శ్లోకము)*


*భూమ్యంబ్వగ్న్యనిలాకాశా భూతానాం పంచధాతవః|*


*ఆబ్రహ్మస్థావరాదీనాం శారీరా ఆత్మసంయుతాః॥13047॥*


భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము - అను పంచమహాభూతములు బ్రహ్మ మొదలుకొని స్థావరముల వరకు గల సకల శరీరములకును మూలకారణములు. ఇవి అన్నియును శరీరదృష్టితో చూచినప్పుడు సమానములే. వీటియందలి ఆత్మకూడ ఒక్కటే.


*21.6 (ఆరవ శ్లోకము)*


*వేదేన నామ రూపాణి విషమాణి సమేష్వపి|*


*ధాతుషూద్ధవ కల్ప్యంత ఏతేషాం స్వార్థసిద్ధయే॥13048॥*


ఉద్ధవా! పంచమహాభూతములు సమస్తప్రాణి పదార్థములయందును సమానముగనే యున్నవి. లోక వ్యవహారమునకై వాటికి వేదము వేర్వేరు నామరూపములను కల్పించెను.


*21.7 (ఏడవ శ్లోకము)*


*దేశకాలాదిభావానాం వస్తూనాం మమ సత్తమ|*


*గుణదోషౌ విధీయేతే నియమార్థం హి కర్మణామ్॥13049॥*


సాధుసత్తమా! మానవుల కర్మలయందు విశృంఖలప్రవృత్తి ఏర్పడగూడదనియు, నియమాను సారముగా, మర్యాదపూర్వకముగా కర్మలను ఆచరించుట కొరకు దేశము, కాలము, ద్రవ్యము మొదలగు వాటి గురుంచి గుణదోషములను విధించితిని.


*21.8 (ఎనిమిదవ శ్లోకము)*


*అకృష్ణసారో దేశానామబ్రహ్మణ్యోఽశుచిర్భవేత్|*


*కృష్ణసారోఽప్యసౌవీరకీకటాసంస్కృతేరిణమ్॥13050॥*


కృష్ణసారములు (నల్లజింకలు) లేనిదేశమును, ధార్మికప్రవృత్తి లేని దేశమును అపవిత్రమైన దేశముగా భావింపవలెను. ఒకవేళ కృష్ణసారములు ఉన్నను వేదవేత్తలను ఆదరించనిచో ఆ దేశములు అపవిత్రములే యగును. కీకట (కళింగాది) దేశములు అపవిత్రమైనవే. తీర్థయాత్రలకై దప్ప అవి మసలుటకు అర్హములు కావు. సంస్కారరహితములు, మరియు ఊసరక్షేత్రములు గూడ అపవిత్రమైనవే.


(శ్రీ వేదవ్యాసప్రణీతబ శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఇరువది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: