ॐ సత్యసాయి ఆరాధన
అవతారము - అవతార పురుషులు
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ I
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥"
1. సాధు, సజ్జనులను సంరక్షించుటకొఱకును,
2. దుర్మార్గులను వినాశమొనర్చుట కొఱకును,
3. ధర్మమును తిరిగి స్థాపించుట కొఱకును నేను ప్రతియుగమునందును అవతరించుదును.
భగవద్గీత 4- 8
కాబట్టి అవతరించి, పరిస్థితులు చక్కబరచడానికి ప్రాధాన్యతలలో,
మొదటిది - మంచిని కాపాడుట,
రెండవది - చెడు తొలగించుట,
మూడవది - దరిదాపులలో చెడు తిరిగి పుట్టకుండా, మంచియే ఉండునట్లు ధర్మస్థాపన చేయుట.
1. కృతయుగంలో దైవ - రాక్షస లోకాలు వేరువేరుగా ఉండేవి.
హిరణ్యకశిపుడు దేవలోకాలు ఆక్రమించుకుంటే,
ప్రహ్లాదుని కాపాడుతూ,
హిరణ్యకశిపుని తొలగించాడు.
2. త్రేతాయుగంలో దైవ - రాక్షస దేశాలు వేరువేరు.
విభీషణుని కాపాడి,
రావణుని తొలగించాడు.
3. ద్వాపర యుగంలో దైవ - రాక్షస కుటుంబాలు వేరువేరు.
పాండవులను కాపాడుతూ,
కౌరవులను తొలగింపజేశాడు.
4. కలియుగంలో ప్రతి మనిషిలోనూ దైవ - రాక్షస ప్రవృత్తులుంటాయి.
మనలోని మంచి మనచేత గుర్తింపజేసి,
మనలోని చెడు తలంపు మనమే తొలగించి సంస్కరింపజేసేందుకే భగవంతుడు సంకల్పించుకొని అవతరిస్తాడు.
కలి ప్రభావంతో మళ్ళీ మామూలు పరిస్థితులు మారి, అవతార ఆవశ్యకత పదేపదే కలుగుతుంది.
అందుకనే అవతార పురుషులు అవతరించి, అవతారంగానే పరిస్థితులు చక్కదిద్దతారు.
అందులో భాగంగానే మన అనుభవంలోనున్న స్వామి.
భగవాన్ సత్యసాయి అవతార లక్ష్యం:
అందఱినీ ప్రేమించు - అందఱినీ సేవించు
LOVE ALL - SERVE ALL
మనం మానవులం. అంటే మనసుతో జీవించేవాళ్ళం.
మనస్సు సంకల్ప-వికల్పాలు చేస్తూంటుంది. దానిలో భాగంగా పరిపరి విధాలపోతుంది.
ఇది ఒక కోతి వంటిదంటారు ఆది శంకరులు శివానందలహరిలో. దానిని భక్తి అనే త్రాటితో కట్టేయమని ఆయన పశుపతిని ప్రార్థిస్తారు.
వాసుదేవుడు
సకల జీవరాశిలో అంతర్యామిగా ఉంటూ, అన్నిటినీ వాటివాటి రూపాలలో ఉంచుతూ, సాక్షీభూతంగా ఉండేవాడు అని "వాసుదేవుడు" అనే నామానికి అర్థం.
(వసతి - వాసయతి - ఆచ్ఛాదయతి - సర్వమ్మితి వాసుదేవః)
మాయలో ఉంటే "దేహమే నేను",
మాయతొలగితే "ఆ వాసుదేవుడే నేను".
మనలోనే ఉండి మనమెవరో ఎఱింగించి, ఇతరులలోనున్న తనను మనం గుర్తించేలాగు అనుగ్రహించడమే ప్రస్తుత అవతార ఆవశ్యకత.
దానికి సేవలనే మార్గంగా ఎంచుకున్నారు.
తాను - విద్యా, వైద్యాదులన్నిట ఆదర్శవంతమైన సేవలని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేసి నిరంతరంగా నడిపించడం ఒక్క స్వామికే సాధ్యం.
"యద్యదాచరతి శ్రేష్ఠః ----"
- శ్రేష్ఠులు ఏది ఆచరిస్తారో దానినే ఇతరులు కూడా ఆచరిస్తారనే గీతావాక్యం నిజంచేయడానికి అదే నిదర్శనం కదా!
మనకి భౌతికంగా దూరమై దశాబ్దకాలమైనా, అవతార పురుషుడుగా, తన లక్ష్యం నెరవేర్చడానికి స్వామి మనందరిని కార్యోన్ముఖులను గావించడం అత్యంత ముఖ్యంగా గమనించవలసినది.
వ్యక్తులుగా,
సమితులలో బృందాలుగా,
కేంద్ర సంఘం నియమించిన బాధ్యతలలోనూ
మనం - మనలోని దైవాన్ని గుర్తెరిగీ,
ఇతరులలోనున్న దైవాన్ని గుర్తించీ,
సేవ చేయడమే మన జీవితధ్యేయం - అనేది నిరంతర ప్రక్రియ.
దానికి మనమంతా పరికరాలం మాత్రమే! నడిపించేది దైవమే అని గుర్తెరగాలి.
ॐ శ్రీ సాయిరాం
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి