**********************
ఆదిశంకరుల " మనస్సు "
**********************
మునుపెన్నడూ లేనిది ఈ మధ్య కాలంలో " మనోభావాలు " అన్న పదం ఎక్కువ ప్రాచుర్యం లోకి వచ్చింది. దీనికి మీడియానే కారణము.
.
కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, రోజుకి ఇరవై నాలుగు గంటలు ఖర్చుపెట్టి, వందలు, వేలాది మందిని వాడుకొని, కోట్లాదిమందికి ’ అజ్ఞానాన్ని ’ పంచిపెడుతున్నది.
.
మనోభావాలు.. అన్న పదం లేదని కాదు, దాన్ని ఎలాగ అవగాహన లేకుండా తప్పుగా వాడుతున్నారో చెప్పే ప్రయత్నమిది .
*********************************************
మన మనసే మన ఆలోచనలకు, చర్యలకు మూలము. మనస్సు వల్ల అత్యంత ఘోరమైన దుఃఖము, అమితానందము కూడా కలుగుతాయి. కలగడమే కాదు, ఆ మనసే వాటిని అనుభవిస్తుంది కూడా!
మనిషిని , సంబంధాలను, జీవితాన్ని ప్రభావితం చేసే మనసు మహత్వం అంతా యింతా కాదు.
ఆది శంకరుల జయంతి సందర్భంగా, ఆ మనసేమిటో, దాని వ్యవహారమేమిటో, దాని కథా కమామీషు ఏమిటో ఆది శంకరుల మాటల్లోనే తెలుసుకుందాము.
**********************
మన దేహము బయట మనకు కనిపించే అయిదు కర్మేంద్రియాలు మాత్రమే కాక, మనకు మరో అయిదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. అలాగే లోపల కూడా దేహాన్ని నడిపించే అంతఃకరణము ఉంటుంది. అది చేసే విధులను బట్టి దాన్ని వేర్వేరు పేళ్ళతో పిలుస్తారు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము---ఇవన్నీ ఆ అంతఃకరణము నామాంతరాలే.
.
మన శరీరం లో అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అని ఐదు కోశాలు ఉన్నది తెలుసు కదా..
.
ఈ మూడవదైన మనోమయ కోశము, అయిదు జ్ఞానేంద్రియాలు, మరియు మనస్సు వల్ల ఏర్పడింది. ఈ సమూహములో మనసే ప్రధానమయినది. అందుకే దీన్ని " మనోమయ కోశము " అన్నారు.
.
నేను, నా ఆస్తులు, నా భార్యా పిల్లలు, నా గొప్పదనము--వంటి భావనలకు పుట్టిల్లు ఈ మనసే. ఈ మనోమయ కోశము, స్థూలంగా చూస్తే , అటువంటి భావనలతో ప్రాణమయ కోశములో విజృంభిస్తూ ఉంటుంది.
కొందరు ఈ మనసే ’ ఆత్మ ’ అని పొరపడతారు. కాని ఇది ఆత్మ కాదు.
.
యజ్ఞము చేసేవారికి తాము అగ్నిలో ఇచ్చు ఆహుతుల వలన ఎలా స్వర్గ సుఖాలు, ఇష్టార్థాలు దక్కుతాయో, అలాగ ఈ మనోమయ కోశాగ్నిలో ఇచ్చు ఆహుతుల వలన సుఖదుఃఖాలు కలుగుతాయి.
.
యజ్ఞం లో ఎలా అయితే పిడకలు, కర్రలు ఇంధనం గా ఇస్తామో, అనేక జన్మాంతర సంస్కారాలు ఈ మనోమయ కోశాగ్నికి ఇంధనం గా మారుతాయి.
యజ్ఞం లో ఎలా అయితే నెయ్యి మొదలైన వాటిని ఆహుతులుగా ఇస్తామో, ఇక్కడ విషయాకర్షణలు మొదలైనవి ఆహుతులుగా మారుతాయి.
యజ్ఞం లో ఋత్త్విక్కులు ఉన్నట్టే, ఇక్కడా మన ఇంద్రియాలే ఋత్త్విక్కులు. ఈ మనోమయకోశపు యజ్ఞము వల్లనే మనకు ఈ దృశ్యమానమైన మాయా ప్రపంచము కనబడుతుంది.
.
ఈ మనస్సే, అవిద్య. లేదా, అజ్ఞానం. " నేను చేస్తున్నాను" అన్న కర్తృత్వ భోక్తృత్వాలను కలిగించి, సంసార బంధాలను కలిగిస్తుంది. ఈ అవిద్య నాశనమయితేనే బంధ విముక్తి కలుగుతుంది. మనస్సు విజృంభిస్తున్నంతకాలమూ బంధాలు పెరుగుతూనే ఉంటాయి.
.
స్వప్నములో ఒక మిథ్యా ప్రపంచాన్ని చూపేది కూడా మనస్సే.
స్వప్నములో ఎలాగైతే మిథ్యా ప్రపంచాన్ని మనసు చూపిస్తుందో, మేలుకున్నపుడు కూడా ఇంకో మిథ్యా ప్రపంచాన్ని చూపిస్తుంది. ఈ బాహ్య ప్రపంచానికీ, మిథ్యా ప్రపంచానికీ తేడా లేదు. ఈ ప్రపంచాలు మనస్సు కలిగించే విక్షేపమే తప్ప అవి వాస్తవాలు కాదు.
.
కాబట్టి మనస్సు ఎంతటి శక్తివంతమయినదో అంత ప్రమాదకారి, అంతటి చంచలమైనది కూడా.
.
సంకల్ప వికల్పాలను కలిగించేదే మనస్సు.
.
వాయువు చేత మేఘాలు ఆవరింపబడి, చీకట్లు కమ్ముకుని, అదే వాయువు చేత మేఘాలు తొలగింపబడి వెలుగు పరచుకున్నట్టే, సంసార బంధాన్ని కలిగించేదీ, తొలగించేదీ మనస్సే. అజ్ఞానాన్ని కలిగించేదీ, దాన్ని తొలగించేదీ మనస్సే.
.
ఇంద్రియాల సహాయంతో మనసు దేహాన్ని బంధించినట్లే, అవే ఇంద్రియాల సహాయంతో బంధమోచనం కలిగిస్తుంది.
వివేక వైరాగ్యాలు కలిగే కొద్దీ మనసు పరిశుద్ధమవుతుంది.
విషయాకర్షణలను కలిగించేదీ మనసే, తొలగించేదీ మనసే.
.
మనసే ప్రధానముగా కలిగిన మనోమయ కోశానికి ఒక ఆది [ జననం] , అంతం ఉన్నాయి. అంతే కాక అది మార్పు చెందుతూ సుఖ దుఃఖాలను పొందుతూ ఉంటుంది.
మనస్సు కు ఇన్ని ధర్మాలున్నప్పటికీ, ఇన్ని ప్రభావాలున్నప్పటికీ అది గోచరము కానిది.
***************************
మనసును నియంత్రణలో ఉంచుకున్నవాడు లోకాలను తైతక్కలాడించగలడు--అంటారు శ్రీ దేవుడు నరసింహ శాస్త్రి గారు.
మనసుకు అనేకులు అనేక నిర్వచనాలు చెప్పినారు. కానీ ఆదిశంకరులు వివరించిన మనసు ఆధారంగానే ఆ నిర్వచనాలు ఉంటాయి.
.
ఆది శంకరులు కూడా కొత్తగా ఏమీ చెప్పలేదు. ఉపనిషత్తులలో ఉన్నదాన్ని మాత్రమే వారు సరళీకృతం చేసినారు. అయినా అది అర్థమయ్యేది కొందరికే.
.
ఎందరు ఎన్ని చెప్పినా అది సరళీకరణ కోసము మాత్రమే.
మనకు ఏమి అర్థమయింది అన్నదాన్ని బట్టి వివిధ నిర్వచనాలు మనకు కొన్ని సరిగ్గాను, కొన్ని అసమగ్రముగాను కనిపించవచ్చు.
అన్నిటినీ అర్థము చేసుకొని క్రోడీకరించుకొని, ఎవరికి వారు మనసును నిర్వచించుకోవచ్చును.
.
ఎవరెలా నిర్వచించినా, మనసు అనేది ఒక ’ అవిద్య ’ అని,’ అజ్ఞానము ’ అనీ, బంధాలు, పాశాలు కలిగించేదీ, వదిలించేదీ మనసే అనీ, ప్రపంచమే మిథ్య అయినప్పుడు, మనసు అనేది కలిగించే భ్రాంతులను అర్థము చేసుకోకుండా , వాటికి లొంగి పోయి వైషమ్యాలు పెంచుకోవడము, ఆందోళనలు చేయడము, ఫిర్యాదులు, పగలు, ప్రతీకారాలు మొదలు పెట్టడము ఎంత హాస్యాస్పదమో తెలుసుకోవాలి.
.
ప్రతీదానికీ ’ మనోభావాలు ’ అంటూ రోదిస్తూ వాతావరణాన్ని కలుషితం చేసేవారిని ’ చదువుకున్న మూర్ఖులు ’ అనక తప్పదు.
సమస్యలు ఎన్ని ఉన్నా, ఇతరుల మాటలు, వ్యాఖ్యలే వాటికి కారణము అని భావించడము తప్పు.
.
అయితే, ధర్మానికి సంబంధించినది ఏదైనా జరక్కూడనిది జరిగితే, అప్పుడు దాన్ని ఎదిరించాలి. అక్కడ కూడా ’ మనోభావాల ’ ప్రసక్తి రాకూడదు, రాదు. కేవలము ధర్మానికి గ్లాని కలిగితే అది విషమ పరిస్థితులకు దారి తీస్తుంది కాబట్టి ఎదిరించాలి. మనోభావాలు దెబ్బతిన్నాయని కాదు.
అక్కడ సమస్య గుర్తించక, ఇంకేమనాలో తెలియక, అనేకులు ’ మనోభావాలు దెబ్బతిన్నాయి ’ అని సులభంగా అనేస్తుంటారు.
.
// శ్రీ సద్గురు చరణారవిందో~ర్పితమస్తు //
[ ఆది శంకరుల " వివేక చూడామణి " నుండీ సంకలితము.. ]
శంకరుల బోధలు, నా " మనసు " కు అర్థమైనట్టు చెప్పే ప్రయత్నము చేశాను. ఇందులో మీకు నచ్చిన మంచి ఉంటే అదంతా శంకరుల అనుగ్రహమే.
.
తప్పులుంటే అవి పూర్తిగా నావే.
తప్పులు కనబడితే చెప్పండి, .. ]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి