🥭🥭🥭🥭
వంటింటి వైపు రాగానే తియ్యటి వాసన!
‘మావిడిపళ్లా?’ ఒక్కరుపు అరిచాను. అవునంది అమ్మ.. 😋
... భలే తియ్యటి వాసన గదంతా!
గోనెపట్టామీద గడ్డిలో అప్పుడే పుట్టిన చిన్ని కృష్ణుడి లా కనబడుతున్నాయి..😍
కొద్దిగా పండని పళ్ళు.. గోనెపట్టామీద గడ్డి పరిచి పళ్లన్నిటినీ పసిపాపల్లా పడుకోబెట్టి, పైన మరింత గడ్డి కప్పేసి వుంచేవారు.
మనం రోజులో పదిసార్లైనా ఆ గదిలోకెళ్లి వాటిని పరామర్శించి వచ్చేవాళ్లం.
వారం తరవాత ఒకపండు కాస్త మెత్తబడగానే టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పేపర్ పట్టుకుని చేసినట్టు ఇల్లంతా తిరిగేస్తూ హడావుడి చేసేవాళ్లం.
అసలా మావిడిపళ్ల 🥭 ఆకలి చాలా దారుణమైన ఆకలి.
వదిల్తే అన్నీ తినెయ్యాలన్నంత!
‘అది కడుపా ఖండవిల్లి మడుగా? ఎన్ని తింటావు? ఆనక అజీర్తి చేస్తుంది!’ అని అమ్మా, నాన్నగారు తిడుతున్నా సరే! 😇
వేసంకాలం ఊరగాయల రోజుల్లో కొత్తావకాయ కలపడానికి అమ్మానాన్నా చేసే హడావుడి గమ్మత్తుగా వుండేది. నాల్రోజుల ముందునుంచీ ఊరంతా తిరిగి బారామాసి కాయలు ఎక్కడ దొరుకుతాయో చూసి కొనేవారు.
కొన్ని కాయలు చూడ్డానికి నా అంత లావున్నా పులుపుండవు. అందుకని ముందుగా ఓ కాయలోంచి చిన్నముక్క కోసిమ్మనాలి.
అది నోట్లో పెట్టుకున్న మరుక్షణం మనకి తెలీకండానే మన ఎడంకన్ను మూసుకుపోయి, 😉 మన నాలుకెళ్లి అంగుట్ని ‘ఠాప్’ మంటూ కొట్టాలి !
‘బాబోయ్, పులుపు రొడ్డు!’ 😖 అనేది అమ్మ.
ఆవకాయంటే ఏడాదంతా మనల్ని ఆదుకునే ఎర్రని తల్లి కదా! అంచేత కాయ గట్టిగా టెంకపట్టి, పుల్లగా వుంటేనే నిలవుంటుంది.
ఇక అసలు విషయానికొద్దాం.
వేడివేడన్నంలో అంత ఆవకాయ కలుపుకుని, పక్కన బాగా ముగ్గిన చెరుకురసం మావిడిపండొకటి పెట్టుకుని, ముద్దముద్దకీ తింటూవుంటే వుంటుందీ... నాసామిరంగా!
వేటూరి పాటని ఇళయరాజా చేత కొట్టించుకున్నంత ధీమాగా అనిపిస్తుంది
అసలు మావిడిపండెలా తినాలో పిల్లలకి మనం శిక్షణా తరగతులు నిర్వహించాలి.
ఆమధ్య సమ్మర్లో ఓరోజు హొటల్లో భోంచేస్తోంటే అన్నంలోకి అరటిపండుకి బదులు మావిడిపండిచ్చాడు.
నా పక్కన కూర్చున్నతను భోజనం అంతా అయిపోయాక పండుని ‘స్స్...స్స్...!’ అని ఓసారి గట్టిగా పీల్చి పక్కనబడేసి లేచి చెయ్యి కడిగేసుకున్నాడు. 😡
నాకు వాణ్ణి చంపెయ్యాలనిపించింది.
అసలు మనం తొక్కని పిండి తిన్న తరవాత దానిమీంచి రోడ్డురోలరెక్కించి తొక్కించినా ఒక్క బొట్టుకూడా రసం రాకూడదు..🤤
ఇక టెంకయితే మనల్ని ఏడుస్తూ వేడుకోవాలి... ‘చీకింది చాలు, ఇక ఆపరా బాబూ!’ అని! అంతలా వేధించాలి మావిడిపండుని!😝
అసలు వాణ్ణని ఏంలాభం?🤔 వాళ్లమ్మా నాన్నల్ని అనాలి. పిల్లలకి సంస్కారం నేర్పకపోయినా ఫరవాలేదు, పొద్దున్నే వచ్చే వాట్సప్ ఫార్వర్డ్స్ ఓ నాలుగు చదివితే అదే వస్తుంది.
కానీ మావిడిపండు తినడం మాత్రం తప్పకుండా నేర్పాలి! 😀
తాతగారేం చేసేవారంటే చెరుకురసాలు, పందార కలిశలు పరకల లెక్కన తెచ్చేవారు. వాటన్నింటినీ గోలెంలో నిండా నీళ్లుపోసి అందులో పడేసేవారు. ఎవడికెన్ని తినాలనిపిస్తే అన్నీ తీసుకు తినెయ్యడమే!
వెంకటేశ్వరస్వామి గుళ్లో బోల్డంత నెయ్యి, జీడిపప్పూ వేసి చేసిన చక్రపొంగలి ప్రసాదం ఓ పెద్ద బేసిన్లో పెట్టేసి అక్కడెవరూ లేకుండా మనల్నే పెట్టుకు తినమంటే ఎలావుంటుంది? ఏలక్కాయ తొక్కలు కూడా మిగల్చం కదా? అచ్చం అలాగన్నమాట! 😋
అమ్మ, అమ్మమ్మ అరగంటకోసారి గోడ గడియారంలో గంటలు కొట్టినట్టు ‘అన్ని పళ్లు తినకండ్రా! సెగ్గడ్డలొస్తాయీ!’ అంటూ రాగాలు తీసేవారు. సెగ్గడ్డలొస్తే ఏదో చూర్ణఁవో, భస్మఁవో తెచ్చుకుని వేసుకుంటాం. రెండ్రోజుల్లో మాడిపోతాయి.
మన చిన్నతనాల్లో మావిడిపళ్లు పరకలు, డజన్ల లెక్కన కొనేవాళ్లం కదా?
ఆర్నెల్లకోసారి హైదరాబాద్ వెళ్లొచ్చి నాన్నగారు ‘అక్కడ మల్కాజిగిరిలో మావిడిపళ్లు కేజీల్లో కొలిచి అమ్ముతారు. కలికాలం! ఇంకా ఏంచూడాల్సొస్తుందో?’ అంటూ ఆశ్చర్యం, విచారం కలిపి బాధపడిపోయేవారు.
ఇక మావిడిపళ్ల వంశంలో తనదైన స్థానం ఉన్న ఏకైక రకం... బంగినపల్లి! రసాలైతే వయసైపోయినట్టు ఒళ్లంతా ముడతలుంటాయి. కానీ ఇవలా కాదు. మంచి యవ్వనంతో మిసమిసలాడుతూ ఒక్క ముడతైనా లేకుండా నిగనిగలాడి పోతుంటాయి.
పెరుగన్నంలో బంగినపల్లి ముక్కలేసుకుని పళ్లతో గీరుకు తినడం భోజనానికి ఒక పరిపూర్ణత చేకూరుస్తుంది. కొంతమంది బొప్పాయి పళ్లకి మల్లే తొక్కలు తీయించి, పనసపొట్టులా చిన్నచిన్న ముక్కలు కోయించుకు తింటారు.
అంత రెడీమేడ్ గా తినడంకన్నా ఓ సీసాడు 'మాజా' తాగడం బెటరు.
లేకపోతే సామర్లకోట స్టేషన్లో మావిడితాండ్ర అమ్మొచ్చినపుడు కొనుక్కుతినాలి.
అంత మావిడిపళ్ల ముక్కల్ని గీరుకు తినలేనంత వ్యాపకాలేఁవిట్టా??😀
బజారెళితే నాన్నగారు చాలా పెద్దసైజు పళ్లు అరడజను కొనేవారు. ఆయనెప్పుడూ క్యాంపులే! అట్నించి వచ్చేటప్పుడూ బోల్డన్ని తెస్తూండేవారు. పాపం ఆయన తినేది తక్కువైనా సరే పిల్లలున్నారని తెచ్చిపడేసేవారు.
అంత పెద్ద పండునీ అమ్మ కత్తిపీటతో తరిగేది. పైపెచ్చు ఓ మాటనేది...
‘ఈ చెంప నీకు, ఆ చెంప అన్నయ్యకీ! సైడు ముక్కలు ఆడపిల్లలు తింటార్లే!టెంక మీరెలాగూ తినరు కాబట్టి నాకుంచెయ్యండి. అదిచాలు నాకు!’
అది బంగినపల్లి కంటే తియ్యని మనసు కదా!😊 అంచేత అలానే చేస్తుంది. ఈ ముక్క రాస్తోంటే కళ్లెందుకో నీళ్లతో నిండిపోతున్నాయి.
మావిడిపండంటే తీపే కాదు!
తీపి జ్ఞాపకం కూడా!
💭 😍 🥭🥭🥭
మనవి : ఇది మామిడి పండ్ల మీద మమకారం తో ఎవరో మహానుభావులు వ్రాసిన కధనం... ఎవరో తెలీదు గానీ, చాలా బాగా రాసారు.. అన్నీ కళ్ళకి కట్టినట్టు.. పాత రోజులన్నీ గిర్రున వెనక్కి తిప్పినట్టు..😍
మీకు మామిడి పండ్లు 🥭 ఇష్టం అయితే, హాయిగా చదివి ఆనందించి, మీ చిన్ననాటి స్నేహితులకి, చుట్టాలకి పంపండి 🥰
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి