*దివిజేంద్రసుతునిఁ జంపియు రవిసుతు రక్షించినావు రఘురాముడవై దివిజేంద్ర సుతుని గాచియు రవిసుతుఁ బరిమార్చితౌర! రణమున కృష్ణా*
అంటే ఇక్కడ రెండు యుగాల ప్రస్తావనలు కలవు. రెండు యుగాలలోనూ భగవంతుడు ఒక్కరే అన్నట్టు అంటే వివిధ అవతారాలతో.
మొదటి యుగాన్ని పరిశీలిద్దాం. అది త్రేతాయుగము. శ్రీరాముడి కాలము నాటిది. రామాయణంలోని ముఖ్య వివరాలను పక్కనబెట్టి కేవలం వాలి హతమే ఇక్కడ ప్రస్తావించబడింది.
దివిజేంద్రు సుతుడు అంటే వాలిని సంబోధిస్తుంది మరియు రవి సుతుడు సుగ్రీవుణ్ఢి. అంటే ఇక్కడ రాముడు వాలిని హతమార్చి సుగ్రీవుడికి రాజ్యభారం అప్పగించాడు కదా.
అలాంటిదే మరో వృత్తాంతం ద్వాపరయుగంలో కూడా తటస్థమయింది. అది కర్ణార్జునుల వైరము. ఇక్కడ శ్రీ కృష్ణుడు దివిజేంద్ర సుతుని అంటే అర్జునుడిని కాపాడి రవిసుతుని అంటే కర్ణుణ్ణి సంహరించాడు కదా.
అంటే కొన్ని సార్లు భగవంతుని లీలలు మనకు అర్థం కావు. ఒక యుగంలో ఒక అంశాన్ని కాపాడి మరో యుగంలో వారి మరో అంశాన్ని వధించడం అన్నది మనకు అతీతమైన విషయమే.
కాని ఇందులో మరో కోణం కూడా ఉండగలదేమో. ఒక యుగంలో వారు మంచివారిగానో చెడ్డవారిగానో ఉండి మరో తదుపరి యుగంలో వారు క్రమంగా చెడ్డవారుగా మంచివారుగా చెలామణి కావడం ఏమిటి. ఏదైనా పూర్వజన్మ సత్కృత్యాలు దుష్కృతాలు వెంటాడినట్టేనా.
కాని వారి పూర్వ జన్మ ప్రారబ్ధ కర్మలు గురించి ఎక్కడా దాఖలాలు లేవేమో కదా.
వీటిపై నిశితావహాన గల పెద్దలు వారి అభిప్రాయాలను జోడించి ఈ విషయ చర్చకు వన్నె తెచ్చెదరని ఆశిస్తున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి