1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

శ్రీమాత్రేనమః

 19.8.2023 శనివారం


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*100వ నామ మంత్రము* 


*ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః*


మూలాధారము నందు జాగృతమై బయలుదేరి స్వాధిష్ఠాన సంబంధమైన బ్రహ్మగ్రంథిని భేదిస్తూ, సాధకుని బుద్ధిని ఆవహించి యున్న మాయ తొలగి, స్వస్వరూపజ్ఞాన ప్రకాశమునకు సంకేతముగా విరాజిల్లు కుండడలినీ శక్తి స్వరూపిణియైన పరాశక్తికి నమస్కారము.


 శ్రీలలితా సహస్ర నామావళి యందలి *బ్రహ్మగ్రంథి విభేదినీ* అను  (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః* అని ఉచ్చరిస్తూ ఆ పరాశక్తిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు ఉపాసకునికి ఆ తల్లి ఆత్మజ్ఞానానుభూతిని కలుగజేసి తరింపజేయును.


గ్రంథి అంటే ముడి.మూలాధారాది షట్చక్రములలో మూడు చక్రములందు ఆద్యంతములలో రెండేసి చొప్పున గ్రంథులు ఉండును. ఈ బ్రహ్మగ్రంథులు స్వాధిష్ఠాన చక్రమందుండును. అనగా మూలాధార స్వాధిష్థాన చక్రములు రెండింటికి పైన ఒక గ్రంథియు, స్వాధిష్ఠానచక్రమునకు క్రింద ఒక గ్రంథియు ఉండును. ఈ రెండు గ్రంథులకును కలిపి బ్రహ్మగ్రంథి యని పేరు. రెండేసి చక్రములకు ఒక్కొక్క గ్రంథియుండును. మానవుని బుద్ధిని ఆవహించి  మాయ ఉండును. నేను, నాది, నావాళ్ళు అను మాయలో కొట్టుమిట్టాడుతూ భౌతిక సుఖములవైపు దృష్టి సారించి యుండును. ధనము సంపాదించాలి. వస్తు వాహనాలు కొనుక్కోవాలి. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అను దృష్టితప్ప వేరేమి ఎరుగని స్థితిలో ఉండును. సత్యమైనది, నిత్యమైనది పరమాత్మ ఒకటి గలదు. అక్కడ ఉండే ఆనందం ఈ భౌతికవ్యామోహములకన్నా అతీతమైనది అన్న ఆలోచన ఉండదు. సాధకుడు తన యోగశక్తితో మూలాధారమందు నిద్రాణమై, మూడున్నర చుట్టలు చుట్టుకొనియున్న కుండలినీ శక్తిని జాగృతము చేసి ఊర్ధ్వముఖముగా  నడిపిస్తే ముందుగా భేదింపబడునది బ్రహ్మగ్రంథి. ఈ బ్రహ్మగ్రంథి భేదింప బడడంతో బుద్ధిని ఆవహించి ఉన్న మాయ తొలగుతుంది. స్వస్వరూప జ్ఞానము  కలుగుతుంది.  సృష్ట్యాది సంబంధములు భేదింపబడతాయి. అన్ని ఆనందాలను మించిన బ్రహ్మానందము ఒకటి ఉందనియు, పునర్జన్మరహితమైన ముక్తి అక్కడ లభించుననియు గ్రహించుతాడు. కుండలినీ శక్తి రూపిణియైన జగన్మాత బ్రహ్మగ్రంథి భేదనము చేసి  జీవునికి బుద్ధిని ఆవహించిన మాయను తొలగించి, స్వస్వరూప జ్ఞానమును కలిగించుతుంది గనుక ఆ పరమేశ్వరి *బ్రహ్మగ్రంథి విభేదినీ* యని స్తుతింపబడుతున్నది. 


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం బ్రహ్మగ్రంథి విభేదిన్యై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: