1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

పోతన గారి మనోచిత్రణం !

 


పోతన గారి మనోచిత్రణం !


మ: తన వేంచేయు పదంబు పేర్కొనఁ డనాధ స్త్రీ జనాలాపముల్

వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?

దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం

గని చక్రాయుధుఁడేడి ? చూపుఁడని ధిక్కరించిరో దుర్జనుల్;


పోతనగారి భాగవతం--గజేంద్రమోక్షము-


శ్రీమదాంధ్రమహా భాగవతమున ప్రసిధ్ధ ఘట్టము "గజేంద్రమోక్షము" అటు కథాపరంగాను ఇటు కవితాపరంగానూ మహోన్నత స్థితికి తావలమైనది ఆకథ.గజేంద్రుని మొఱవిని ఉన్నపాటున నిరాయుధుడై భార్య చేలాంచల హస్తుడై పరువెత్తు మగని యారాటమును జూచి వెరగుపడి యతనివెనుక వినువీధిలో పరువెత్తు శ్రీమహాలక్ష్మి యొక్కచిత్తమునందలి సందేహములను పోతన కడు రమణీయముగా చిత్రిం చినాడు. అదియే పైపద్యము.


శ్రీపతి ఉన్నపాటున పరువెత్తు చున్నాడు. యిదెంత చిత్రం! యెక్కడికి వెళుతున్నాడో తెలియదు.చెప్పనైనా చెప్పడు. ఎక్కడికబ్బాఈపరుగు.? అని యించుక వితర్కించి, గతంలో వేద రక్షణకు, భక్త రక్షణకు అతడుపడిన పాట్లు స్మరణకురాగా

అనుకొను చున్నదట!(తనలో) ఈయన యెటువెళ్ళుచు న్నాడో చెప్పటంలేదు.బహుశః మరోసారి వేదాలనెవరైనా దొంగిలించుకొని పోయారేమో? ఒకసారి సోమకాసురు డెత్తుకుపోతే మత్స్యావతారమెత్తి వాడిని సంహరించి తెచ్చాడుగదూ?


లేకపోతే, అనాధయైన వనిత రక్షింపుమని యార్తనాదం చేసిందోయేమో? ద్రౌపది విషయంలో జరిగిన దదేకదా! అప్పుడూ యింతే ! అక్షక్రీడ మధ్యలోనుండగా నన్ను వదలి పరుగెత్తలేదా? లేక పోతే ,రాక్షసులేమైనా అమరావతిపై దండయాత్రచేశారో యేమో? వారికదేపనీ, వీరికిదేపనీ ,మధ్యలో నాకూ యీ తిప్పలు. లేదా!, ఈయనగారి భక్తులను పట్టుకొని

మీశ్రీహరి యెక్కడరా? చూపండి? అనిదుర్మార్గులెవరైనా భక్తులను బాధించినారో యేమో? (గతంలోహిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని అలాగే బాధించాడుగదా)


ఏంమొగుడో? ఏమీచెప్పడాయె! పోనీ అడుగుదామా?


" అడిగెదనని కడువడిఁ జను.

అడిగినదన మగుడ నుడువడని నడయుడుగున్,

వెడవెడ జిడిముడిఁ దడబడ,

నడుగిడు.నడుగిడదు. జడిమ నడుగిడు నెడలన్;


ఆహా! ఏమీపద్యము! డకార యమకమున లక్ష్మి మనస్సు లోని యూగిసలాటను ఊటాడించినాడు పోతన! అడుగుదామని రెండడుగులు తొందర తొందరగా ముందుకేస్తున్నదట. ఆఁ అడిగినా యీతొందరలో బదులుచెప్పేనా? సందేహమే? మరెందుకులేయని రెండగులు వెనక్కు వేయుచున్నదట. దారిపొడుగునా యిదే పని. ముందుకూ వెనక్కూ లక్ష్మియూగిసలాట!పై పద్యము చదివినచో హృదయసంబంధమైన 

వ్యాధులు రావని పెద్దలు చెబుతారు.

చూచితిరా! పోతన రచనాశిల్పము! అది యనల్పము. అదిపరమేశ్వర కటాక్షము. శారదాదేవి యనుగ్రహము. అదియే అతనికవితలోని జీవము. సాహిత్య పిపాసులకందజేయు కవితామృత రసాయనం !భాగవతం చదవండి! బాగుపడండి!

జయహో! పోతన కవీంద్రా! జయతు ! జయతు!

--       ...

                 స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: