బలిచక్రవర్తి కథ
బలి గొప్పరాక్షస చక్రవర్తి, యోద్ధ ఘనుడు, దానఘనుడు, మానఘనుడు. . . శ్రీమన్నారాయణుడు ఇతని గురించి వామనావతారం ఎత్తి, అథోలోక చక్రవర్తిగ జేసాడు. అజ్ఞానం తొలగించాడు అతనిని అణిచేయ లేదు, అంతటి గొప్పవాడు బలిదైత్యేంద్రుడు. నీ మూడోపాదం నా తలపై పెట్టు అన్నా, అలా చేసినట్లు మన పోతన్నగారు చెప్పలేదు, ప్రహ్లాదుని పౌత్రుడు బలి. మిక్కిలి బలశాలి. గొప్ప యుద్దకళానిపుణుడు, యుద్ధనీతిజ్ఞుడు. తన విశేష బలంతో ఇంద్రుని మీదకి వెళ్ళిన వాడు. ఇంద్రపదవికోసం వందయజ్ఞాలు చేయాలి అంటారు. అంటే బలాలతో సాధించేది కాదు సాధనతో సాధించేది స్వర్గలోకం అనుకోవచ్చు. ఇంద్రుడు ఇంద్రియాలకు మనసుకు అధిపతి మరి. స్వర్గ ప్రవేశానికి సామాన్యంగా పుణ్యబలం కావాలి. అక్కడి సౌఖ్యాలు అనుభవించంటం ద్వారా కూడబెట్టిన పుణ్యం వ్యయంకాగానే మళ్ళా మర్త్యలోకం రావాలి. ఇకపోతే, ప్రహ్లాదుడు అంటే విశేషమైన ఆనందం కలవాడు లేదా చిదానందుడు. అలా ఆత్మానందం అందుకో గలిగిన వానికి విశేషమైన శక్తిసామర్థ్యాలు అలవడతాయి. వీటిలో భౌతికమైన శక్తికి తగులం పడితే, ఎవరినైనా జయించ గల శక్తి పొందచ్చు. అహంకారం విజృంభిస్తుంది. అది రాక్షసగుణ ప్రధానానికి దారితీస్తుంది.
ఇప్పుడు మళ్ళా కథలోకి వెళ్దాం. ప్రహ్లాదుని పౌత్రుడు బలి. ఇంద్రునికి ఓడిన వాడు. శుక్రాచార్యుడు వీరి గురువు. వీరి అండతో విపరీతమైన సైనిక, దైహిక బలాలు వీర్యం పొందాడు. ఆ బలాల సాయంతో స్వర్గంమీదకి యుద్దానికి వెళ్లాడు. అక్కడ అధిపతి ఇంద్రుడు కదా ఆలోచనాపరుడు కదా. గురువు బృహస్పతిని చేరాడు. ఆయన విప్రబలమున వీనికి వృద్ధివచ్చె వారిఁ గైకొన కిటమీఁద వాఁడి చెడును; అని మంత్రోపదేశం చేసాడు. విప్రబలం అంటే దైవారాధన, యోగసాధ నాదులచే లభించే దైవబలం. దీనికి గురువులను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. దాంతో ఇంద్రుడు సపరివారంగా పక్కకి తప్పుకున్నాడు. బుద్ది పక్కకి తప్పుకుంది. త్రి లోకాధిపతి అయ్యాడు.
దానితో మహా సాధకుడే, మహాపుణ్యాత్ముడే, దానాది సుగుణాలలో సాటిలేని వాడే కాని, బుద్ధిచెప్తుండే గురువులు చెప్పేమాట పెడచెవిని పెట్టడం మొదలైంది. మరి ఈయన అతికాయుడు, అతికార్యుడు కదా. దానికి విరుగుడుకి సూచనగా బడుగు వడుగు వలె కన్పట్టు వామనుడై దిగి వచ్చాడు. ఒకామె కశ్యపుని భార్య అదితి (జీవాత్మ ధారి) పయోభక్షణ వ్రతం చేపట్టింది. పయస్ అంటే నారములు కదా వాటిని భక్షించటం అంటే జీర్ణచేసుకోడం. అలా జ్ఞానగ్రహణం ఫాల్గుణ మాసం శుక్లపక్షం పాడ్యమినుంచి పన్నెండురోజులు చేసింది. సంతోషించిన నారాయణుడు, విశ్వ వ్యాపకుడయ్యు పుత్రుడిగా విశ్వగర్భుడు ఆమె గర్భంలోకి దిగివచ్చాడు. సమయం ఆసన్నంకాగా దిగి వచ్చాడు కపట వటునిగా ఉపనయన వయస్కుడిగ వామనుడై.
అదే అంటారు కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని. రూపంలో వామనుడైన విష్ణుమూర్తి చిరుకోరికగానే అడిగాడు. నేను అతికాయుణ్ణి, అతికార్యుణ్ణి, నన్ను ఇంత స్వల్పకాయుడవు ఇంత స్వల్పం అడుగుతావా అంటున్నాడు అతివీరుడు. తెలియకా కాదు ఇద్దరికి తెలుసు. నిరయంబైన . . అని భౌతిక న్యాయం ఒకటే సరిపోతుందా. అదిగో అధోలోక యాత్రకి శ్రీకారం చుట్టుకున్నాడు. కాని కాలం వచ్చింది మంచి చెప్పే ఆచార్యుని మాట పెడచెవిని పెట్టాడు. విధినిర్ణయం వక్రీకరించడం సాధ్యమా. ఈయన ధర్మోరక్షతి రక్షితః తెలిసి వారిజాక్షులందు . . అనడమే కాదు. విప్రుడై ఉండి విపరీతపోకడకు పోయాడు శుక్రుడు కన్నుపోగొట్టుకున్నాడు. కమలనాభు. . విప్రాయ . . అంటూ దానం చేసాడు. గురుశిష్యులు
ఇద్దరు మహానుభావులే. (గురువు చెప్పింది అనుల్లంఘనీయ ఆజ్ఞ ధర్మాధర్మాల ప్రసక్తి లేదు, ఫలితంతో పనిలేదు). రాక్షస అంటే రజస్తమోగుణాల ప్రకోపం వల్ల అలా వర్తించారేమో. అవును వచ్చినవాడు విశ్వ వ్యాపనశీలుడు విష్ణువు కదా అందుకే త్రివిక్రమరూప దర్శనం ఇచ్చాడు. ఇంతింతై. . , రవిబింబం . . అంటుమొదలెట్టి పద్యాలంటే లాభంలేదు అని పెద్ద వచనం వేసారు మన పోతన్నగారు. ఇది ఒక అనుగ్రహం. ఇప్పుడు చెప్పు నువ్వు నాకివ్వగల స్థలమేదో అన్నాడు. అజ్ఞానపొరలు వీడిన బలి నీ యెడ దుర్లభ మేమి కలదు అంటుంటే. బలిచక్రవర్తి భార్య వింధ్యావళి కా దనఁడు. . అంటు అడిగింది స్త్రీమూర్తి కదా. జీవాత్మ పరమాత్మల ద్వైతం రెంటికి మధ్యది వింధావళి కొండల వరస కదా.
నీవు అర్హుడవే కాని నీ ఇంద్రపదవికి సమయం రాలేదు సావర్ణి మన్వంతరంలో నేనే పిలిచి ఇస్తాను. అంతవరకు సుతలమున సపరివారంగా సుఖంగా ఉండు అని అనుగ్రహించాడు. అధోలోకమే కాని అది సుతలాలయమున. అంతటి రాక్షసునికి సర్వరక్షకుడు చక్రి చక్రరక్షణ సమకూర్చాడు. ఎందుకంటే మనసు పరిపరివిధాల పరిగెట్టేది కనుక. ఈ ఘట్టంలో పద్యాలు సాహిత్యపరంగా కూడ అమృతగుళికలు, భక్తిమార్గంగా హృదయంగమములు, జ్ఞానసాగరములు.
బలి బలం
8-456-సీస పద్యము
వినవయ్య దేవేంద్ర వీనికి సంపద;
బ్రహ్మవాదులు భృగుప్రవరు లర్థి
నిచ్చిరి; రాక్షసు నెదురను నిలువంగ;
హరి యీశ్వరుఁడు దక్క నన్యజనులు
నీవును నీ సముల్ నీకంటె నధికులుఁ;
జాలరు; రాజ్యంబు చాలు; నీకు
విడిచి పోవుట నీతి విబుధనివాసంబు;
విమతులు నలఁగెడువేళ చూచి
తేటగీతి
మరలి మఱునాఁడు వచ్చుట మా మతంబు;
*విప్రబలమున వీనికి వృద్ధివచ్చె
వారిఁ గైకొన కిటమీఁద వాఁడి చెడును
;దలఁగు మందాక రిపుఁ బేరు దలఁపరాదు.
8-526-కంద పద్యము
హరిహరి; సిరి యురమునఁ గలహరి
హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్.
నర్మదనదిని దాటాడు వామనుడు
8-529-కంద పద్యము
శర్మద, యమదండక్షత
వర్మద, నతి కఠిన ముక్తి వనితాచేతో
మర్మద, నంబునివారిత
దుర్మద, నర్మదఁ దరించెఁ ద్రోవన్ వటుఁడున్.
వామనుని నడక
8-541-కంద పద్యమువెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్.
వామనుడు బలిని ఆశీర్వదించుట
8-545-ఉత్పలమాల
స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ద్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.
బలి నీవెవరు నీకేంకావాలి అడుగుతున్నాడు
8-549-మత్తేభ విక్రీడితము
వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మముం;
గడు ధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
గడతేఱన్; సుహుతంబులయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.
8-550-మత్తేభ విక్రీడితము
వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా!
మూడడుగులు చాలులే అంటున్నాడు
8-566-ఆటవెలది
ఒంటివాఁడ నాకుఁ నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర!
ఇంత స్వల్పమా అడగటం ఇలాంటివి అడగాలి అంటున్నాడు బలి
8-570-మత్తేభ విక్రీడితము
వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వెసనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
పసి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గాక
సురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే?
మూడడుగులు చాలు అదే నాకు బ్రహ్మాండం అంటున్నాడు వామనుడు
8-572-మత్తేభ విక్రీడితము
గొడుగో, జన్నిదమో, కమండలువొ, నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.
8-575-శార్దూల విక్రీడితము
ఆశాపాశము దాఁ గడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాశిం బొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా
మాశం బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.
శుక్రనీతి
8-585-ఆటవెలది
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!
శుక్రుని మాట కాదనటం
8-590-శార్దూల విక్రీడితము
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరిమూటఁ గట్టుకొని పోవం జాలిరే? భూమిపైఁ
బేరైనం గలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్? భార్గవా!
8-592-శార్దూల విక్రీడితము
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనవుపై, నంసోత్తరీయంబుపై,
బాదాబ్జంబులపైఁ, గపోలతటిపై, బాలిండ్లపై నూత్నమ
ర్యాదం జెందు కరంబు గ్రిం దగుట మీఁదై నా కరంబుంట మేల్
గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే?
ఏమైనా నే అసత్యం పలకను అనటం
8-593-మత్తేభ విక్రీడితము
నిరయంబైన, నిబంధమైన, ధరణీ నిర్మూలనంబైన, దు
ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో;
హరుఁడైనన్, హరియైన, నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ;
దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా; ధీవర్య! వే యేటికిన్?
దానమియ్యటం
8-607-శార్దూల విక్రీడితము
విప్రాయప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే
దప్రామాణ్యవిదే త్రిపాద ధరణిం దాస్యామి! యంచుం గ్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జే సాఁచి పూజించి బ్ర
హ్మప్రీతమ్మని ధారపోసె భువనం బాశ్చర్యముం బొందగన్.
8-613-ఆటవెలది
కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు
నెఱిఁగి శుక్రు మాట లెఱిగి నాశ
మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి
మహి వదాన్యుఁ డొరుఁడు మఱియుఁ గలఁడె.
8-619-ఆటవెలది
పుట్టి నేర్చుకొనెనొ పుట్టక నేర్చెనో
చిట్టి బుద్ధు లిట్టి పొట్టివడుగు
పొట్ట నున్న వెల్ల బూమెలు నని నవ్వి
యెలమి ధరణి దాన మిచ్చె నపుడు.
త్రివిక్రమావతారం
8-622-శార్దూల విక్రీడితము
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
8-623-మత్తేభ విక్రీడితము
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.
అసత్యం పలకలేను అనటం
8-643-ఆటవెలది
సూనృతంబుఁ గాని నుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు జేసి పెట్టు నిర్మలాత్మ!
వింధ్యావళి ప్రశ్నంబు
8-657-కంద పద్యము
కా దనఁడు పొమ్ము లే దీ
రా దనఁడు జగత్త్ర యైక రాజ్యము నిచ్చెన్
నా దయితుఁ గట్టనేటికి?
శ్రీదయితాచిత్తచోర! శ్రితమందారా!
బలిని అనుగ్రహించుట
8-664-కంద పద్యము
సావర్ణి మనువు వేళను
దేవేంద్రుండగు నితండు దేవతలకు; దు
ర్భావిత మగు నా చోటికి
రావించెద; నంతమీఁద రక్షింతు దయన్.
8-665-కంద పద్యము
వ్యాధులుఁ దప్పులు నొప్పులు
బాధలుఁ జెడి విశ్వకర్మభావిత దనుజా
రాధిత సుతలాలయమున
నేధిత విభవమున నుండు నితఁ డందాకన్."
గమనిక
తెలుగుభాగవతం.ఆర్గ్ © [www.teluguBhagavatam.org] జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. ఇది ఎట్టి కాపీరైటు అతిక్రమణలు అంగీకరించదు, ప్రోత్సహించదు. అంతర్జాలంలోని కొన్ని బొమ్మలు, చిత్రాలు కాపీరైటు అభ్యంతరాలు లేనివి అన్న సదభిప్రాయంతో ఈ జాలికలో వాడుకొనటం జరిగింది. కాపీ రైటు అతిక్రమణలు ఏవైనా అనుకోకుండా జేరిపోతే, మా దృష్టిలోకి తీసుకు రండి. వాటిని తొలగిస్తాం.
Note
www.telugubhagavatam.org © site is run on non-profit oriented principles and it won’t infringe any copy rights nor it encourages any such activities. Some pictures, photos from internet were used with good intention that they are not having any copy right restrictions. If any copy right infringements crept up inadvertently, please bring to our notice. They will be deleted.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి