🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *100వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*శుక్రగ్రహ చరిత్ర - 12*
దేవయాని కచుడి వైపు చిరునవ్వుతో చూసింది. *"రెండవ సారి పునరుజ్జీవితుడయ్యాక నీలో వర్చస్సు పెరిగింది, తెలుసా ?”* అంది నవ్వుతూ.
*" అంతా నీ చలువే ! గురుదేవులు చెప్పారు. నేను సజీవంగా వచ్చేదాకా అన్నపానాలు ముట్టనని శపథం చేశావట ! నీ రుణం తీర్చుకోలేను , దేవయానీ...”* కచుడు గద్గదికంగా అన్నాడు.
దేవయాని పైట దులిపి , మళ్ళీ వేసుకుంటూ చిన్నగా నవ్వింది. *“రుణం తీర్చుకోవాలని నీకు ఉంటే , తీర్చుకోగలవు ! దానికి మార్గం నేను చూపిస్తాను !”* అంది.
కచుడు తల అడ్డంగా ఊపాడు. *“ఏమి చేసినా , ఎంత చేసినా - నీ రుణం తీర్చుకోవడం అసాధ్యం , దేవయానీ ! ప్రాణానికి ప్రాణం అంటూ నా ప్రాణం ఇచ్చినా నీ రుణం తీరదు. ఎందుకంటే నువ్వు రెండుసార్లు నాకు ప్రాణదానం చేశావు. నేను ఒక్కసారి మాత్రమే నా ప్రాణం ఇవ్వగలను !"*
*"ప్రాణం వద్దు , ప్రేమ ఇస్తే చాలు !"* దేవయాని అతని కళ్ళల్లోకి చూస్తూ అంది.
*"నీ పట్ల నాకు ప్రేమాభిమానాలున్నాయని నీకు తెలుసు , దేవయానీ !"*
*"తెలుసు. అందుకే నా రుణం తీర్చుకునే ఉపాయం చెప్తున్నాను. నన్ను... పెళ్ళి. చేసుకో !"* దేవయాని , రెప్పలు వాల్చి సిగ్గుపడింది.
*"దేవయానీ !"* కచుడి పలుకులో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. *“నీకు... మతి భ్రమించిందా ?”*
*"ఔను ! భ్రమించింది ! నిన్ను మొదటిసారి చూసిన క్షణంలోనే నా మతి నీ చుట్టూ భ్రమించింది. ఆ క్షణం నుంచి అలా భ్రమిస్తూనే ఉంది , నీ చుట్టూ ! ఏమిటి అలా మిడిగుడ్లు వేసుకు చూస్తున్నావు , కచా ? మనిద్దరికీ మన్మథుడు ఆ నాడే పెళ్ళి చేసేశాడు ! ఇక జరగాల్సిన వివాహం సూత్రప్రాయమే !"*
*"దేవయానీ...”*
*"నిన్ను చూశాను ! నీ కోసం కలలు కన్నాను ! నా కలల్లోకి నిన్ను ఆహ్వానించాను !మానసికంగా నన్నూ , నా తనువునూ నీకు ఆ నాడే అర్పించాను...”.*
*"దేవయానీ ! నీ ఆలోచన , ఆశ , అభ్యర్థన , అన్నీ దురదృష్టకరమైనవి !"*
*"కచా !"*
*"గురుపుత్రిక శిష్యుడికి ఏమవుతుందో నీకు తెలుసా ?”* కచుడు తీక్షణంగా చూస్తూ) అన్నాడు.
దేవయాని అతని చూపుల్ని ఎదుర్కొంది. *"తెలియదు !”*
*"ఒక వ్యక్తికి గురువూ , ప్రాణదాతా ఏమవుతాడో తెలుసా ?"*
*“తెలియదు...”*
*"హు ! తెలుసు ! నీకు తెలుసని నాకు తెలుసు ! గురుపుత్రి శిష్యుడికి సోదరి అవుతుందని నీకు తెలుసు ! గురువూ , ప్రాణదాతా అయిన వ్యక్తి తండ్రి సమానుడనీ నీకు తెలుసు !”*
దేవయాని రెప్పలు వేయకుండా , తీక్షణంగా కచుడి ముఖంలోకే చూస్తూ ఉండిపోయింది.
*"గురుపుత్రి అయిన నువ్వు నాకు సోదరివి ! మీ తండ్రి గారికి పుత్ర సమానుడైన నేను నీకు సోదరుణ్ణి ! అర్థం చేసుకుని , అక్రమమూ , అసంగతమూ అయిన నీ ఆశను చంపుకో !"* కచుడు ఉద్వేగంతో అన్నాడు.
*"ఇప్పుడు నాకు బోధపడుతోంది , కచా ! మృతసంజీవని కోసం నన్ను ప్రేమిస్తున్నట్టు నటించావు ! నేనంటే ప్రేమ ఉందనీ , ఆప్యాయత ఉందనీ అందుకే అన్నావు !"* దేవయాని నిష్ఠురంగా అంది.
*"ఇప్పుడూ అంటాను. నీ పట్ల ప్రేమ ఉంది ! ఆప్యాయత ఉంది ! ఏది ఉందో అది ఉందన్నాను నీతో ! నువ్వంటే నాలో ప్రేమా , ఆప్యాయతా ఉన్నాయి గానీ , ప్రణయమూ , అనురాగమూ లేవు ! ప్రేమను ప్రణయంగా , ఆప్యాయతను అనురాగంగా అపార్ధం చేసుకున్న అపరాధం నీది నాది కాదు ! నీ అభిమానానికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సోదరీ ! గురుదేవులు అనుమతిచ్చారు. నేను స్వస్థలానికి వెళ్తున్నాను !"* చెప్పడం ముగించి , కచుడు వెనుదిరిగాడు.
*"అ !"* దేవయాని గర్జన అతన్ని ఆపింది.
కచుడు ఆమె వైపు తిరిగి చూశాడు. దేవయాని కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. జేవురించిన ముఖంలో ఎర్రటి పెదవులు అదురుతున్నాయి. ఆగ్రహం , ఆవేశం ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా మారి సమున్నతమైన ఆమె వక్షభాగాన్ని ఎత్తుకి ఎగసి పడే అలలా చేశాయి.
*“నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది ! నువ్వు మృతసంజీవని కోసం వచ్చావు ! అసుర శిష్యుల ఆవేశం నీకు అదృష్టంగా మారింది ! నిన్ను బ్రతికించుకోవాలన్న నా వాంఛ నీకు మహా భాగ్యంగా మారింది ! నువ్వు స్వార్థపరుడివి ! ఏ మంత్ర ప్రభావంతో నువ్వు రెండుసార్లు ప్రాణం పోసుకున్నావో , ఏ మంత్రాన్ని నా తండ్రి అమాయకంగా నీకు ఉపదేశించాడో , ఆ మంత్రం . ఆ మృతసంజీవనీ మంత్రం నీకు పని చేయదు ! ఆ మంత్రం నీకు ఫలితాన్ని ఇవ్వదు ! ఇది శుక్ర పుత్రిక దేవయాని శాపం !"* ఆగ్రహంతో దహించుకు పోతున్న దేవయాని బిగ్గరగా అరుస్తూ శపించింది.
దేవయాని ఆగ్రహం , శాపం కచుడికి చిరునవ్వు తెప్పించాయి. *"నేను ధర్మం తప్పని వాణ్ణి. గురుదేవులను మోసపుచ్చి నేను మృతసంజీవనీ విద్యను తెలుసుకోలేదు. ఆయన స్వయంగా ఉపదేశిస్తేగానీ ఆ విద్యను నేర్చుకునే అవకాశం లేదు. నీ శాప ప్రభావంతో ఆ మంత్రం నా మీద పనిచేయదు !”*
*“తుచ్ఛుడా ! నీ ముఖం నాకు చూపించకు ! వెళ్ళు ! వెళ్ళిపో !"* దేవయాని హూంకరించింది.
*"వెళ్తాను ! శాపానికి ప్రతి శాపం ఇచ్చి , రుణం తీర్చుకుంటాను ! ధర్మహాని కలిగే కామంతో ప్రవర్తించిన నీకు నీ కులస్థుడితో వివాహం జరగదు ! ఇది బృహస్పతి పుత్రుడైన కచుడి శాపం !”* కచుడు తీక్షణంగా చూస్తూ శపించి , వెనుదిరిగి ద్వారం వైపు నడిచాడు.
కచుడు తిన్నగా శుక్రుడి వద్దకు వెళ్ళాడు. చిరునవ్వు కనిపించని ప్రియ శిష్యుడి వైపు శుక్రుడు ఆశ్చర్యంగా చూశాడు.
*“గురుదేవా ! గురుపుత్రి శిష్యుడికి ఏమవుతుంది ?"* కచుడు ఉన్నట్టుండి అడిగాడు.
*"ఏమవుతుంది, నాయనా ! సోదరి !"* శుక్రుడు చిరునవ్వు నవ్వాడు.
*"దేవయానిని మొదటి నుండీ నేను సోదరిగానే చూశాను. అందుకే ఆమెతో వివాహాన్ని తిరస్కరించాను...”*
*“నీది ధర్మవర్తన ! వెళ్ళిరా , నాయనా !"* శుక్రుడు చెయ్యెత్తి దీవించాడు.
*"ఇవి , నాయనా , శుక్రుడి చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు !"* కథనం ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద.
*"గురువుగారూ ! శుక్రుడు యయాతిని శపించిన ఘట్టం వదిలేశారే !"* సదానందుడు గుర్తు చేశాడు.
*"మరిచిపోయి ఉంటారు... గురువు గారు !"* చిదానందుడు అన్నాడు.
నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *“మరిచిపోలేదు , చిదానందా ! అది శుక్రుడి కథలో అంశం కాదు, యయాతి కథలో అంశం ! ఏం జరిగిందంటే , వృషపర్వుడి కూతురు శర్మిష్ఠ , ఒకసారి దేవయానిని అరణ్యంలోని పాడుబావిలోకి తోసి వేసి వెళ్ళిపోయింది. యయాతి ఆమెను రక్షించాడు. తండ్రి ప్రమేయంతో దేవయాని శర్మిష్ఠను దాసిగా చేసుకుంది. యయాతిని వివాహం చేసుకుంది. అందగత్తె అయిన శర్మిష్ఠను రహస్యంగా , భార్యగా ఆదరించాడు యయాతి. అందుకు ఆగ్రహించిన శుక్రుడు యయాతి వృద్ధుడైపోయేలా శపించాడు...".*
*"శుక్రాచార్యుడు ఒంటికంటి వాడయ్యే కథాంశం , గురువుగారూ ?”* శివానందుడు అన్నాడు.
*“ఆ కథాంశం కూడా ఉంది. అది నవగ్రహ మహిమల క్రమంలో చక్కగా చెప్పుకోవచ్చు ! ఇప్పుడు నవగ్రహాలలో ఏడవవాడైన శనైశ్చరుడి చరిత్ర చెప్పుకుందాం !”* నిర్వికల్పానంద అన్నాడు. శిష్యులు ఉత్సాహంగా చూశారు.
*“ఇతర గ్రహదేవతల చరిత్ర కన్నా , శనిచరిత్ర గొప్పగా ఉంటుందనుకుంటాం , గురువుగారూ !"* సదానందుడు అన్నాడు.
*"పురాణాల మూలంగా మనకు తెలుస్తున్న శనైశ్చరుడి చరిత్ర చాలా , చాలా స్వల్పమే నాయనా ! ఆయన బ్రహ్మను సేవించాడనీ , శివుడు ఆయనకు ఇష్టదైవమనీ , అంతేకాకుండా ఏక కాలంలో త్రిమూర్తులను ప్రసన్నం చేసుకున్నాడనీ - తరతరాలుగా పెద్దల నోళ్ళలో నానుతున్న విషయాలున్నాయి. అవేవీ శనైశ్చరుడి వ్యక్తిత్వానికి గానీ , ఆయన తత్వానికి గానీ , గుణగణాలకు గానీ , ఆయన కారకశక్తులకు గానీ విఘాతం కలిగించేవి కావు ! యుగయుగాలుగా , తరతరాలుగా కర్ణపరంపరగా వస్తున్న ఆ విశేషాలను ఆ ప్రాతిపదికమీదే మనం మననం చేసుకోవడం తప్పుకాదు ! కాబట్టి శాస్త్రాధారాల కోసం చూడకుండా ఆయా అంశాలు కలగలుపుకుంటూ శనిచరిత్ర విందాం !"* నిర్వికల్పానంద అగి సరేనా అన్నట్టు చూశాడు.
*"గురువుగారూ ! అవి కల్పనలు కదా ! వాటిని స్వీకరించవచ్చా ?"* విమలానందుడు సందేహం వెలిబుచ్చాడు.
నిర్వికల్పానంద చిరునవ్వు నవ్వాడు. *"తార్కికంగా ఆలోచిస్తే కఠిన సత్యం లేకుండా కల్పన రాదు ! నువ్వు విన్నదో , కన్నదో , చదివినదో , ఎలాగైతేనేం - నీ పంచేంద్రియాలు అనుభవంలోకి వచ్చిన దానిని తప్పించి మరొక దానిని ఊహించలేవు కదా ! కఠిన సత్య కల్పనకు మాతృక ! కర్ణపరంపరగా అలా మనకు అందజేయబడిన అంశాలనే 'పుక్కిటి పురాణాలు' అంటారు ! వాటిలో కల్పన తప్పకుండా ఉంటుంది ! ఆ కల్పనకు పునాదిగా సత్యం ఉండి తీరుతుంది !"*
*"బాగుంది , గురువుగారూ ! ఇక శని చరిత్ర విందాం !"* చిదానందుడు వినయంగా అన్నాడు.
*"అలాగే ! వినండి ! ఛాయ సంతానమైన శనీ , సావర్ణి , తపతీ ముగ్గురూ సంజ్ఞ పెంపకంలో పెరుగుతున్నారని మనం చెప్పుకున్నాం కద ! తపస్సు చేయడానికి వెళ్ళిన సంజ్ఞా పుత్రుడు యముడు తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. అతని ముఖంలో ఏదో కొత్త తేజస్సు నర్తనం చేస్తోంది...”* నిర్వికల్పానంద ప్రారంభించాడు.
*శనిగ్రహ చరిత్ర ప్రారంభం*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి