8, డిసెంబర్ 2023, శుక్రవారం

ఆలోచనాలోచనాలు

 *** ఆలోచనాలోచనాలు *** అక్షరరూపం దాల్చిన ఒక సిరాచుక్క; లక్ష మెదళ్ళకు కదలిక *** అవధాన మధురిమలు ***  శతావధాని శ్రీ కాకర్ల కొండల రావు*** సమస్యాపూరణములు***    1* "" మరణముఁ గోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో""                      ఉ. సరసుడ వంచు సూనశరాస్త్రవరిష్టుడవంచు పండితా/ భరణుఁడ వంచు సన్మధుర వాక్చతురత్వయుతుండవంచు భా/ సుర నవయౌవన స్ఫురిత సుందరగాత్రుడవంచెఱింగి కా/మ రణముఁగోర వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో!                       2* "" తల చేతులలోనయుండు దలప జగంబుల్.""                       కం. కలస్థావర జంగమ జం/ తులఁబుట్టింపగఁ బెంప ద్రుంపంగ సమ/ ర్థులగుట ముగురమ్మల నే/ తల చేతులలోన నుండుఁదలప జగంబుల్.     3* "" పాలను దునియలుగ జేసె బటు భల్లమునన్.""       కం. చాలగద్రావి యొకండమి/ త్రాళి వధింపగ నేగి యా సదనముల/ న్వ్రేలెడు ఛాయపటరూ/ పాలను దునియలుగ జేసె బటు భల్లమునన్.                         4*"" కాయలు పండ్లుగావు మరి గాయలుగావల పండ్లు కోమలీ.""                   ఉ. ఆయతదాన వాల్యాయ మృగాంగుడనే నల రావణుండ రం/ భా యెద నిన్నె కోరితిని వంచన సేయగ నెంచబోకు మ/ మ్మాయలమారి నూర్వశిని మానసమందున నొల్లసుంతయుం/ గాయలు పండ్లుగావు మరిగాయలుగా వలపండ్లు కోమలీ!                                 5*"" తల్లిని జూచి కౌగిటికి దార్చి రమింపగ జొచ్చె నయ్యెడన్.""                        ఉ. పల్లవ పత్ర పుష్ప ఫలభాసురమైన వసంతవేళ రా/ నుల్లములోని మోహభర నేరక పాండురాజు వి/ ద్యుల్లతవోలె కట్టెదుట నొప్పెసలారెడు ధర్మపుత్రు మా/ ర్తల్లని జూచి కౌగిటికి దార్చిరమింపగ జొచ్చె నయ్యెడన్.                            6* ""భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమంబుగా నయ్యెడన్.""     శా. శ్లేష్మంబందునపడ్డ మక్షికమటుల్ చిత్తంబు చొక్కొండగా/ నూష్మశ్రేణిని వుడ్చికొంచు రిపు వీరోత్తంసముల్ చేడ్పడన్/ గ్రీష్మాదిత్యుని భంగి మంటలొలయం గ్రీడించు నక్క్రీడితో/ భీష్మద్రోణుల కావహంబు జరిగెన్ భీమంబుగా నయ్యెడన్.         దత్తపదులు;---                     1*" ముండ -- దండ -- పండ -- బండ -- నిండ -- కుండ -- కొండ"" పదములతో "" రామాయణార్థములో "" పద్యం .                              చం. పొలుపుగ వచ్చి శూర్పణఖ ముండ రఘూద్వహు దండ పండగా/ గులుకుచు బండ మాటలను కోరిక నిండగ బల్కి డెంద మం/ దొలసిన కూర్మి జంకు గొనకుండ సమీపము జేరరాఘవుం/ డులుకున లేచి పల్కకుమికొండని యవ్వల ద్రోసె దానినిన్.                       2* ""కర్పూరము -- దేవానాంప్రియులు -- పరమార్థచింత -- కవీశాగ్రణి"" పదములతో "" శ్రీ విష్ణు పూజ"" పై పద్యం.      మ. బరువౌ పాపము వాపుకోదలచు దేవానాంప్రియుల్ భక్తిమై/ వర కర్పూరము ధూపవస్తువులు పుష్పశ్రేణులుం గూర్చి దు/ ష్కర వృత్తిం బరమాత్మచింత నెపుడుం గంజాక్షునిం గొల్చుచో/ దెఱలుం బాపము, ముక్తియుంగలుగు నెందేనిం గవీశాగ్రణీ!               ( డా. రాపాక ఏకాంబరాచార్యులవారి అవధాన విద్యా సర్వస్వం సౌజన్యంతో)                         "" ఆనో భద్రాః, క్రతవోయంతు విశ్వతః!"" మనకు అన్ని వైపులనుండి ఉదాత్త భావములు లభించుచుండును గాక!           ( Let noble thoughts come from every side.)  తేది 6--12--2023, బుధవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: