8, డిసెంబర్ 2023, శుక్రవారం

కార్తిక పురాణము - 26*

 *కార్తిక పురాణము - 26*

🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

*కార్తిక పురాణము - ఇరవై ఆరవ అధ్యాయము*


దుర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరి నిలయమైన వైకుంఠమునకు చేరి ఇట్లు ప్రార్థించెను.


జగన్నాథా! బ్రాహ్మణ ప్రియా! మధుసూదనా! సుదర్శన చక్ర సంభవమైన మంటలు నాపైన పడకుండా రక్షించుము. ఓ విష్ణో! సూర్య కోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపుటకు వచ్చుచున్నది. స్వామీ

నివారించుము.


నీ భక్తుడైన అంబరీషునకు శాపమిచ్చిన పాతకునకు నాకు ఈ శిక్ష తగియే ఉన్నది. వేలకొలదీ బ్రాహ్మణులలో నేను బహు పాతకుడను.నన్ను రక్షించుము. హరీ! నీ వక్షస్థలమందు బ్రాహ్మణుని పదము ఉండలేదా? భృగుమహర్షి హరిని పాదముతో వక్ష స్థలమందు తన్నెను గదా!కాబట్టి అట్లే నా పాతకము కూడా నీవు సహించవలెను.ఈ ప్రకారము విష్ణుమూర్తి ముందు దుర్వాస మహాముని సాష్టాంగ నమస్కారము చేసినవాడై ఓ స్వామీ! నను రక్షించుమని అనేక మారులు దుర్వాసుడు పలికినవాడాయెను.


అంత హరి నవ్వుచు ఇట్లనియెను. దుర్వాసా! బ్రాహ్మణులు నాకు దేవతలు అను మాట నిజమే. మీవంటి వారు మిక్కిలి దేవతలేయగుదురు.బ్రాహ్మణోత్తమా! నీవు సాక్షాత్ శంకరుడవు. బ్రహ్మ స్వరూపుడవు. జటలతో గూడి భృకుటికుటిలమైన నీ ముఖమును జూచినచో ఎవ్వరికి భయము గలుగదు? మీవంటి వారు స్వభావమునకు వికారమును గలుగనివ్వరు గదా!నేను మనో వాక్కాయముల చేత బ్రాహ్మణులకు అపకారము కొంచెమైనను చేయను.ఆ సంగతి నీకు తెలిసియేయున్నది గదా! దేవతలకు, బ్రాహ్మణులకు, సాధువులకు, గోవులకు సుఖము కొరకు ప్రతియుగమందు నేనవతరించుచుందును.


దుర్వాసా! నీవు సాధు నిందితమైన కర్మను ఆచరించితివి.అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చితిని. అంబరీషుడు మనోవాక్కాయములచేత శత్రువునకును అపకారమును చేయడు. సర్వభూతములయందును నన్ను బావించుచు చరాచరమూలందంతటను నన్ను చూచుచుండును.అట్టి వానిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టితివి. ఇది నీకు తగునా? నీవు భోజనమునకు వచ్చెదనని చెప్పి పోయి సకాలమునకు రాలేదు.నీకు అనుష్ఠానమున్నచో చేసుకొనవచ్చును.కానీ అట్టి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞయు ఇవ్వలేదు. కేవలము జలమును బుచ్చుకొని ద్వాదశీ పారణ ముఖ్య కాలమునకు చేసెను. ఉదక పానమందేమి దోషమున్నది?ఉపవాస కాలమును నీరు త్రాగుట దోషము కానేరదు.


బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదక పానము విహితమై యుండగా దాహ శాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషము జరిగినది? నీకేదీ సందు దొరకక దానినొక తప్పుగా చేసుకొని శాపమిచ్చితివి గానీ విచారించిన అది దోషము అగునా!అప్పటికీ నిన్ను అనేక విధములుగా ప్రార్థించినా నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీవలన భయము పొంది తన హృదయాంతర్వాసియైన స్వయం ప్రభువైన నన్ను శరణు వేడెను.


అంతలో నీవు శాపమిచ్చితివి.బ్రాహ్మణుని మాట అసత్యమై పోవునను తలంపుతో రాజు హృదయమందున్న నేను ఈ పది జన్మల శాపమును అంగీకరించితిని. రాజు నీవు శాపమిచ్చుటయే ఎరుగడు.వినలేదు.నీవు శాపమిచ్చు సమయమున రాజు అయ్యో బ్రాహ్మణాపకారము గలిగినదే ద్వాదశిని విడిచిన హరి భక్తి లోపించునను భయంతో జలపారణ చేసితిని.దానితో బ్రాహ్మణ తిరస్కార మయ్యెగదా? హరీ! నన్నెట్లు కాపాడుదువు అని దీనుడై నన్ను శరణు జొచ్చి నాయందే మనసు ఉంచి ఇతర విషయములు మరిచి తన శరీరమును తానెరుగక ఉండెను.ఇట్లుండగా నీవు శాపమిచ్చితివి. శాపమందు నీవు, "మీనము, కూర్మము మొదలైన పది జన్మలు గమ్ము" అని చెప్పితివి. అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడైన నేను అతని హృదయమందు నివసించి అతని చెవి వలన నీవిచ్చిన శాపమును వినుచు భక్తునికి అన్యాయముగా శాపము గలిగెను గదా దీనినెట్లు చేయుదును అని ఆలోచించితిని.


బ్రాహ్మణుడి మాటను సత్యముగా చేసితేని నా భక్తునికి అనిష్టము గల్గును. శాపమును నివారించితినేని బ్రాహ్మణ వచనము సత్యమగును. కాబట్టి బ్రాహ్మణ వాక్యము సత్యమగుటకు భక్త రక్షణము జరుగుటకు ఆలోచించి నీవిచ్చిన శాపములను నేను స్వీకరించితిని.భక్తులకు కల్గిన అంతులేని మహా కష్టములు అన్నింటినీ నేను హరింతును. నాభక్తుడు ధర్మాత్ముడు, సమస్త భూతములయందు సమబుద్ధి కలవాడు. అట్టి విషయమును ఎరింగియుండియు నీవు అధర్మముగా శాపమిచ్చితివి.వేదములందు దేశమును బట్టి కాలముననుసరించి ముఖ్యముగా వయస్సును చేసుకొని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయములుగా చేసికొని మనుష్యులకు వివిధ ధర్మములు చెప్పబడినవి గదా!


పురుషులకు కొన్ని ధర్మములు, స్త్రీలకు కొన్ని ధర్మములు, మనుష్య జాతికంతకూ కొన్ని ధర్మములు చెప్పబడినవి. కాబట్టి మనుష్య జాతికి సామాన్యముగా చెప్పబడిన ధర్మములను మనుష్యులందరూ విడువకూడదు. రెండు పక్షములందును మనుష్యులందరికిని ఏకాదశినాడు భోజనమాచరించకూడదని వేదములందు పరమ ధర్మము విధించబడినది. భుజించిన యెడల దోషము చెప్పబడి యున్నది. ద్వాదశిని విడిచినచో ఏకాదశిని విడిచిన దోషము సంభవించును. నాభక్తి లోపించునను భయముతో వాడు జలపారణము చేసెను. ఇట్లుండగా నీవు వృధాగా విచారించక శాపమిచ్చితివి గదా!అంతట విరమించక తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించి నీవు నోరు తెరుచునంతలో నేను చక్రమును పంపితిని. అనగా శాపమిచ్చిన గ్రహించువారు లేరు గాన శాపము వృధాయగునని తలంచి నివారించు భావముతో చక్రమును పంపితిని.


బ్రాహ్మణోత్తమా! దుఃఖించకుము.అంబరీషుని విషయమై నీవిచ్చిన శాపము నాకు వరమాయెను.నేను ఈ రూపములను ధరించి అవతారములను ఎత్తవలసి యున్నది.నేను ఈ కల్పమందు ప్రళయమందు జగత్తుయొక్క స్థితి కారణము కొరకు శంఖాసురుని సంహరించుటకునూ, మనువును రక్షించుటకునూ, పెద్ద చేపనగుదును.


దేవదానవులు సముద్రమును మదించు సమయములో సముద్రమందు మునిగిన మందర పర్వతమును నావీపున ధరించుటకు తాబేలునగుదును. హిరణ్యాక్షుని సంహరించుటకు, భూమిని ఉద్ధరించుటకు, నీలాద్రితో నల్లకొండతో సమానమైన పందిని అగుదును.


హిరణ్యకశిపుని సంహరించుటకు క్రోధ జ్వాలల చేత దిగంతముల వ్యాపించుచూ వికృతాననుడైన మనుష్య సింహమునగుదును.లోకత్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును వామనుడిగా పొట్టివాడనగుదును. క్షత్రియ నాశనము కొరకు మహా బలముతో కూడి క్రూర కర్మయుతుడనై పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడనగుదును.


రావణుని సంహారం కొరకు ఆత్మ జ్ఞాన శూన్యుడైన రాముడను రాజును అగుదును.యదువంశమందు ఆత్మజ్ఞానము గలిగియు గోపికాముకుడనై రాజ్యములేని కృష్ణుడనగుదును.


కలియుగమందు పాపమోహము కొరకు బుద్ధుడను దితి కుమారుడనై పాషండ మార్గోపదేశినగుదును.కలి యుగాంతమందు విప్ర శత్రు ఘాతకుడనైన బ్రాహ్మణుడనగుదును.ఇట్లు నాకు పది జన్మలు గల్గును.ఈ పది అవతారములు విను వారికి పాతకనాశనములగును.


ఇతి శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే షడ్వింశాధ్యాయ సమాప్తః!!.

కామెంట్‌లు లేవు: