ఈ రోజు భీష్మాష్టమి సందర్భం గా...
సీ. కుప్పించి ఎగసినఁ గుండలంబుల కాంతి
గగన భాగంబెల్లఁ గప్పి కొనఁగ
నుఱికిన నోర్వక యుదరంబులోనున్న
జగముల వ్రేఁగున జగతి గదలఁ
జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ
బైనున్న పచ్చని పటము జాఱ
నమ్మితి నాలావు నగుఁబాటు సేయక
మన్నింపు మనిక్రీడి మఱల దిగువఁ
తే. గరికి లంఘించు సింహంబు కరణి మెఱసి
నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు
విడువు మర్జున! యనుచు మద్విశిఖ వృష్టిఁ
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు.
చాలా ప్రసిద్ధమైన ఈ పద్యం భాగవతం లోనిది. కవి బమ్మెర పోతన. భీష్ముడు పలికిన పలుకులివి.
భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి, ఉత్తరాయన పుణ్యకాలం కోసం ఎదురుచూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం కృష్ణుని తోడ్కొని పాండవులు వస్తారు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుని చూసి భీష్ముడు చేసిన స్తుతిలో భాగం ఈ పద్యం. శ్రీకృష్ణ పురస్సరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులూ, దేవర్షులూ, బ్రహ్మర్షులూ శిష్యసమేతంగా వచ్చారట. ఆ సందర్భమే ఒక చిత్రమైన సన్నివేశం.
కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మొదటి రోజు ఏమీ విశేషం లేకుండానే గడిచిపోయింది. రెండో రోజు కొంచెం సేపు భీష్మార్జునులు తలపడ్డారు. మూడోరోజు భీష్ముని యుద్ధపరాక్రమం భయంకరంగా ఉంది. అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. సారధి అయిన కృష్ణుడిని కూడా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అర్జునుడు అలసిపోవడం కృష్ణుడు గమనించాడు. భీష్ముడూ తనకూ ఊపిరాడకుండా చేస్తున్నందున కృష్ణునికి నిజంగానే కోపం వచ్చింది.
భీష్మద్రోణాదులనండర్నీ చంపి పారేస్తానని లేచాడు. రథం పగ్గాలు నొగలకు కట్టాడు. స్మరించగానే చక్రం చేతిలోకి వచ్చింది. రథం మీద నుంచి చెంగున దూకాడు. నొగల మీదనుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుని చెవుల రత్నకుండలాలు కిందికీ పైకీ ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నదట. ఒక్కసారిగా ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలో ఉన్న భువనాల బరువుతో భూమి అదిరిపోయిందట. ఆయన భుజాల మీద వున్న పీతాంబరం ఒకవైపు ఆ ఒడుపుకు జారిపోతున్నదట. కృష్ణుని యొక్క ఈ ఊహింపని చర్యను చూసి అర్జునుడికి గొప్ప రోషం వచ్చింది. తనూ దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకుని నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ కాలుక్కరుచుకున్న అర్జునుణ్ణి పది అడుగుల దూరం లాక్కునిపోయాడు కృష్ణుడు. అర్జునుడు రోషంతోనూ, తన చాలిమిని ఎత్తిచూపినందువల్ల కలిగిన అవమానంతోనూ, నా యోగ్యతను నగుబాటు చెయ్యకని వేడుకుంటున్నాడు. ఏనుగు మీదకి లంఘీంచే సింహంలా ఉరకలు వేస్తూ – ‘ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కంటకం చేస్తాను, నన్ను ఒదిలిపెట్టు అర్జునా అని అంటూ’ – ముందుకొస్తున్న ఆ మహానుభావుడు – నా బాణాల దెబ్బకు వడలి, ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు – నాకు దిక్కగు గాక! అని స్తుతించిన సందర్భంలోనిది ఈ పద్యం.
ఒక గొప్ప సన్నివేశానికి ఎంతో చక్కని రూపకల్పన ఈ పద్యం. పద్యం చదివిన, తలచుకున్న ప్రతివారికీ ఆ కుండలాల కాంతీ, ఆ చేలాంచలం జారడంలోని సొగసూ, ఆ చక్రమూ, కాలుక్కరచుకున్న అర్జునుడూ, అతన్ని లాగుతూ ముందుకు వస్తున్న కృష్ణుడు, ఈ గొప్ప సందర్భాన్ని చిరునవ్వుతో, పారవశ్యంతో చూస్తూ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్న భీష్ముడు – ఇవన్ని కండ్లలో మెదలక మానవు. అంత గొప్ప పద్యమిది, ఎవరికి నచ్చదు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి