6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

చరిత్రము 4 వ భాగము

 *శ్రీ ఆదిశంకరాచార్య చరిత్రము 4 వ భాగము* 

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️


*కన్యాన్వేషణ:*


హిమమిత్రుడు పంపిన విప్రులు కాలి నడకను బయలుదేరి అనేక గ్రామములుదాటి అనేక దేశములు దాటి బహు దినములకు విశ్వామిత్రుని ఇంటికి చేరు కున్నారు. వారికి విశ్వమిత్రుడు అర్ఘ్యపాద్యాదులిచ్చి ఎన్నో పరిచర్యలు చేశాడు. కొంత సేపు విశ్రాంతి తీసుకొన్న పిమ్మట కుశల ప్రశ్నలతో పలకరించాడు: 'బ్రాహ్మణోత్త ములారా! మీరు చూడగా బహుదూర దేశంనుండి వచ్చినట్లనిపి స్తోంది. మీ రాకతో మా గృహం పావన మయ్యింది. మీకు ఈ దాసుడు ఏ రీతిగా సేవ చేయగలడు ఇది నా అదృష్టమని భావిస్తున్నాను, చెప్పండి'.


ఆ మాటలు విన్న విప్రులు వెంటనే  తాము వచ్చిన కార్యం ఇలా సెలవిచ్చారు: ‘మహానుభావా! మీ స్వాంతనపు మాటలు, మీ మర్యాదలు మాకు సేద తీర్చాయి, వినండి. మేము వచ్చిన పని ఏమిటో చెప్పుతాము. హిమ మిత్రుడనే బ్రాహ్మణశ్రేష్ఠుని పంపున మీ వద్దకు వచ్చాము. అతని కుమారుడు విశ్వరూవుడనే పిల్లవాడు రూపు రేఖలలోను, విద్యలకు, వినయగుణ సంపత్తికి పేరు గన్నవాడు. మీ ప్రియ పుత్రిక అయిన ఉభయభారతికి అన్ని  విధాలా అర్హుడైన వరుడని సంకల్పించి మానిర్ణయాన్ని తమకు నివేదించమని హిమమిత్రుడు మమ్మల్ని పంపాడు'. 'ఆడబోయిన తీర్థము ఎదురయింద' న్నట్లైంది విశ్వమిత్రునికి. ఇంటి లోనికిపోయి ఆ సంతోషంతో సంగతి భార్యకు చెప్పాడు. హిమ మిత్రుని కుమారుడు విశ్వరూపుడనే వరునకు మన ఉభయభారతి ఇచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చిన బ్రాహ్మణుల గుఱించి. పైకి చాలా ఆనందపడ్డా ఉభయభారతి తల్లికి కొన్ని అనుమానాలు పొడసూపాయి. ఉన్నది ఒక్కతే కూతురు గదా! వాళ్ళు ఉన్న ఊరు చాలా దూరం. ఎప్పుడయినా చూడడానికి వెళ్ళాలంటే ప్రయాస కదా! పిల్ల వాని చదువులేమిటో మంచి చెడ్డలు తెలుసుకొన్న పిమ్మట నిదానంగా ఆలోచన చేసి నిర్ణయిం చాలి కదా! అని ఆ తల్లి తన అభిప్రాయాలనూ  అనుమానాలనూ వ్యక్తం చేసింది. ఆ మాటలకు సమాధానంగా విశ్వమిత్రుడు భార్యతో ఇలా అన్నాడు: 'కుండిన నగరానికీ ద్వారకకూ ఎంత దూరమో తెలుసా? కొన్ని రోజుల ప్రయాణం అటునుండి రావడానికి, భీష్మకమహారాజు ఏమైనా శ్రీకృష్ణుని గూర్చి తెలిసి కొందామని చారులను పంపాడా? శ్రీకృష్ణుని కీర్తి జగద్వ్యాప్తం కదా! అదే విధంగా ఈ విశ్వరూపుడు కూడ బహుయశస్సు సంపాదించుకొనిన వాడు. పైగా కుమారస్వామి అవతారమయిన కుమారిలభట్టు వద్ద చదువు నేర్చుకొన్న ప్రజ్ఞా వంతుడు. ధనసంపద అంటావా? బ్రాహ్మణునికి విద్యయే తరగని అమూల్యమయిన విత్తం. అది కాక హిమమిత్రుడు ధన ధాన్యాది ఐహిక భాగ్యం లోనూ లోటు లేని గృహస్థుడు'. 


ఆ విధంగా సంప్రతించు కొన్న తరువాత ఉభయ భారతి చెవిలో వేశారీ మాట. విన్నంతనే ఆమె ఆనందంతో సిగ్గుతో అరమొగ్గలా అయింది. వివాహప్రయత్నం తప్పక జయప్రదమగుననే నమ్మకం ఉభయభారతికి. ఆ నమ్మకంతో తానే ఒక గొప్ప ముహూర్తాన్ని నిశ్చయించినది. సకల శుభలక్షణములూ కల ముహూర్తమది. ఆ ముహూర్త యోగబలాన్ని బట్టి వ్యవధి పదునాలుగు రోజులే ఉన్నా ఒక ఆకు మీద లిఖించిన పత్రికను తమ వైపు బ్రాహ్మణున కిచ్చి పంపించారు. వచ్చిన విప్రవరులతో బాటు పరుగు పరుగున వారు హిమమిత్రుని దగ్గఱకు చేరుకొన్నారు. లగ్నపత్రిక అందుకున్న హిమ మిత్రుని ఆనందానికి అవధిలేదు. శుభవార్త అందించిన ఆ విప్రులను బహురీతులుగా సత్కరించాడు హిమ మిత్రుడు. తాము అందరూ సకుటుంబ పరివారంగా తరలి వస్తున్నామని వర్తమానం తెలిపారు మగ పెండ్లి వారు ఆడ పెండ్లి వారికి. సమయ వ్యవధి  తక్కువ కావడంతో పెళ్ళికి సంబంధించిన పనులు సకలం చకచకా చురుకుగా జరుగుతున్నాయి.


*ఉభయభారతీ విశ్వరూపుల పరిణయము:*


పందిళ్ళు వేసే వాళ్ళు ప్రమోదంతో నిర్మించి, చూత పల్లవాలతో అలంకరించుచుండగా, వివాహవేదిక సర్వాంగ సుందరంగా తయారవు తోంది. పురమంతా పందిళ్ళే. ఊరంతా పెళ్ళివారే. మగపెళ్ళివారికి తగు విడిది ఏర్పాట్లు  చేశారు. మేళతాళములు, మంగళవాద్యాలు మొదలైనవన్నీ సమకూర్చు కొని మగ పెళ్ళివారి రాకకై ఎదురు చూస్తున్నారు విశ్వమిత్రుని వైపు వారు.


ఇక హిమమిత్రుని వెంట ఆ పురప్రజలు అందరూ ప్రయాణ మయ్యారు. విప్రులతో, మిత్రులతో, భృత్యులతో, వేశ్యకన్యకల బృందాలతో, ఢంకానౌబత్తు కానాలతో, రామడోళ్లతో, ఇంకా పలురకాల మంగళ వాద్యాలతో మంచివేళ చూచికొని బయలు దేరారు మగపెండ్లివారు. ముత్యాల పల్లకిపై మందహాసంతో కూర్చున్న పెండ్లి కొడుకు విశ్వరూపుడు. గాయక శిఖామణులు, కవిపుంగ వులు, బ్రహ్మణ్యులైన బ్రాహ్మణులు వేద వాక్కులు పలుకుచుండగా, వాహనములపై ఎక్కి విజయ పరంపరలను అందుకొనుటకు వెడలే విజయుని సేనా వాహిని వలె విరాజిల్లినది ఆ జనసందోహం. మధ్య మధ్య మకాములు వేసికొంటూ, తొందర ఏ మాత్రం లేక నిబ్బరంగా తరలివస్తున్నారు. వెళ్ళి వెళ్ళి శోణానదీతీరం చేరుకొనగానే చెవులు చిల్లులు పడేటట్లు బాకాలు మారు మ్రోగాయి. అది మగ పెళ్ళి వారు వచ్చినట్లు సంకేతం. ఉలిక్కిపడిన కన్యాదాత వెంటనే ఎదురు వెళ్ళి స్వాగతం పలికి వారిని వెంట బెట్టుకొని ప్రత్యేకించి ఏర్పరచిన విడిదిలో ప్రవేశపెట్టాడు. ఒకరి నొకరు ఉదాత్త మర్యాద పూర్వకంగా పలకరించు కొన్నారు. వేదవిహితమైన వివాహకార్యక్రమం ముగిసింది. మండనమిశ్రుడు (విశ్వరూపుడు)మంగళసూత్రమును ఉభయ భారతి గళసీమను అలంకరింప జేశాడు.


*శంకరుల విద్యాభ్యాసము:* 


ఏడాది వెళ్ళకుండా శంకరబాలుడు అక్షరాలన్నీ గుర్తించ గలిగాడు. రెండవ యేడు రావడంతో పలు భాషల లిపులు విపులంగా నేర్వనారంభించాడు. దిద్ద నక్కఱ లేదు చూడడమే తడవుగా ఏదయినా ఆకళించుకోగలడు. రెండవ యేడు దాటలేదు శబ్దాలు కావ్యాలు నేర్వడం పూర్తయ్యింది. తాను నేర్వడమే కాదు తోటి బాలురకు కూడా నేర్పేవాడు. గురువుల నోట రావడం తడవు అన్నీ పలికేవాడు. తరువాత పురాణాలు చెప్పడం మొదలు పెట్టాడు. విద్యలన్నీ శంకర బాలుని ఆ విధంగా చేరుకొన్నాయి. ఆ విద్యాపాటవం ఆ నోట ఈ నోట ప్రాకి లోకులంతా విభ్రాంతులయ్యారు. వచ్చీరాని వయస్సులో మహావిద్వత్సంపన్నుడవడం వింతలలో వింత. సాక్షాత్తూ శంకరుడే అనిపించాడు. వేదవిద్య శంకరునికి సహజంగానే అబ్బింది. ఆ మృదు మధుర వేద నిస్వనం వినిన వారికి మరల మరల వినాలనిపించేది. శాస్త్రాల మాటకు వస్తే మంచి నీళ్ళ ప్రాయమే. దిగ్గజాలు వంటి పండితులతో చేసే చర్చలు బహు వినోదకరంగా ఉండేవి. ఉద్దండులైన పండితులను ఇట్టే పల్టీలు కొట్టించ గలిగేవాడు. కాని తర్కం జోలికి పోయేవాడు కాదు ఇష్టం లేక. కాని కుతర్కవాదులు ఇతని ముందు తల వంచ వలసిందే. బాలుని ప్రతిభ ఎంతదో తెలిసి కొందామని వచ్చిన వారందరూ శంకరునితో వాదులాడిన పిమ్మట అతనికి జోహారు లర్పించే వారు.


*శివగురుడు దివి కేగుట*:


సర్వసమర్థుడైన సత్పుత్రుని విద్యావైభవాన్ని కనులార గాంచి అమందానంద పుత్రోత్సాహ సంభరితుడైన శివగురుడు ఇలా భావించాడు. చిత్తమూ, విత్తమూ, జీవితమూ అన్నీ క్షణ భంగురాలే. ఈ పాంచభౌతిక గాత్రం నశ్వరమని నమ్మి పరమాత్మ లేనిచోటు లేదని తలపోస్తూ, శివగురుడు పరమ జ్ఞానిగా శాశ్వతంగా పరమపదమందే దిశగా అస్తమించాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆర్యాంబను గ్రామం లోని స్త్రీ పురుషాదులు చూడవచ్చారు. దగ్గరగా చేరి, ఆమెకు ఊరటగా ఇలా చెప్పారు: 'నీకు చెప్పదగిన వారముకాము. మమ్ములనందరినీ ప్రేమతో చూచినదానవు. శివగురుడు నిజంగా పోలేదు. చినిగిన బట్టను వదలినట్లు తన పాంచ భౌతికదేహాన్ని త్యజించి పరమాత్మలో లీనమయ్యాడు. ఆయన సర్వజ్ఞుడు. మనల కందరికీ వైరాగ్యజ్ఞానభిక్ష ప్రసాదించిన ఘనుడు. ఈ బిడ్డను చూసుకో. ఇటువంటి బిడ్డను నీ చేతులలో పెట్టి వెళ్ళాడు నీ భర్త. తెలివికి నిధానమయిన ఈ బిడ్డనికి పట్టుమని అయిదేండ్లు లేవు. మానవులం మన విధులు మనం నిర్వర్తించ డం కన్న చేయగలిగే దేముంది’ అంటూ సప్రేమగా ఊరివారు ఆర్యాంబకు బాసటగా ఊరటనిచ్చారు.


*ఉపనయనము:*


ఏడాది అప్పుడే గడచి పోయింది. నాలుగేళ్ళు నిండి ఐదవ ఏడు వచ్చింది. ఉపనయన వయస్సు రానక్కర  లేదు మన శంకరబాలునికి. దైవజ్ఞులచే మంచి ముహూర్తం స్థిరపరచారు. చుట్టాలు, పక్కాలు, ఊరివారందరు, ఎందరో పండిత ప్రకాండులు వీరు వారననేల: నేల ఈనినట్లుగా ఆ అవతారపురుషుని ఉపనయనమహోత్సవాన్ని చూడడానికి వేంచేశారు తండోపతండాలుగా. వటువు తండ్రి లేడన్న చింత తక్క మరో చీకు లేదు శంకరుని తల్లికి. మహర్షుల సన్నిధానంలో జరిగింది ఆ వేదవిహిత ప్రక్రియ. వేదవిదుల ఆశీర్వచనాలు, బ్రహ్మచారికి ఉపయుక్త మయ్యే కానుకలు ఎన్నో  అందాయి వటువుకు. పసుపు రంగు కౌపీనం ధరించి అదే రంగు యజ్ఞోపవీతం మెడలో ఉండగా, చేత పలాశ దండాన్నీ, చంకనొక జోలెని, జలపాత్రను ధరించిన నూతన వటువు బ్రహ్మసన్నిధానంలో తొలిగా మాతృదేవికి భిక్షావందన మాచరించాడు. ఆ నాటితో రెండవ జన్మ ఆరంభ మయ్యింది శంకరునకు. ద్విజుడైన శంకరుని బ్రహ్మ వర్ఛస్సు అసమానం అద్వితీయం.


*హరహర శంకర కాలడి శంకర*

*శ్రీ శంకరాచార్య చరిత్రము* 

*4 వ భాగము సమాప్తము*

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗

కామెంట్‌లు లేవు: