*శ్రీ పోతన భాగవత పద్యరత్నములు*
*నేమాని సూర్యనారాయణ*
*" చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ - 10 "*
*4 - 881 - వచనము:*
పురుషుడు స్త్రీల యిండ్లను ఆశ్రయించి క్షుద్రమై, కామ్యపరిపాకం నుండి పుట్టిన జిహ్వ, ఉపస్థ మొదలైన కామ జనిత సుఖలేశాన్ని అన్వేషిస్తాడు. స్త్రీయందే మనస్సు నిల్పి మనస్సును కొల్లగొట్టే స్త్రీల మాటలను వినగోరుతాడు. కళ్ళముందే తోడేళ్ళ గుంపులాగా ఆయుస్సును హరించే రాత్రింబవళ్ళను లెక్కచేయడు. వెనుకనుండి బోయవాని వంటి యముడు శరీరాన్ని చీల్చివేస్తుండగా జీవుడు విహరిస్తాడు. కాబట్టి నీవు ఈ జీవుని లేడివంటి చేష్టలు కలవానిగా భావించు. బాహ్యవ్యాపారాలైన శ్రౌతస్మార్తాది రూపకర్మలను హృదయంలో నిగ్రహించు. అతి కాముకుల గాథలతో కూడిన సంసారాన్ని విడిచిపెట్టి, సర్వజీవులకు దిక్కైన భగవంతుని సేవించు. సంపూర్ణ విరక్తిని పొందు” అని నారదుడు చెప్పగా ప్రాచీనబర్హి ఇలా అన్నాడు.
*4 - 882 - కందపద్యము:*
*"మునివర! భగవంతుండవు*
*ననుపమ విజ్ఞాననిధివి ననఁదగు నీ చే*
*తను వివరింపంగాఁ దగి*
*యెనసిన యీ యాత్మతత్త్వ మిటు నాచేతన్.*
*భావము:*
“మునీంద్రా! భగవంతుడవు, మేటి జ్ఞానివి అయిన నీవు చెప్పిన ఆత్మ తత్త్వాన్ని…
*4 - 883 - వచనము:*
విని బాగా ఆలోచించాను. నాకు కర్మను బోధించిన ఆచార్యులకు ఈ ఆత్మతత్త్వం తెలియదు. తెలిస్తే కర్మని ఉపదేశింపరు కదా! ఆ ఆచార్యుల ఉపదేశం చేత నాకు ఆత్మతత్త్వం విషయంలో కలిగిన మహాసంశయం నీ వల్ల పటాపంచలయింది” అని ఇంకా ఇలా అన్నాడు.
*4 - 884 - సీసపద్యము:*
*అనఘాత్మ! యేమిటి యందు నీ యింద్రియ-*
*వృత్తులు దగఁ బ్రవర్తింపకుండు*
*టను జేసి ఋషు లైన ఘనముగ మోహింతు-*
*రట్టి యర్థము నందు నాత్మ సంశ*
*యము గల్గుచున్నది; యది యెట్టి దనినను-*
*బురుషుఁ డేయే దేహమునను జేసి*
*కర్మముల్ చేసి తత్కాయంబు నీ లోక-*
*మందునే విడిచి తా నన్యదేహ*
*4 - 884.1 - తేటగీతి:*
*మర్థితో ఘటియించి లోకాంతరమును*
*బొంది తత్కర్మఫలమును బొందు ననుచుఁ*
*బ్రకటముగ వేదవేత్తలు పలుకుచుందు*
*రన్న నది యెట్లు విన నుపపన్న మగును?*
*భావము:*
పుణ్యాత్మా! ఇంద్రియ వృత్తులలో అప్రవృత్తులై ఋషులు మోహించే అర్థం గురించి నాకు సంశయం కలుగుతున్నది. పురుషుడు ఏ దేహం చేత కర్మలు చేస్తాడో ఆ దేహాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి తాను మరొక దేహాన్ని ధరించి మరొక లోకాన్ని చేరి అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడని వేదవేత్తలు చెపుతారు. ఇది ఎలా పొసగుతుంది?
*4 - 885 - వచనము:*
అంతేకాదు. చేసిన వేదోక్తమైన కర్మ ఆ క్షణంలోనే నశిస్తుంది కదా! ఇంక జీవుడు మరొక దేహం పొంది లోకాంతరంలో ఎలా అనుభవించగలడు?” అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు ప్రాచీనబర్హితో ఇలా అన్నాడు “రాజా! లింగశరీరాన్ని ఆశ్రయించి ఉండే జీవుడు కలలో జాగ్రద్దేహాభిమానాన్ని విడిచి, అటువంటిదో లేక అటువంటిది కానిదో అయిన మరొక శరీరం పొందుతాడు. మనస్సులో సంస్కార రూపంలో ఆ హితమైన కర్మని ఆచరిస్తాడు. అలాగే జీవుడు ఏ లింగ శరీరం చేత కర్మని చేస్తాడో ఆ లింగశరీరం చేతనే లోకాంతరంలో ఆ ఫలాన్ని అనుభవిస్తాడు. భిన్న దేహాన్ని పొందడు. ఇవ్వటం, పుచ్చుకొనడం మొదలైన వానిలో స్థూల దేహానికి కర్తృత్వం ఉన్నదని భ్రమించకూడదు. జీవుడు అహంకారంతోను మమకారంతోను కూడినవాడు. ఆ జీవుడు మనస్సు చేత ఏ దేహాన్ని పొందుతాడో, ఆ దేహం చేతనే ప్రాప్తించిన కర్మని అనుభవిస్తాడు. అలా కాకుంటే కర్మ పునర్జన్మకు కారణం కావటం పొసగదు. కాబట్టి మనః ప్రధానమైన లింగశరీరానికే కర్తృత్వం పొసగుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి