6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

7. " మహా దర్శనము

 7. " మహా దర్శనము " ---ఏడవ భాగము -- -సుఖ ప్రసవము


 ఏడవ భాగము -- సుఖ ప్రసవము 


          మరు దినము ఆలంబిని తల్లితో కర్మ విచారము ప్రస్తావించి , భర్త తనకు చెప్పినదంతా చెప్పినది . తల్లికి ఆశ్చర్యము కాలేదు . " నువ్వు మంచి పనే చేసినావు , దేహమే నేను అనుకొనువారి మాట వేరు . దేహము నేను కాదు ; నేననేది వేరే ఇంకొకటుంది అని నమ్మువారు ఇటులనే చేయవలెను . నిజమే . ఆడది జన్మ ఎత్తినపుడే సిగ్గుపొరలను కప్పుకొనే పుడుతుంది . అలాగని మెట్టినింటికి ద్రోహము అగునట్లు చేయవచ్చునా ? అట్లు చేసిన , పుట్టింటికి కూడా ద్రోహము అయినట్లే . కాబట్టి నువ్వు చేసినది సరియైనదే . కానుపు గది ఎక్కడ అని అనుకున్నారు ? అది ముందు చెప్పు . " 


" నడిమింట్లోనే ఒక మూలలో తెరలు కట్టి చేయవలెను . " 


        " సరే , అక్కడే చేయండి , దానికి రెండు వైపుల నుండీ దారి ఉండనీ . బిడ్డ పుట్టగానే నేను మంత్రసానిని ఒక దారినుండీ బయటికి పిలుచుకొని వస్తాను . ఇంకొక దారి నుండీ నీ భర్త వచ్చి కర్మను ముగించుకొని వెళ్ళనీ . వారు వెళ్ళిపోగానే నువ్వు నన్ను పిలువు . నేను మంత్రసానితో పాటు వచ్చి తరువాతి కార్యము చేసెదను . " 


         ఆ దినము పంచమి , కర్మకు కావలసిన తేనె , నెయ్యి , బంగారము సిద్ధమయినాయి . ఆడవారు కర్మకు ఒప్పుకున్నందు వలన కర్మకు ఇక ఉన్న అడ్డు తీరిందని దేవరాతుడు బహుళ తృప్తుడైనాడు . 


         ఆలంబినికి ఆయాసము ఎక్కువగుతూ వచ్చినది . కూర్చుంటే లేచుట , లేస్తే కూర్చొనుట కష్టమగుతున్నది . దేవరాతుడు అది చూచి అగ్ని పరిచర్యను తానే వహించి చేస్తున్నాడు . 


         ఆలంబిని తల్లి జాయంతి కూతురికి వేడినీళ్ళు ఇస్తూ , ’ గర్భము జారినది , ఇక రెండో మూడో దినములు , అంతే . " అన్నది . కూతురు , " వారి మాట ప్రకారమైతే రేపే జననము కావలెను " అన్నది . తల్లి , " అయినా కావచ్చును , అయితే , బిడ్డ మాత్రము , ...ఆలంబీ , ఏమీ అనుకోవద్దు , మాంచి భూతపు బిడ్డ అవుతుంది " అంది . ఇద్దరూ నవ్వినారు . 


         గురువారము తెల్లవారింది . నడిమింట్లోనే ఒక మూలలో ప్రసూతి గృహము సిద్ధమయినది . తల్లి , బాలింత పడక మొదలైనవన్నీ సిద్ధము చేసి ఉంచినది . అందరూ త్వరితముగానే భోజనములు కానిచ్చినారు . గర్భిణి కూడా భోజన శాస్త్రము అయిందనిపించినది . మధ్యాహ్నపు సూర్యుడు నెత్తిపై నుండి పశ్చిమమునకు దిగు సమయమునకు , పొద్దుటి నుండీ అప్పుడప్పుడు వస్తున్న నొప్పి తీవ్రమైనది . వెంటనే , మజ్జిగన్నము తింటున్న తల్లి భోజనము వదలి చేతులు కడుక్కొని పరుగెత్తి వచ్చినది . 


         ఆలంబిని ఎక్కువ సేపు నొప్పులు తినలేదు . తల్లిని ఆనుకొని ఒరిగి కూర్చునియుండగనే మరియొక నొప్పి వచ్చినది . దానితో పాటే , జలోదయ , శిరోదయములు రెండూ ఏకకాలములోనే అయినవి . ఇంకొక ఘడియ లోపలే శిశువు లోకానికి వచ్చినది . తాను వచ్చినట్టు ప్రకటించుటకా అన్నట్టు ఏడ్చింది . 


         తల్లి జాయంతి , కూతురికి చెప్పినట్లే మంత్ర సానిని పిలుచుకొని బయటికి వెళ్ళినది . వేరే వాకిలి నుండీ దేవరాతుడు లోపలికి వచ్చినాడు . ఆచార్యుడు కొడుకు కుడి భుజమును ముట్టుకొని , " సరస్వతీ దేవి నీకు మేధను ఇవ్వనీ , ఇంద్రుడు నీకు మేధను ఇవ్వనీ " అను అర్థము వచ్చు మంత్రమును ఉచ్చరించినాడు . బిడ్డతల్లిని ఉద్దేశించి , " అరుంధతీ సమానురాలా, నువ్వు స్తోత్రములు చేయుటకు పాత్రురాలవు . వీర పుత్రుని పొందిన ఓ వీరమాతా , నీకు మంగళమగు గాక " అని అభినందించినాడు . 


         అక్కడనుండి వెళుతూ ,’ నేనిక స్నానము చేస్తాను . కొడుకు పుట్టగానే నిలుచున్నవాడు నిలుచున్నట్టే నీటిలో దుముకి స్నానము చేయవలెనంట . ఆ నీరు ఎంతగా పైకి ఎగసిపడితే అంత అక్షయమైన లోకములు పితృ దేవతలకు దొరికి మా పితృ ఋణము తీరునంట. నువ్వు ఇప్పుడు బిడ్డకు స్తన్యము నిచ్చునపుడు మరచిపోకుండా సరస్వతిని ధ్యానించు , " హే సరస్వతీ దేవీ , సర్వ ప్రాణులకూ అన్న ప్రదాతయైనది నీ స్తనము . రత్నములనూ , ధనమునూ అధికముగా ఇచ్చునది నీ స్తనము . దేవతలందరికీ రక్షణనిచ్చునది నీ స్తనము . దానిని ఈ బిడ్డకు కూడా ఇవ్వు" అని ఆమెను ధ్యానించి , బిడ్డకు స్తన్యమునివ్వు ’ అని నిర్దేశించి బయటికి వచ్చినాడు . 


         అతడు ఇవతలికి వచ్చిన తరువాత జాయంతీ , మంత్రసానులు మరలా వచ్చి బిడ్డకు వెచ్చటి నీరు ఇచ్చి , నాళమును కత్తరించి , చేయవలసినదంతా చేసి , బిడ్డకు స్తన్యపానము చేయించి తల్లీ బిడ్డలను నిద్రపుచ్చారు . 


         ఇక్కడ ఆచార్యుడు స్నానము చేసి లోపలికి వచ్చు వేళకు రాజ భవనము నుండీ రాజ పురోహితుడు , రాజ పురుషునితో పాటూ వచ్చినాడు . రాజ పురోహితుడు లోపలికి వస్తూనే ఆచార్యుడు ఎదురేగి " రండి రండి , రాజ పురోహితులు దయ చేయవలెను " అని స్వాగతము చెప్పినాడు . భార్గవుడు , ’ రథములో రాజపురుషుడు వచ్చినాడు . అతడిని రమ్మనండి ’ అన్నాడు . ఆచార్యుడు నీరుకారుతున్న శిరోజములను పిండుకుంటూ , " నాకోసము ఆపని మీరు చెయ్యండి , నేను మడి బట్ట కట్టుకొని వస్తాను ’ అని లోపలికి వెళ్ళినాడు . 


         అతడు బయటికి వచ్చువేళకు రాజ పురుషుడూ , పురోహితుడూ ఒక గదిలో కూర్చొనియున్నారు . ఇద్దరూ ఆచార్యునికి వందనము చేసి రాజాజ్ఞను తెలిపినారు : ’ శిశు జననమైన తర్వాత చేయవలసిన కర్మల నన్నిటినీ ఏ శంకా లేకుండా వైభవముగా జరిపించి రాజాశీర్వాదము చేయవలెనని మీకు చెప్పి రమ్మని మహారాజు మా ఇద్దరినీ పంపించినాడు " 


         ఆచార్యుడు , " ఇంట సుఖప్రసవమై పుత్ర జననమయినది . రాజాజ్ఞ ప్రకారము ఏ లోపమూ లేకుండా సర్వమునూ క్రమముగా జరిపించెదము . మేము చేయు ప్రతియొక్క కర్మ వలననూ మహారాజులకు నిస్సందేహముగా శ్రేయస్సు కలుగును అని వారికి తెలపండి . నేను సకాలములో వచ్చి దర్శనము చేసుకొనెదను " అన్నాడు .

కామెంట్‌లు లేవు: