7, అక్టోబర్ 2024, సోమవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము37 వ భాగము*

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము37 వ భాగము* 

🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒


*విష్వక్సేనాలయము:*


అనుమల్లపురము నుండి పశ్చిమ దిశగా బయలుదేరి మంగళ వాద్యములతో, దారి పొడవున గురువులను స్తోత్రములు చేయుచు, ప్రాంతీయ విశేషముల నరయుచు, శ్రీశంకర శిష్యులు ఆహ్లాదముతో వెంటనంట శ్రీశంకరా చార్యస్వామి మరుంధ నగరం ప్రవేశించారు. దేవాలయం లేని గ్రామ ముండదనిలోకమనును తీరా ఈ ఊరు దేవాలయం లేని ఊరని తెలిసికొన్నారు. వెంటనే ఆలయ నిర్మాణమునకు గ్రామ వాసుల సహాయంతో వలయు నేర్పాట్లు గావించి, శాస్త్రాను గుణముగ, అందచందాలు తీర్చి దిద్ది గోపురాలయము లను నిర్మించి అందు విష్వక్సేనుని ప్రతిష్ఠిం చారు. ఆలయమునకు తూర్పుదిశగా నొక పాకశాలను నిర్మించారు. ఆలయ ఆవరణలో ఇంకను వలయు మందిరాదులు, ప్రకార ములు నిర్మించారు.


ఆ దేవాలయమున నొకచో శ్రీ శంకరాచార్య స్వామి దర్భాసన మును పరుచుకొని సుఖాసీనులై, మనోన్మణీ ముద్రను ధరించి తనలో నుండు పరమాత్మను, లోకము నంతను పరమాత్మగను జ్ఞాన దృష్టితోచూచుచుబ్రహ్మానందములో మునిగి యున్నారు. ఆ విధమున చాలకాలము మహాయోగ సమాధిలో నుండి జ్ఞానామృతము ను ఆస్వాదిస్తూ ఉన్నారు.


మహాయోగిపుంగవులు, జ్ఞాన స్వరూపులు శ్రీ శంకరపాదులు  అట్లు ఉండుటజూచి అబ్బుర పడి యోగనిద్ర నుండి మేల్కాంచు వరకు భక్త కోటి వేచియున్నది. శ్రీజగద్గురువులుసమాధి నుండి మేల్కాంచుట గని పురమందలి విష్వక్సేన భక్తులు చక్రాంకి తములతో ప్రకాశించుచు మునికోలలను ధరించి "యతీశ్వరా! మా మత ధర్మములువిని అందు గల విశిష్టతను తిలకిం చండి. మా మతము అన్నిటి కంటే గొప్పది. వైకుంఠవాసుడైన విష్వక్సేనుడు మాకం దరికీ ఉపాస్య దేవుడై వెలయుచున్నాడు. మేమా విష్వక్సేనుని పరమభక్తులమై యున్నాము. యముడనిన మాకు నిర్భయము. ఈ శరీర విసర్జన సమయమందు వైకుంఠము నుండి విష్ణుభటులు వచ్చి మమ్ములను స్వయంగా వైకుంఠమునకు తీసికొనిపోవుచున్నారు. కావున మా మతము సర్వజనా దరణీయమై యొప్పుచున్నది" అని వినిపించారు.


శ్రీశంకపాదులు విష్వక్సేన భక్తులాడిన పలుకులు వినుటతో వారలయెడ పరమప్రేమ గలిగి, “విష్వక్సేన భక్తులారా! మీరాడిన మాటలలో నిజం కానరాదు. విష్వక్సేనుడు శ్రీమన్నా రాయణ మూర్తి భక్తుడై యున్నాడు. ఆ నారాయణ మూర్తి వైకుంఠమునకు ప్రభువు. విష్వక్సేనుని వంటి భక్తులు చాలామంది గలరు. ఎవరి కిష్టమైన విష్ణుభక్తులను పరమ దైవముగ భావించి కొలుస్తారు. అందులకు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహించియున్నారు. ఆవిధముగ విష్ణు భక్తులందరు పూజనీ యులైరి.ఈ విష్ణు భక్తులకు స్వాతంత్య్ర మన్నదిలేదు. మీరందరు వారిని స్వతంత్రులని భావించి పూజించు చున్నారు. అందువలన లాభము లేదు మీకు విష్ణులోకము కావలెన ను కోరిక ఉన్నచో శ్రీమన్నారాయణ  మూర్తినే సేవించుడు.ఆయనేముక్తినిచ్చును. “ఆయనే నేను నేనే ఆయన” అని నిరంతరం మననం చేయుడు. భేదభావం మాత్రం ఉండరాదు. అప్పుడది నిర్గుణపూజ యగును. భేదభావం లేనివారు తత్త్వజ్ఞానులై ముక్తినిపొందుచున్నారు. గురూపదేశమును పొంది, వారి నుండి అద్వైతతత్త్వ బోధలు వినుచు, ప్రయత్నంతో నిర్గుణ ధ్యానం చేసి ముక్తిని పొందుడు. మీ మీ బాహ్యచిహ్నములు విడ నాడండి.” అని బోధించారు.


విష్వక్సేన భక్తులందరు శ్రీ శంకరపాదుల బోధ  విని సంతసించి తమ తమ బాహ్య చిహ్నములను విడనాడి

 శ్రీ శంకరాచార్యస్వామి చెప్పిన విధముగ అద్వైతమార్గము ననుసరించడం మొదలుపెట్టారు. పిమ్మట మన్మధోపాస కులు వచ్చి తమ మతవిధానమును తెలుపుకొన దొడగారు.


*మన్మథ మతస్థులు:*


మన్మథమతస్థులు ఎట్లైనను తమమతము ను నిలబెట్టుకొన తలంపు గలిగి శ్రీశంకర దేశికేంద్రులను సమీపించి, నమస్కారము లర్పిం చారు.


"యతీశ్వరా! మా మతము చాల ప్రసిద్ధి కెక్కియున్నది. మన్మథుడే మాకు పరమదైవం. ఆయన అందరి హృదయములలో భావనా రూప ముగా సర్వదావెలయు చున్నాడు.మామతము చాలా అద్భుతమైనది. మన్మథుడు ప్రతిష్ఠించిన దిది. ఆయన సృష్టిస్థితి లయములకు కారకుడై యున్నాడు. అందు వలన ఆయన్ని అందరు ఉపాసించ వలెను. మన్మథదేవుడు వక్షస్థలమందు రెండు గుండ్రని భూషణము లను దాల్చి అందరిని మోహంతో తన వశం చేసికొను చున్నాడు. మనస్సును హరించే అద్భుతశక్తి గలిగి వెలుగొందు చుండుట వలననే మన్మథుడను గొప్పపేరు కలిగినది. సుందర స్వరూపముతో నొప్పారు కాంతలతో కామక్రీడా సుఖములను పొందడమే మోక్షమొస గునని మా దృఢ నమ్మకం. మన్మథోత్సవ ములందు తాముగూడ పాల్గొని అనంతమైన సుఖములను పొందుడు!" అని ఒక మన్మథ మతస్థుడు నివేదించాడు.


శ్రీ శంకరాచార్యస్వామి అదివిని, "మన్మథభక్తులారా! సృష్టిస్థితి లయములకు బృహ్మవిష్ణు మహేశ్వరులే కారకులు గాని ఇతరులు కారు. త్రిమూర్తులు ఆ  పనికి నియమింపబడినట్లు శాస్త్రములు తెలుపు చున్నవి. సూర్యునకున్న ప్రకాశము రవిపుత్రున కున్నదా? అదియును గాక స్త్రీలతోటి సహవాసము, పొందుపై మక్కువ గలవాళ్ళకు దూరముగనుండుమని శాస్త్రములు వచిస్తు న్నాయి. అందువలన మీమతము మతి మాలినది. మన్మథుడు మోక్ష మిచ్చు ననుటకు ప్రమాణములు కలవా? జ్ఞానమార్గమే మోక్ష హేతువు" అని బోధించారు.


అప్పుడు వారు తమ,తమ మతధర్మాలను విడనాడి పంచాయతనపూజలు ప్రారంభించి, ఇతర సత్కర్మలను నిష్ఠతో అచరించుచు, అద్వైత తత్త్వ విచారణ యందు నిమగ్నులై మన్మథభక్తులందరు శ్రీ శంకర పాదులకు భక్తులై సుఖముగ నున్నారు. అచ్చోటువీడి శ్రీ శంకరా చార్యస్వామి శిష్య గణమును వెంట నిడుకొని మాగధపుర మునకు ప్రయాణమై నారు.


*మగధ పురము:*


మన్మథభక్తులను అద్వైతభక్తు లనుగా జేసి, ఉత్తరముగ ప్రయాణమై శ్రీశంకర పాదులు మగధపురం ప్రవేశించారు. ఏ మేడ జూచిన, ఏ గడప జూచిన అంతాబంగారు మయమే. మాగధపుర సంపద వర్ణించ నలవి గానిది. ఏ ఏయింటి ప్రాకారపుగోడ చూచినా బంగారు యిటుకలతో నిర్మించినవే. గోడలు నక్షత్రాల నంటు చుండెను. ఆ గోడలకు వింతవింత లతలు చెక్కబడిన బంగారపు రేకులు అమర్చబడి యుండెను. మధ్య మధ్య కాంతులు విరజిమ్మే మేలైన రత్నములు పొదుగబడి యున్నవి. వారి ధనాగా రములు అంతులేని విత్తంతో పూర్తిగావింప బడినవే! ఆ పురమునగల ఏయమ్మను జూచినను బంగారు ఆభరణములు మోయ లేక అడుగు లిడుటకు గూడ శక్తి హీనమైనదే ! ఆయమ్మల శరీర కాంతులు అనుపమా నములు. మగవాళ్ళు తక్కువా? వేళ్ళకు, ముంజేతులకు భుజ ములకు, కంఠములకు, దండలకు, చెవులకు, రకరకాల ఆభరణము లు తగిలించెడివారు. వాళ్ళ సంపదను ఒక్కమాటలో చెప్పవలె నన్న కుబేరసంపదను ధిక్కరించినది. వాళ్ళ కంతంత సంపదలెట్లు చేకూరెనో యను చింతన శ్రీ జగద్గురువుల శిష్య గణంలో మెదలక పోలేదు.

శ్రీ ఆచార్యస్వామి శిష్యగణంతో మాగధ పురవీధులలో నుండి కుబేరసంపదలు తిలకించుచు తిన్నగా దేవాలయమునకు జని చూడ గుడి గోపుర ములు, ప్రాకారములు, ద్వారములు, కిటికీలు సర్వము బంగారు మయమై దివ్యకాంతు లు వెదజల్లు చున్నవి. దేవుని దర్శించి ఆలయ మందు శ్రీశంకరాచార్య స్వామి విశ్రమించారు. శ్రీ జగద్గురు వులు వచ్చిరన్న వార్త విని పురజనులందరు బయలుదేరి దర్శించారు. వేలాది శిష్యులతో అవతారమూర్తి తమ పురం వచ్చారన్నవార్త చెవులబడుటతో మాగధపురములోని కుబేరభక్తులు ఆబాల గోపాలం ఉత్సాహంతో వెడలి దర్శించారు. వారికి అనేక సదుపాయాలు సమ కూర్చారు. వాళ్ళు సంపదను జూచు కొనుచు కులుకుచుండు వారు. తమకు మహా భాగ్యం కలిగించిన కుబేరుని గురించి శ్రీశంకరపాదులకు నివేదించదలచి అందొక భక్తుడు జగద్గురువు లకు నమస్కరించి,

'స్వామీ! ఈ జగత్తు అంతయు ధనం మీద ఆధారపడి యున్నది. ఏ పని చేయవలెనన్నా ధనం కావలెను గదా! కనుక మోక్షమునకును ధనమే మూలము. ధనం కావలె నన్నను, మోక్షం కావలెనన్నను మా పరమదైవం కుబేరుడినే ఉపాసించ వలయును. ఆయన మాకే కాదు, బ్రహ్మాది దేవతలందరికి ధనము నిస్తున్నాడు. గనుక బ్రహ్మ మొదలు మానవుని పర్యంతం, మా దేవాది దేవుడైన కుబేరుడు సేవింప దగిన వాడయ్యెను. ఆయనను నిత్యం సేవించే ఒక యక్షిణి గలదు. ఆదేవతా స్త్రీని సేవించినను లెక్క లేనంత ఐశ్వర్యం పాప్తించును. అట్టి మహాభాగ్యములు కలుగజేసే కుబేరుణ్ని, యక్షిణిని సేవించని వాళ్ళు దరిద్రులే కదా! కావున తాముకూడ ఆ ఇరువురిని సేవించి సమస్త సంపదలు బడసి సుఖంగా ఉండండి!' అని తెలియజేసెను.


శ్రీ శంకరాచార్యులు కుబేరభక్తుల ప్రభావాలు ఆలకించి, ‘కుబేర భక్తు లారా! మీరాడిన మాటలకు ఆధారములు లేవే! ధనమునకు అధిపతి కుబేరుడైనా, మరి యొకడైనా ఆ విషయమటుండ నిండు ధనంతో తృప్తిపడు వాడెవడు?ఆశకు అంతమున్నదా? ఆశ దినదినాభివృద్ధి నొందు స్వభావం గలది. ధనమున్న వానికి లోభత్వము సహజంగా ఉండునదే! అట్టి పిసిని గొట్టు వానికి ధర్మబుద్ధి అసలే ఉండదు కదా! కనుక ధనమునకు మోక్షమునకు దూరము హెచ్చు. పైగా ధనము నకు శాశ్వతమైన చంచలత్వముంది. అది ఒకచోట స్థిరంగా ఎప్పుడూ ఉండలేదు. చెప్పకుండ, తెలియ కుండ తప్పుకొనును. ధనము అనేక అనర్థ ములకు హేతువు. పూర్వ జన్మలో చేసి కొనిన సుకృతం కొలది ధనవంతులగుచున్నారే గాని, ఈ జన్మలో చేయుచున్న సుకృతం వల్ల ఈ జన్మలో ధనికులు కాలేరు.


బ్రహ్మగర్భంలో బంగార మున్నది. అందువలన హిరణ్యగర్భుడన్న సార్థకనామం కలిగిన దాయనకు. లక్ష్మి సకల సంపదలకు పుట్టినిల్లు. ఆమె విష్ణుమూర్తి ఇల్లాలు. బంగారముతో కూడి యున్నవాడు ఈశ్వరుడు. బంగారు మేరువు పర్వతం మీదనే ఉన్నవాడు దేవేంద్రుడు. ఆలాటి వాళ్ళందరు కుబేరుని ధనంతో బ్రతుకుతున్నా రనడం నింద తప్ప వేరుగాదు. బ్రహ్మాది దేవతలందరి అను గ్రహంతో కుబేరుడు కుబేరుడై నాడనిన ఎంతో సమంజసముగ నుండును. కుబేరోపాస నలను  విడనాడి ధర్మములను ఆచరిం చుడు' అని తెలియ చెప్పారు.


దేశికేంద్రులు వచించిన సత్యమును గ్రహించి కుబేర ఉపాసనలను కట్టిపెట్టి శ్రీ శంకర భక్తులై, పంచపూజాది సత్కర్మ నిరతులై, జ్ఞానార్జన తత్పరులై అద్వైతమతమును స్వీకరించారు.


*దేవేంద్ర భక్తులు:*


ఒక దేవేంద్రభక్తుడు లేచి, 'యతీశ్వరా! నమస్కారములు! లోకాధీశుడు, సృష్టిస్థితి లయకారకుడు తిమూర్త్యాత్మక మైన వాడు, బ్రహ్మాది శబ్దము లతో పిలువబడువాడు, దేవతల చేతను, యక్షులచేతను, గంధర్వుల చేతను నిరంతరం సేవింప బడుచుండువాడు మా దేవేంద్రుడై యున్నాడు.అదియును గాక ఆయన సర్వేశ్వరుడని, సర్వదాత యని శ్రుతులు తెలుపు చున్నవి. వామనుడు  ఆతనికి సోదరుడై యున్నాడు. అమృత పానమే ఆయన కాహారము. అట్టి దేవ దేవుడైన దేవేంద్రుడు అమరనగరంలో వాసం చేస్తూ స్వపరిపాలకుడై ప్రకాశించు చున్నాడు.


ఆయనే సర్వాంత ర్యామి.


దుష్టులను శిక్షించుటకు, శిష్టులను రక్షించుటకు సర్వ సమర్థుడై యున్నాడు.  అలాటి దేవదేవుడైన దేవేంద్రుని త్రికరణ శుద్ధిగా సేవిస్తున్నాము. కనుక తాము కూడ మాలాగే దేవేంద్రుని ఉపాసించండి!' అని అన్నాడు.


దేవేంద్ర భక్తుడు చెప్పిన దంతయు శ్రద్ధతో శ్రీ శంకరా చార్యులు విని, ‘దేవేంద్ర భక్తులారా! బ్రహ్మ, పరబ్రహ్మ మొదలయిన శబ్దముల వలెనే ఇంద్రశబ్దము గూడ సచ్చిదానంద స్వరూపమునకే చెందు చున్నది. అంతియ గాని వజ్రాయుధధారియైన దేవేంద్రుడే పరమాత్మ యని చెప్పరాదు. 'సదేవ' మొదలైన వేదవాక్యములు పర మాత్మకే చెందుచున్నవి. బ్రహ్మ, విష్ణు మహేశ్వ రులు ముగ్గురు పర బ్రహ్మమునుండియేఉద్భవించారు. బ్రహ్మ నుండి ఇంద్రుడు, యముడు మొదలైన వారు ఉద్భవించారు. అట్టితరి దేవేంద్రుడు సృష్టికి కారణ మనుట పొసగునది కాదు. దేవేంద్రుణ్ని 'సర్వదాత' అనుచుంటివి. లోకంలో దానంచేయుట యందు ఒకకరిని మించినవారు మరియొకరు ఉందురు. అట్లు మించిన వానిని 'సర్వదాత' అనవచ్చు. 

దాతృత్వంలో దేవేంద్రు నకు గొప్ప ఉంటే ఉండు గాక! అంత మాత్రంచేత అతనిని పరమాత్మ అనుట అవివేక మగును. సర్వదాత పరమాత్మ ఒక్కడే. ఇతరుల కా యోగ్యతలేదు. బ్రహ్మ కాలంలో పదియారవ వంతు ఇంద్రునకు గలదు. కనుక మీరు ఉపాసించు దేవేంద్రుడు బ్రహ్మకన్న ఎన్నిరెట్లు తక్కువగా నుండెనో యోజించుకొనుడు.' అని కచ్చితముగ వక్కాణించారు.


అట్లు శ్రీ ఆచార్యస్వామి బోధించుటతో ఇంద్ర భక్తు లందరుసంతసించి తమ మతమునకు స్వస్తి చెప్పుకొని, శ్రీ శంకరులకు సమస్కార ములర్పించి, పంచాయ తనపూజ ప్రారంభించి, వేదవిహితమైన కర్మ లాచరించుచు శ్రీశంకరు ల యందు భక్తికలిగి శిష్యులయ్యారు. తరువాతి మజిలీ యమప్రస్థపురము.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 37 వ భాగముసమాప్తము*

కామెంట్‌లు లేవు: