7, అక్టోబర్ 2024, సోమవారం

38. " మహాదర్శనము

 38. " మహాదర్శనము "--ముప్పై ఎనిమిదవ భాగము--సర్వజ్ఞుడు 1


38. ముప్పై ఎనిమిదవ భాగము--   సర్వజ్ఞుడు-1



" ప్రశ్నయైతే బాగానే ఉంది , కానీ యాజ్ఞవల్క్యా , వెనకా ముందూ చూడకయే అడిగిన ప్రశ్నకు నేనేమని ఉత్తరమిచ్చేది ? " 


        యాజ్ఞవల్క్యునికి అయోమయముతో తబ్బిబ్బు అయినది . మిగిలిన వారిని ఒక్క ప్రశ్నతో పల్టీలు కొట్టించుతున్న యాజ్ఞవల్క్యుడు ఇప్పుడు తానే పల్టీ కొట్టునట్లాయెను . ముఖము తనలోని క్షుబ్ధతను  చూపుచుండగా అడిగినాడు . " తమరు చెప్పినది అర్థము కాలేదు ."  


       " నువ్వు రేపు , అనగా ఇంక కొన్ని సంవత్సరములలో మహా విద్వాంసులతో పోరాడుటకు నిలువవలసిన వాడివి . అప్పుడు ప్రశ్న వేస్తే ఎలా ఉండవలెనో తెలుసా ? నువ్వు ముష్ఠి తో కొట్టితే , నీ సర్వ సామర్థ్యమునూ దానిలో ఉపయోగించునట్లు ఉండవలెను . ప్రశ్న వేస్తే ఎదుటివాడిని నిరుత్తరుడిని చేసి నీటిలోకి తోసినట్లు ఉండవలెను , నీట పడ్డ వాడు , మొదట తనను కాపాడుకొని , అనంతరము తనను తోసిన వాడి వైపుకు తిరుగవలెను కదా ? అలాకాక, సిద్ధుడై నిలచు ఉన్నవాడిని తోసినట్లు కారాదు . ఈ చిన్నది , ఈ పెద్దది అనునది ఎలా అనికదా , నీ ప్రశ్న ? నీ ప్రశ్నలోనే ఉత్తరమున్నది . చూసుకో , చిన్నది , పెద్దది అను భేదము ఎందులో ?  జాతిలోనా , పరిమాణములోనా ? "


యాజ్ఞవల్క్యుడు ఆలోచించినాడు . ఒక ఘడియ యైన తర్వాత , " ఉన్న భేదం అంతా పరిమాణము లోనే తప్ప , జాతిలో కాదు . "


        " నేను కూడా అదే చెప్పేది . నీ చేతిలోనున్న బీజమూ , దానినిచ్చిన చెట్టుకు కారణమైన బీజమూ ఒకటే జాతి యంటే నీకెందుకు స్ఫురించలేదు , తెలుసా ? ఇంద్రియాతీతమైన విషయమును ఇంద్రియములతో కొలుచుటకు సిద్ధమైనావు ! ఇప్పుడు ’ కృత్వా చింత ’ చేయి . ( అలాగయిన , ఇలాగ కావచ్చును అని ఒప్పుకొనుట కృత్వా చింత .) ఇంద్రియములు బహిర్ముఖములు . నేను , నేను యను చేతనమును ఏ ఇంద్రియము చేత చూస్తావు ? కఠము ( కఠోపనిషత్తు ) లో చెప్పినట్లు ఆ ప్రత్యగాత్మను చూచుటకు ఆవృత్త చక్షువు కావలెను . అదయినంత మాత్రాన చాలదు . ధీరుడు కూడా అయి ఉండవలెను . అప్పుడు  ఆ ’ నేను ’ కనబడును.  అది ఇంద్రియ వృత్తియా ?  "


" కాదు " 


" సరే , నువ్వు విషయమును గ్రహించినావు . కాబట్టి , ఆవృత్త చక్షువూ , ధీరుడూ అయినవాడు సాక్షాత్కరించుకొను స్థితిని బట్టి చెప్పిన మాటను నువ్వు ఎక్కడో నిలచి ప్రశ్నిస్తే తప్పు కాకున్నా , ఏమని ఉత్తరమివ్వ వలెను ? "  


" ఔను , ప్రశ్నలోనే తప్పుంది " 


      " అలాగనవద్దు . గెలుచుటకే పుట్టిన వాడి నోటిలో ఓడిపోతిని అన్న మాట రాకూడదు . కాబట్టి ప్రశ్న తప్పు అనవద్దు , వేరే దృష్టితో చూడవలసినది అని , ఆ దారిని వదలి ఈ దారిని పట్టుకో "


" తమ వంటి వైచక్షణ్యము వచ్చిన తర్వాతే కదా , ఆ మాట ? "


      " మరలా నువ్వు అదే తప్పు చెయ్య వద్దు . చెట్టును ఆశ్రయించిన తీగ ఎంత ఎత్తుకు వెళ్ళ వచ్చును అంటే , తాను ఆశ్రయించిన చెట్టు ఎత్తు వరకూ అన్నట్లే , అగ్ని దేవుడూ , ప్రాణదేవుల ఉపాసకుడవైన నువ్వు  కూడా వారివలె విశ్వంభరుడవు కావలెను . ఇప్పుడు చేస్తున్న ఆదిత్యోపాసనము పూర్తియైన తర్వాత , ఈ విశ్వమును దాటి వెళ్ళవలెనంటే , నువ్వు ఈ దేహముతోనే వెళ్ళెదవా ? " 


" లేదు , ఏమైననూ ఈ దేహము పంచభూతములతో ఏర్పడినది .  ఈ భూతముల నుండీ బయటికి వెళ్ళినపుడే కదా , విశ్వమును దాటేది ? "


" ఇంకో రహస్యము , యాజ్ఞవల్క్యా , ఈ పంచ భూతములన్నీ ఒకదాని నుండే కదా వచ్చినవి ? అంటే , ఆత్మనుండీ కదా ? "


" ఔను , ఆత్మనః ఆకాశస్సంభూతః " 


" ఇక్కడ ఒక ఘడియ నిలచి చూడు , ఆ తరువాత ముందుకు వెళదాము . ఆకాశమంటే ఏమిటి ? దానిని చూపించ గలవా ? "


        యాజ్ఞవల్క్యుడు ఆలోచించినాడు : " ఆకాశమంటే ఏమి ? వెలుగు కన్నా సూక్ష్మమై , వాయువుకు అవకాశమును ఇవ్వవలెనంటే , అది ఎంత తేటగా ఉండవలెను ? అటువంటి దానిని చూపుట ఎలా ? శాస్త్రము , ’ శబ్ద గుణకమాకాశం ’ అంటున్నది . కేవలము శబ్ద గుణము మాత్రమే ఉన్నదానిని , తేజో గ్రాహియైన చక్షువు కానీ , స్పర్శ గ్రాహియైన ’ త్వక్కు ’  కానీ , సాక్షాత్కరించుకొనుట యెలా ? అవి రెండూ వద్దు , శబ్ద గ్రాహియైన శ్రోత్రమైనా గ్రహించనీ అంటే , శ్రోత్రేంద్రియము నకు దొరకు శబ్దములకు ఒక్కొక్క రూపముంది , పరిమితి ఉంది.  అలాగైతే ఆకాశము అగ్రాహ్యమా ? "


యాజ్ఞవల్క్యుని సందేహము తెలుసుకొని ఆలాపిని అన్నది , " చూచితివా యాజ్ఞవల్క్యా , ఆకాశమును చూపించుట ఎంత కష్టమో తెలిసిందా ? పోనీ , ఆకాశము నుండీ సంభవించిన వాయువును , వాయువు నుండీ సంభవించిన తేజస్సునూ , దానినుండీ సంభవించిన జలమునూ , దానితో కలిగిన పృథ్వినీ అంటే , ఈ పంచభూతములలో ఒకదానినైననూ సాక్షాత్కరించి ఇవ్వగలవా ?  పోనీ , నువ్వైనా సాక్షాత్కరించు  కున్నావా ? " 


        యాజ్ఞవల్క్యుడు మరలా ఆలోచించినాడు . ఇప్పటికి అతడికి తెలియదు అనునది తెలిసింది . వట్టి ప్రశ్నలతో లాభములేదు అని నిర్ధారించుకొని , అతడన్నాడు , " ఈ దినము మాతా ఆచార్యాణి సరస్వతి వలె పలుకుచున్నారు . వట్టి ప్రశ్నలు వేసి నా అజ్ఞానమును ప్రదర్శించుట బదులు , విషయమును చెప్పి , నన్ను జ్ఞానిగా చేయు గాక " 


      ఆలాపిని ఆ మాట విని గంభీరురాలైనది : అప్రసన్నము కాకుండా , తన మాటను కొనసాగించినది . " వీటన్నిటినీ ఒక్కొక్కటిగా సాక్షాత్కరించుకొని చూచి కృతార్థుడవు కమ్ము అని నేను ఈ ప్రశ్నలను అడిగినాను . ఇప్పుడు సిద్ధాంతమును చెప్పెదను వినుము . ఈ పంచ భూతములకు ఒక్కొక్క దానికీ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది . ఇవన్నీ తండ్రీ కొడుకులవలె అయిననూ , తండ్రి వేరే , కొడుకు వేరే అనునట్లే ఇవి కూడా .  సాంఖ్యము , దీనినంతటినీ ప్రకృతి యనీ , దీని పట్టులో  చిక్కిన పురుషుడు , దీని పట్టు నుండీ విడిపించు కొనుటయే ముక్తి యనీ అన్నది . ముక్తిని పొందిన కొందరు పురుషులుంటే , వారేమవుతారు అనుదానిని చెప్పలేదు . ఇప్పుడు నువ్వు చెప్పు , అయితే ’ కృత్వా చింత ’ తో చెప్పు అన్నది మరవవద్దు . ఈ పంచభూతాత్మకములై గుణత్రయ విశిష్టురాలైన ప్రకృతి సంసర్గమును వదలిన వారు ఎలా ఉండవలెను ? "


      " ఔను , ప్రకృతస్థుడైన పురుషుడు ఎలా ఉన్ననూ , ప్రకృతి నుండీ విమోచనమును పొందిన పురుషుడు  తన పూర్వ స్థితిని పొందినవాడై యుండవలెను . సందేహము లేదు ."


       " కారాగారములో ఉన్న పురుషుడు తనను బంధించియున్న గది యొక్క నాలుగు గోడల మధ్యలో  తప్ప , ఇంకెక్కడా తిరుగుటకు లేదు . అతడే , అక్కడి నుండీ ముక్తుడై బయటికి వస్తే ఎక్కడికైనా పోవచ్చును కదా ? "


" ఔను "


      " బంధ ముక్తుడైన వాడి స్థితి వలెనే , ప్రకృతి ముక్తుడైన వాడి స్థితి అనగానే మనము ఏమని చెప్పవలెను ? మనకు తెలిసినది ప్రకృతి గ్రస్థుడైన వాడి స్థితి మాత్రమే . ప్రకృతి ముక్తుడైన వాడి స్థితి దానికి ప్రతిగా ఉండవలెను కదా ? "


" ఔను "


" ఏదీ , ఇప్పుడు ద్వాసుపర్ణశృతి ని చెప్పు "


       " రెండు పక్షులు ముద్దైన గూటిలో ఉన్నాయి . రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయి . రెంటికీ ఒకటే పేరు . ఒకే చెట్టులో ఉంటాయి . వాటిలో ఒకటి రుచియైన పళ్ళను తింటూన్నది . ఇంకొకటి ఏమీ తినకుండా చూస్తూ కూచుంది . " 


" తర్వాత ? "


     " పండు తినే కార్యములో మగ్నమైన పక్షి పరవశమై , మోహము చెంది శోకిస్తుంటే . పండు తినని పక్షి ఈశ్వరుడైనది. ఆ పక్షి , ఈ పక్షిని చూచి ( సావాసము వలన )  తానూ దానివలెనే అగును . "


" ఇక్కడే ఉంది రహస్యము , యాజ్ఞవల్క్యా , భోగమగ్నుడై ఉండుట అంటే , పరవశమై , మోహ శోకముల చేత చిన్నవాడగుట. అది లేక పోతే ? "


" ఆ పక్షి , ఈ పక్షి వలెనే అగును . "


" అలాగవడమంటే , అప్పుడు , భేదమేమైపోయింది ?  అవి విజాతి పక్షులైతే ఒక పక్షి ఇంకొకదాని వలెనే అగుటకు సాధ్యమయ్యేదా ? "


" లేదు "


        " దీన్ని ఒకవైపు ఉంచుకొని , రసవాదమును చూడు . అది చెప్పేది ఇంతే , ’ ముట్టుకుంటే చేతులు నల్లబారు సీసమును , మెరుస్తున్న బంగారముగా చేయవచ్చును ’ అని కదా ? 


      " అదెలాగనగా ,  సీసములో సప్త కంచుక దోషమున్నది . దానిలో మూడు పోతే తామ్రమగును . దానిలో కూడా ఒకటి పోతే వెండి . ఇంకొక కంచుకము పోతే బంగారము . ఆ చివరి కంచుకమూ పోతే అది సిద్ధరసము . సిద్ధ రసము తనలో పడ్డ లోహములన్నిటినీ భృంగముగా చేయును . భృంగము తన అరవై నాలుగు రెట్ల తామ్రమును బంగారము చేయును . ఇప్పుడు చెప్పు , సిద్ధరసమునకు సప్త కంచుక దోషము ప్రాప్తమైతే ఏమికావలెను ? " 


" సీసము కావలెను "


" సీసపు సప్త కంచుక దోషము పోతే ? ’


" అప్పుడది సిద్ధరసము కాకున్ననూ , భృంగమైనా కావలెను . "


" ఇదంతా లోహపు విషయము . ఈ సాధన ప్రక్రియను జీవుడికి జోడించి చెప్పు " 



Janardhana Sharma

కామెంట్‌లు లేవు: