*తిరుమల సర్వస్వం 123-*
*తాళ్ళపాక అన్నమాచార్యుడు 11*
*కార్యాలయ అధికారి నిర్వాకం*
విధివశాత్తూ, 1931వ సంవత్సరంలో మలయప్పస్వామి వారికి అప్పటి గద్వాల మహారాణి వారు వజ్రకిరీటం తయారు చేయించాలని సంకల్పించింది. ఆ కిరీటం తయారీ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చెన్నపట్టణానికి తరలి వెళ్లారు. ఆ వ్యవధిలో ముద్రణా కార్యాలయాన్ని వేరే ప్రదేశానికి తరలించాల్సి రావడం వల్ల; దేవస్థానానికి చెందిన ముద్రణాలయ అధికారి ఒకరు, శాస్త్రిగారు మూడు టేకు పెట్టెలలో పదిలపరచిన వ్రాతప్రతులను చిత్తు కాగితాలుగా భ్రమించి, వాటిని తగులబెట్టించి, ఖాళీ పెట్టెలను కొత్త కార్యాలయానికి క్షేమంగా చేరవేశాడు. అలా శాస్త్రిగారి శ్రమ చాలా భాగం బూడిదలో పోసిన పన్నీరై పోగా, వారు అంతకుముందే పొందుపరచిన. మూడు సంపుటాలలో గల అతి కొద్ది సంకీర్తనలు మాత్రం మనకు మిగిలాయి.
భాండాగారంలో బయటపడ్డ రాగిరేకుల లోని రకాలను, ఈ కీర్తనలను వెలుగులోకి తీసుకురావటం కోసం ఇంకెందరో మహానుభావులు చేసినట్టి అవిరళ కృషిని, తి.తి.దే. వారు చేపట్టిన *"అన్నమాచార్య ప్రాజెక్టు"* అనబడే బృహత్తర కార్యక్రమం గురించి సవివరంగా తెలుసుకుందాం.
అన్నమాచార్యుని రచనలను వెలుగులోకి తెచ్చి, ఆధ్యాత్మిక-ధార్మిక-నైతిక విలువలతో కూడిన ఆ అమూల్యమైన సాహిత్యసంపదను తెలుగు జాతికి అందించిన వారందరినీ తలచు కోవడం, తెలుగువారిగా మనందరి కర్తవ్యం! ఒక్కొక్కరు చేసిన కృషి సంక్షింప్తంగా చెప్పుకున్నా ఒక్కో ఉదంతమవుతుంది. "చంద్రునికో నూలుపోగు" అన్న చందంలో, అతి క్లుప్తంగా, వారందరినీ కొన్ని వాక్యాల్లో పరిచయం చేయడానికే ఈ చిన్ని ప్రయత్నం.
*పండిత విజయ రాఘవాచార్యులు*
సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు తయారుచేసిన కీర్తనల వ్రాతప్రతులు టేకు పెట్టెలలో భద్రపరచినంత వరకు పూర్తిగా భస్మీపటలమై పోగా, వారు ఇతరత్రా ప్రదేశాల్లో పదిలపరచి నటువంటి అతికొద్ది వ్రాతప్రతులను మాత్రం పండిత విజయ రాఘవాచార్యులు గారు ప్రచురించి వెలుగులోకి తెచ్చారు.
*శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు*
ఆ తర్వాత 1945వ సంవత్సరంలో, తి.తి.దే. వారి ప్రాచ్యకళాశాలలో తెలుగుభాషా విభాగానికి అధ్యక్షునిగా ఉన్న శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి గారు, సుబ్రహ్మణ్యశాస్త్రి గారు చేపట్టిన మహాయజ్ఞాన్ని పునఃప్రారంభించి, రాగి రేకుల యందు నిక్షిప్తమై ఉన్న వేలాది కీర్తనలను జనబాహుళ్యం లోనికి తీసుకు వెళ్ళడంలో సఫలీకృతు లయ్యారు. అప్పటినుండి అన్నమాచార్య కీర్తనలు తిరుమల తిరుపతి దాటుకొని, ఆంధ్రదేశ మంతటా మాత్రమే కాకుండా, ఖండఖండాంతరాలకు విస్తరించి అన్నమయ్య ప్రతిభను, తెలుగునేల సౌభాగ్యాన్ని ప్రపంచమంతా చాటిచెప్పాయి.
ప్రభాకరశాస్త్రి గారు రాగిరేకుల నన్నింటిని రచయితల వారిగా వర్గీకరించి, కీర్తనలను రెండు సంపుటాలుగా ప్రచురించారు. *"అన్నమాచార్య చరిత్ర - పీఠిక"* అనే గ్రంథాన్ని రచించి, అప్పటివరకు మరుగున పడి ఉన్న అన్నమాచార్యుని జీవితచరిత్రను ప్రాభవాన్ని వెలుగులోకి తెచ్చారు.
*శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారు*
ఆ తర్వాత 1951వ సంవత్సరంలో, రాగిరేకుల లోని మరికొన్ని కీర్తనలను పఠన యోగ్యమైన ఈ నాటి తెలుగుభాష లోకి అనువదించే బృహత్తర కార్యాన్ని తి.తి.దే. వారు రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ గారికి అప్పగించారు. వారు వేలాది కీర్తనలను దాదాపు 20 సంపుటాలుగా ప్రచురించి, వాటిలో 108 కీర్తనలకు స్వరాలు సమకూర్చి, వాటిని వినసొంపుగా తీర్చిదిద్దారు. ఇంతే కాకుండా , అన్నమయ్య సాహిత్యంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని కన్నడ, తమిళ, సంస్కృత శబ్దాలను అందుబాటులో ఉన్న నిఘంటువుల సహాయంతో ఆంద్రీకరించారు. అన్నమాచార్యుడు తన
ఆ కీర్తనలను రాగయుక్తం చేసిన ముప్ఫయ్యొక్క రాగాలను కూడా వెలుగులోనికి తెచ్చి తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. రాగయుక్తంగా పాడగలిగే సంగీతపరిజ్ఞానం లేని వారు, ఆ కీర్తనలను కేవలం పద్యాలుగా చదువుకొని; అందులోని చమత్కారాలను, సందేశాలను, సూక్తులను అర్థం చేసుకోగలిగినా చాలుననే లక్ష్యంతో రెండు దశాబ్దాలపాటు వారీ మహా యజ్ఞాన్ని చేపట్టారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి