21, జనవరి 2025, మంగళవారం

సత్యం--ఋతం

 సత్యం--ఋతం 

సత్యం అంటే అందరికీ తెలుసు,  కానీ మనకు తెలిసిన సత్యం వేరు, వేదంలో ఆ పదానికి చెప్పిన అర్థం వేరు. 

  ఋతం అంటే ఏమిటి?  ఋతం అనే పదం ఒక్క వేదం లో మాత్రమే వస్తుంది.  కానీ దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది.

సత్యం, ధర్మం లకు ఎంత ప్రాశస్త్యత ఉందో, ఋతానికీ అంతే ప్రాశస్త్యత ఉంది. 

శాస్త్రములలో విధించిన కర్మలను మన బుద్ధి శక్తితో బాగా విశ్లేషించి, అంతటితో ఆగకుండా, ఆయా కర్మలు మహాత్ములు ఎవరైనా చేశారా అన్నది వివేచించి పోల్చి చూసి, ’ ఇది చేయవచ్చును,  లేదా.. ఇది చేయకూడదు ’ అని నిశ్చయించుకొనుటే ఋతం 

ఆ నిశ్చయాన్ని వాక్, కర్మేంద్రియాలతో ఆచరణలో పెట్టడాన్ని సత్యం అంటారు .

ఈ ఋతము, సత్యము, స్వాధ్యాయము, ప్రవచనము--[ ఇవి కాక, తపము, దమము, శమము, లాంటి మరికొన్ని ఉన్నాయి. వాటిని ఇక్కడ చేర్చలేదు ]  ఇవన్నీ కూడా తప్పక ఆచరించవలసినవి అని ఉపనిషత్ చెపుతుంది. ఎందుకు చెపుతుంది అంటే, బ్రహ్మము గూర్చిన జ్ఞానము,  ఉపాసనల వల్ల బ్రహ్మప్రాప్తి కలుగుచున్నపుడు మిగతావాటిని ఉపేక్షిస్తారేమో అని  అలా ఉపేక్షించకూడదు అని చెపుతుంది. 

ఇప్పుడు పైవాటిలో " ప్రవచనము " ఒక్క దాన్ని మాత్రమే తీసుకుందాము. 


*ప్రవచనము కూడా బ్రహ్మజ్ఞాని ముఖ్య కర్తవ్యాలలో ఒకటి. అంటే ప్రవచనము చెప్పేవాడు జ్ఞాని అయి ఉండాలి. అది ప్రథమ నియమము. అదికాక, ఇతర అనుష్ఠానములు చక్కగా చేస్తుండాలి. అతడే ప్రవచనానికి అర్హుడు.  కాబట్టి, వేదాభ్యాసము, స్వాధ్యాయము, ఋతము, తపస్సు, సత్యము ఇవన్నీ ఆచరిస్తున్నవాడే ప్రవచనాలు చెప్పుటకు అర్హుడు.*  


ఆ ప్రవచనాల్లో చెప్పే విషయాలు పై కర్మలద్వారా ఆచరించబడి చక్కగా తెలుసుకొని ఉండాలి. 

ఋతం అంటే, ఏది కర్తవ్యము, ఏది కాదు అన్న జ్ఞానము కదా... ఇదే కదా ప్రవచనాల్లో చెప్పేది?   ఈ జ్ఞానమెలా వస్తుంది?  ఏది చేస్తే శ్రేయస్సు కలుగుతుందో--- అది మంచిది. అదే కర్తవ్యము. ఏది చేస్తే మొదట సుఖంగా అనిపించినా, తర్వాత క్లేశాన్ని కలిగిస్తుందో-- అది చేయరానిది. దీనికొక పేరుంది. అదే ప్రేయస్సు. 

శ్రేయస్సు--ప్రేయస్సు అని రెండున్నాయని తెలిసింది కదా

శ్రేయస్సంటే మంచిది, ఎప్పటికీ శుభాన్ని కలిగించేది. ప్రేయస్సంటే మంచిది కాదు, మొదట సుఖాన్ని ఇచ్చినా తర్వాత అశుభాన్ని, కష్టాన్ని, క్లేశాన్ని కలిగించేది. 

ఈ శ్రేయస్సు--ప్రేయస్సు లను గురించి నేను అనువాదం చేసిన " మహా దర్శనము " చదివినవారికి విదితమే. 

శ్రేయస్సు అనేది మనకు నచ్చకపోవచ్చు. కానీ చివరికి శుభాన్నే కలిగిస్తుంది

ప్రేయస్సు మనకు బాగా నచ్చుతుంది.. కానీ చివరికి దుఃఖాన్ని మిగిలిస్తుంది.

ఇదంతా తెలిసినవాడే సరైన ప్రవచనకారుడు. ఋతాన్ని, స్వాధ్యాయాన్ని, ప్రవచనాన్ని అజాగ్రత్త చేయకూడదు అని కూడా వేదము చెబుతుంది.  ఇతర లాభాలు,  ప్రయోజనాల కోసం మోహము చెంది, ఋతమేది, సత్యమేది, శ్రేయస్సేది, ప్రేయస్సేది అని పట్టించుకోకుండా స్వంతలాభం కోసం అశాస్త్రీయమైన దాన్ని చెప్పేవాడికి అమిత దుఃఖం మిగులుతుంది. 

// జై జగదంబే //

కామెంట్‌లు లేవు: