21, జనవరి 2025, మంగళవారం

మహాభారతం

 మహాభారతం - శాంతి పర్వం 🙏

                   ఐదవ భాగం 

 ఎందరు ఎంత చెప్పినా ధర్మరాజు మనసు మారలేదు. అప్పుడు వ్యాసుడు ధర్మరాజు తో " ధర్మరాజా ! అర్జునుడి మాటలు అక్షరసత్యాలు. అన్ని ధర్మములలోకి గృహస్థధర్మం గొప్పది. మానవులకే కాక పశుపక్ష్యాదులకు అది ధర్మమే. క్షత్రియులకు గృహస్థధర్మము తప్ప మిగిలిన తపస్సు, ఇంద్రియనిగ్రహం, బ్రహ్మచర్యం ఆచరణ యోగ్యం కాదు. ధనం సంపాదించకుండా ఉండటం, ప్రజారక్షణ మరవడం, యుద్ధం చేయకుండా పారిపోవడం క్షత్రియులకు మహాపాతకం. ఇది వేదవాక్కు కనుక వేదమార్గాన నడిచి ఈ భూమిని జనరంజకంగా పాలించు. ధర్మజా ! నీవు గురువుల వద్ద విద్యను అభ్యసించి ధర్మసూక్ష్మాలను చక్కగా ఎరిగిన వాడివి నీవు వర్ణాశ్రమ ధర్మములు తెలియని వాడివా ! భూమిని పాలించే రాజుకు దండనీతి తప్ప వేరు మార్గం లేదు. నీకు సద్యుముడు ఎలా దండనీతిని అమలు పరచి దుష్టులను శిక్షించి చివరకు మోక్షం పొందాడో తెలియాలి. ఆ కథ నీకు వివరిస్తాను.


పూర్వం బహుదానదీ తీరంలో లిఖితుడు, శంఖుడు అనే ఇద్దరు బ్రాహ్మణ సహోదరులు ఉన్నారు. ఇద్దరూ ధర్మతత్పరులు. వారి ఆశ్రమంలో కాయలు, పండ్లు సమృద్ధిగా ఇచ్చే వృక్షాలు అనేకం ఉన్నాయి. ఒక రోజు శంఖుడు ఇంట్లో లేనప్పుడు లిఖితుడు ఆశ్రమంలో ఉన్న చెట్ల నుండి బాగా పండిన పండ్లలను కోసి తింటున్నాడు. అప్పుడు శంఖుడు అక్కడకు వచ్చి " ఈ పండ్లు ఎక్కడివి " అని అడిగాడు. లిఖితుడు " మీ చెట్లో కోసుకున్నాను " అన్నాడు. శంఖుడు " నా అనుమతి లేకుండా నా చెట్టు నుండి పండ్లు కోయవచ్చా ! అది దొంగతనం కాదా ! నీకు పాపం అంటింది. రాజదండనతో కాని ఆపాపం పోదు " అన్నాడు. వెంటనే లిఖితుడు రాజు వద్దకు వెళ్ళి వార్తాహరుల ద్వారా తన రాకను తెలియజేసి రాజును మంత్రులతో వెలుపలకు రప్పించాడు . సుద్యుమ్నుడు " విప్రోత్తమా ! మీరు ఇక్కడకు వచ్చిన కారణమేమి ? ఆజ్ఞాపించిన మీరు చెప్పినట్లు చేస్తాను " అని అన్నాడు. అందుకు లిఖితుడు " రాజా ! మీరు మాటతప్పక నేను చెప్పినట్లు చేయాలి. నేను నా సోదరుడి ఆశ్రమం లోని పండ్లను దొంగిలించాను. దానికి మీరు తగిన శిక్ష విధించి నన్ను పాప విముక్తిడిని చెయ్యండి " అని ప్రార్థించాడు. ఆమాటలకు చాలాబాధను అనుభవించిన రాజు ఇక తప్పదనుకుని లిఖితుడి చేతులు నరకమని దండన విధించాడు. లిఖితుడు రాజుకు దీవించి వెళ్ళాడు. అతడికి దండన అమలుజరిగింది. లిఖితుడు శంఖుడి వద్దకు వెళ్ళి తన తెగినచేతులు చూపి " నేను దండన అనుభవించాను " అన్నాడు. శంఖుడు సంతోషించి " లిఖితా ! ఎవరూ ధర్మమార్గం, తప్పకుడదు. నీ జీవితం ధన్యమైంది. నీవు బహుదానదికి వెళ్ళి దేవతర్పణములు, పితృతర్పణములు విడిచి పెట్టు. లిఖితా ! కల్లుత్రాగడం, గురుపత్నిని కామించడం, బ్రాహ్మణుల సొత్తు అపహరించడం ఇవి మహా పాతకములు. ఈ మహా పాతకములలో ఏ ఒక్కటి ఎవరు చేసినా అది బ్రాహమణుడైనా దండనార్హుడే. రాజు చేత దండింపబడిన వారు పుణ్యలోకాలకు పోతాడు. నీవు కూడా రాజదండన అనుభవించావు కనుక పుణ్యలోకాలకు పోతావు. అందుకు నీవు సంతోషించు " అన్నాడు. వెంటనే లిఖితుడు బహుదా నదికి వెళ్ళి తెగిన చేతులతో దేవతర్పణములు పితృతర్పణములు విడిచాడు. అతడు ఆశ్చర్యపడేలా అతనికి తిరిగి చేతులు వచ్చాయి. లిఖితుడు ఆనందంగా శంఖుని వద్దకు పరిగెత్తి పోయి శంఖుడికి తన చేతులు చూపాడు. శంఖుడు " ఇందుకు ఆశ్చర్యం ఎందుకు ? ఇది దైవకృప చేత నా తపోమహిమ చేత కలిగింది. నీవు నిర్మల మనస్కుడవు కనుక నీకు దైవానుగ్రహం కలిగింది. నిన్ను దండిచిన సుద్యుమ్న మహారాజు తన పితృదేవతలతో సహా పుణ్యాత్ములైయ్యారు " అన్నాడు.


వ్యాసుడు ఇంకా ధర్మరాజుతో " ధర్మజా ! నీవు కూడా తగిన విధంగా ప్రజారక్షణ కావించుము. నీ తమ్ములు చెప్పిన మాటలు వేదవాక్కు. రాజనీతి దండన చేత తప్ప మరొక విధంగా నిర్వర్తించబడ లేదు. కనుక నీవు శోఖమును వదిలి గొప్పగొప్ప యాగములు, యజ్ఞములు చేసి చక్కగా రాజ్యాన్ని పాలించు. ధర్మనందనా ! నీ తమ్ములు నీ భార్య నీమాట మన్నించి పన్నెండేళ్ళ అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేసి కష్టములు అనుభవించారు. ఇప్పుడు నీవు వారి మాట మన్నించి వారికి సుఖశాంతులు కలుగచెయ్యి. విరాగి అయి అడవులకు వెళ్ళి దేవతలకు పితృదేవతలకు బాధ కలిగించకు. నీకు న్యాయశాసస్త్రం బాగా తెలుసు. ప్రజల మనోభిష్టం తెలుసుకుని శిష్టరక్షణ, దుష్టశిక్షణ చేసి దండనీతిని అమలు పరచే రాజుకు అన్నీ శుభాలే కలుగుతాయి. ప్రజల ఆదాయం నుండి ఆరవ భాగం పన్నుగావసూలు చెయ్యి. ప్రజలన్ము కన్నలబిడ్డల వలె పాలించు. ఇదే మోక్షముకు మార్గం చూపుతుంది. నీ మనసులో ఉన్న భయం సంశయం వదిలి పెట్టు. కాని ధర్మరాజా రాజు అహంకరించి కామ క్రోధవశుడై ప్రజాకంటకంగా పాలిస్తే అతడికి ప్రజలు చేసే పాపంలో నాల్గవభాగం లభిస్తుంది. శత్రువులను నిర్మూలించడం క్షత్రియ ధర్మం, పాపాత్ములైన రాజులతో సంధి చేసుకోవడం దోషం, శత్రువులతో సంధి చేసుకుని తన రాజ్యంలో కొంత భాగం ఇవ్వడం మంచిదికాదు. యుద్ధం చేసి రాజ్యరక్షణ చేయడం క్షత్రియ ధర్మమం. కనుక నీవు యుద్ధం చేసినందుకు చింతింప పని లేదు. దుర్యోధనుడితో సంధి చేసుకోక పోవడం వలన ఈ ఘోర యుద్ధం సంభవించింది అనుకోవడం నీ అవివేకం పూర్వం హయగ్రీవుడనే రాజు యుద్ధములు చేసి శత్రువులను జయించి, దుండగులను శిక్షించి. సన్మార్గులను రక్షించి, యజ్ఞయాగాదులు చేసి, ప్రజారంజకంగా పాలించి తుదకు సద్గతి పొందాడు. కనుక యుద్ధములు రాజులకు కీడు చెయ్యవు. యుద్ధంలో చావడం, చంపడం సహజం కనుక నీవు అనుమానం వదిలి సమర్ధులైన రాజోద్యోగులను నియమించి రాజ్యకార్యములు నిర్వహించుము " అన్నాడు.


ఇన్ని చెప్పినా కలత వీడని ధర్మరాజును చూసి అర్జునుడి గుండెలు రగిలిపోతున్నాయి. కాని మనసులో కోపందాచి నిలబడి ఉన్నాడు. ధర్మరాజు వ్యాసుడితో " ఓ మహర్షీ ! ఈ యుద్ధంలో ఎంతోమంది స్త్రీలు తమభర్తలను, కుమారులను, సోదరులను పోగొట్టుకున్నారు. వారి విలాపములు శోకసంతాపములు నా హృదయానికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో నేను ఈ రాజ్యమును ఎలా ఏలగలను ? " అన్నాడు.


వ్యాసుడు " ధర్మరాజా ! సుఖదుఃఖములు నీ వశంలో ఉన్నట్లు మాట్లాడుతున్నావు. దుఃఖాలు పొమ్మంటే పోవు, సుఖాలు రమ్మంటే రావు, ఈ లోకంలో అనుభవించే సుఖదుఃఖములకు హేతువు వారు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలే. అయినా ఈ సుఖదుఃఖములు శాశ్వతం కాదు. సుఖం వెంట దుఃఖం, దుఃఖం వెంట సుఖం వస్తూపోతూ ఉంటాయి. దుర్మార్గులకైనా కాలం కలిసివస్తే అనంత సుఖాలు ప్రాప్తిస్తాయి. ఎంతటి సుగుణవంతుడికి అయినా కాలం కలిసి రాకున్న సంపద లభించదు. కాలం కలిసి రాకున్న మంత్ర తంత్రములు పని చెయ్యవు. వర్షం, తాపం, చీకటి, వెన్నెల దైవ కల్పితములు. కమలం వికసించండం, చెట్లు పుష్పించుట, కాయలుకాయడం, పండ్లుపండడం ఋతు ధర్మం కాల మహిమ. జననం, వృద్ధిపొందుట, క్షీణించుట, మరణించుట కాల ధర్మమే. వీటి కొరకు నీవు దుఃఖించుట అవివేకం.

                  సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: