21, జనవరి 2025, మంగళవారం

12-09-గీతా మకరందము

 12-09-గీతా మకరందము

          భక్తియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII ఒకవేళ మనస్సు దైవమందు స్థిరముగ నిలవనిచో  అప్పుడేమిచేయవలెనో చెప్పుచున్నారు-


అథ చిత్తం సమాధాతుం 

న శక్నోషి మయి స్థిరమ్ అభ్యాసయోగేన తతో 

మామిచ్ఛాప్తుం ధనంజయ.


తా:- అర్జునా! ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగ నిలుపుటకు నీకు శక్తిలేనిచో అత్తరి అభ్యాసయోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. (అభ్యాసముచే ఆ స్థితిని యెట్లయినను సాధింపుమని భావము).


వ్యాఖ్య- మొదట తెల్చిన సాధన చేయలేనివారికి భగవానుడు మరికొన్ని ప్రత్యామ్నాయపద్ధతులను సూచించుచున్నారు. ఆహా భక్తులపై, సాధకులపై సర్వేశ్వరునకు ఎంతటి కరుణ! మనస్సుచేతనే బంధము, మనస్సుచేతనే మోక్షము జీవునకు కలుగుచున్నవి*. కాబట్టి మోక్షము పొందుటకు ఆ మనస్సు ఏదోవిధముగ అధిష్ఠానమగు పరమాత్మయందు (దైవమందు) లయించియే తీరవలెను. ఇక్కారణముననే గీతాచార్యులు మనస్సు దైవమందు నిలుకడను బొందనిచో అభ్యాసముచే యెట్లయినను దానిని నిలుకడబొందులాగున చేయవలయునని, (అది తప్ప మోక్షమునకు వేరుదారి లేదని) తెలియజేయుచున్నారు. ప్రతివారును ఏదియోవిధముగ తమ మనస్సును బహిర్ముఖముగ పోనీయక, దృశ్యవిషయములపై వ్రాలనీయక, ఆత్మయందు (దైవమునందు) స్థాపన చేయవలెను. ఒకవేళ ప్రారంభస్థితిలో అట్లు మనస్సు ధ్యేయమందు నిలుకడను బొందనిచో అభ్యాసముచే మెల్లమెల్లగా ఆ స్థితిని ఎట్టెనను సాధించియే తీరవలెను. మనస్సు ఆత్మయందు లయించి, ఆత్మరూపమున శేషించుటయే మోక్షము. కావున ఆ స్థితిని ప్రయత్నపూర్వకముగ అభ్యాసము ద్వారా ప్రతివారును సాధించవలెను. "యతో యతో నిశ్చరతి .....(6-26)” అని 6వ అధ్యాయమున భగవానుడు  తెలియజేసినరీతి చపలమనస్సును నెమ్మదిగా వశమొనర్చుకొని ఆత్మయందు (దైవమందు) స్థాపించవలెను. ఇట్టి అభ్యాసమునుగూర్చియే ఈ శ్లోకమందు తెలియజేయబడినది,


అభ్యాసయోగేన - ఈ అభ్యాసమనుయోగము కర్మయోగ, భక్తియోగ, ధ్యానయోగ, జ్ఞానయోగాదులన్నిటితోను కూడియుండవలెను. అన్ని యోగములకును 6వ శ్లోకమున తెలుపబడిన అనన్యయోగము, ఈ శ్లోకమందు తెలుపబడిన ఈ అభ్యాసయోగము ఆవశ్యకమైయున్నది. దీనితో చేరినపుడే తక్కిన యోగములన్నియు అభివృద్ధిని, వికాసమును బొందగలవు.


కొందరు సాధకులు గురువుల యొద్దకు వెళ్ళి" అయ్యా! ధ్యానకాలమున నా మనస్సు దైవమందు స్థిరముగ నిలుచుటలేదే? ఏమి చేయవలెను?" అని యడుగుచుందురు. అందులకు ప్రత్యుత్తరముగ వారు భగవానుడీశ్లోకమున తెలిపినదానినే చెప్పుదురు. "నాయనలారా! మనస్సు నిలువనిచో, అభ్యాసము చేసి యెట్లయినను నిలుచులాగున చేసికొనుడు, వేఱుదారిలేదు" అని వారు బోధించుదురు. మనోనిగ్రహమును గూర్చి 6 వ అధ్యాయమున "అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే" అను వాక్యము ద్వారా భగవానుడీ అభ్యాసమునే నొక్కిచెప్పిరి. కాబట్టి ప్రతివారును తమ మనస్సు ధ్యానకాలమున నిలుకడను బొందనిచో నిరుత్సాహపడక భగవాను డిచట బోధించిన రీతిగ అభ్యాసముచే దానిని ఎట్లయినను నిలుకడబొందునట్లు చేయవలెను. మోక్షమునకు వేరుమార్గములేదు.


ప్ర:- మనస్సును దైవమందు స్థిరముగ నిలుపుడని చెప్పిరే, అట్లు మనస్సు నిలవనిచో ఏమి చేయవలెను?

ఉ:- అభ్యాసముచే ఆ స్థితిని యెట్లయినను సాధించవలెను.

--------------

* మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

{ అమృతబిందూపనిషత్తు - 10)

కామెంట్‌లు లేవు: