21, జనవరి 2025, మంగళవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*భీష్మ పర్వము తృతీయాశ్వాసము*


*262 వ రోజు*


*భీమసేనుని పరాక్రమం*


ఇది చూసిన ధర్మరాజు భీముని చూసి " అర్జునుడు భీష్ముని ఎదుర్కొంటున్నాడు. నీవు వెళ్ళి ద్రోణాదులతో పోరుతున్న ఘటోత్కచుని రక్షించు " అన్నాడు. సుయోధనుడు ఒక అర్ధచంద్రాకార బాణమును ఘటోత్కచునిపై వేసాడు. సింహ నాదం చేసుకుంటూ అక్కడుకు చేరిన భీమసేనుని ధనస్సును సుయోధనుడు ఖండించాడు. మరొక నారాచ బాణమును ప్రయోగించి భీముని వక్షష్తలము మీద కొట్టాడు. ఆ దెబ్బకు భీమసేనుడు దిమ్మెర పోయాడు. అది చూసిన ద్రౌపదీ సుతులు సుయోధనుని ఎదుర్కొన్నాడు. ఇంతలో అభిమన్యుడు, ఘటోత్కచుడు వారికి సాయం వచ్చారు. అందరూ కలిసి సుయోధనునిపై నిశితమైన శరవర్షం కురిపించారు. కృపాచార్యుడు, బాహ్లికుడు, భూరిశ్రవనుడు మొదలైన కురు వీరులు పాండుకుమారులను ఎదుర్కొన్నారు. ఇంతలో భీమసేనుడు తేరుకుని తిరిగి శత్రువుల మీద లంఘించాడు. ద్రోణుడు క్రూర శరములతో భీమసేనుని కొట్టాడు. భీమసేనుడు నారాచబాణముతో ద్రోణుని గుండేకు గురిపెట్టి కొట్టాడు. ఆ బాణముల ధాటికి ద్రోణుడు మూర్చిల్లాడు. తండ్రి అవస్థ చూసిన అశ్వత్థామ, సుయోధనులు తమ బలగంతో వచ్చి భీమసేనుని ఎదుర్కొని శక్తి వంతమైన బాణములు భీమునిపై ప్రయోగించారు. భీముడు రథము నుండి కిందకు దూకి ఆ బాణములను తన గదాయుధంతో చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఇంతలో ద్రోణుడు తేరుకుని వచ్చి భీమునిపై శరపరంపర కురిపించాడు. ఇది గమనించిన అభిమన్యుడు, ఘతోత్కచుడు, ద్రౌపదీ సుతులు భీమునికి సాయంగా వచ్చారు. భీమసేనుని మిత్రుడు నీలుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ వాడి అయిన బాణములు ప్రయోగించి నీలుని తీవ్రంగా గాయపరిచాడు. ఇది చూసిన ఘటోత్కచుడు అశ్వత్థామ మీద శరవర్షం కురిపించాడు. ద్రోణుడు ఘటోత్కచుని క్రూరమైన బాణములతో నిలువెల్లా కొట్టాడు. ఘటోత్కచుడు మాయా యుద్ధం ప్రారంభించాడు. తన అపూర్వ మాయా శక్తితో ద్రోణుడు, సుయోధనుడు, కృపాచార్యుడు మొదలైన వారు తన బాణములకు తీవ్రంగా గాయపడి రక్తం ఓడుతున్నట్లు కౌరవ సేనలకు తెలిసేలా చేసాడు. అది చూసిన కౌరవ సేనలు పారిపోసాగారు. అది చూసిన భీష్ముడు " ఆగండి ఇది అంతా రాక్షస మాయ అందరూ క్షేమంగానే ఉన్నారు అని ఎంత చెప్పినా వినక సేనలు యుద్ధ భూమి విడిచి పారిపోసాగాయి. ఇది చూసిన సుయోధనుడు " తాతా ! మీరు ద్రోణాచార్యులు యుద్ధభూమిలో ఉండగానే ఇంత అవమానం జరిగింది కదా. ఇంత కంటే తలవంపులు ఏమున్నాయి. నేను ఒంటరిగానే పాండవులను ఎదుర్కొంటాని విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను " అన్నాడు. భీష్ముడు " సూయోధనా ! నీవొక్కడివి పాండవులను ఎలా ఎదుర్కొంటావు రాక్షస మాయలు ఎదుర్కోడానికి మేము లేమా నీవు నిశ్చింతగా ఉండు " అని భగదత్తుని చూసి " భగదత్తా ! రాక్షస మాయలు నీ వద్ద పని చేయవు. నీవు పోయి ఘతోత్కచుని ఎదిరించు " అన్నాడు. భీష్ముని మాటలకు భగదత్తుడు పొంగి పోయి సుప్రీతకం అనే ఏనుగును ఎక్కి తన సేనలతో ఘటోత్కచుని ఏదుర్కొన్నాడు. ఇది చూసి కౌరవ సేనలు ధైర్యము తెచ్చుకుని తిరిగి చేరాయి. సాయం సమయం అయింది.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: