*తిరుమల సర్వస్వం 127-*
* శ్రీవారి సంవత్సర సేవలు 2*
*వైకుంఠ ఏకాదశి*
తమిళులు అధికంగా అనుసరించే సౌరమానం లోని ధనుర్మాసంలో (అంటే మన మార్గశిర పుష్య మాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని *"వైకుంఠ ఏకాదశి"* గా లేదా *"ముక్కోటి ఏకాదశి"* గా వ్యవహరిస్తారు. "ఏకాదశ" అనగా "పదకొండు" అని అర్థం; అవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు. ఈ ఏకాదశముల పరిపూర్ణస్థితి యైన ప్రతి "ఏకాదశి" పవిత్రమైనదే. అందువల్లనే ఏకాదశి దినాన ఉపవాసముండే సాంప్రదాయం ఈనాటికీ కొనసాగుతోంది. అయితే, వైకుంఠ ఏకాదశి మరింత ప్రశస్తమైనది. ఈ ప్రాశస్త్యాన్ని వివరించే రెండు వృత్తాంతాలు మన పురాణాలలో ఉన్నాయి:
మొదటిది ఈ తిథి యందే రావణుని బాధలను భరించలేని బ్రహ్మాది దేవతలు వైకుంఠాని కేగి తమను కాపాడ వలసిందిగా శ్రీహరిని వేడుకొని వారి నుండి అభయం పొందారు.
మరో వృత్తాంతం ప్రకారం – అదే తిథినాడు శ్రీమహావిష్ణువు మధుకైటభులనే రాక్షసులను సంహరించిగా; వారు దివ్య రూపాలు ధరించి ఆ రోజున ఉత్తరమార్గం ద్వారా ఆలయమందు ప్రవేశించి శ్రీహరిని కొలిచిన వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించమని శ్రీమహావిష్ణువును ప్రార్థించారు.
ఈ విధంగా ఈ "ఏకాదశి" మోక్షప్రదాత కావున దీనిని "మోక్షోత్సవ దినం" గాను; ముక్కోటి దేవతల వెతలు బాపినందున దీనిని "ముక్కోటి ఏకాదశి" అని; వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక దీనిని "వైకుంఠ ఏకాదశి" అని; భగవంతుని దర్శనం కలిగించేది కావున *"భగవదవలోకనదినము"* అని; వివిధ నామాలతో పిలుస్తారు.
ఏరకంగా చూచినా, వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనదే!
కలియుగ వైకుంఠమైన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం అత్యంత వైభవంగా జరుపబడుతుంది. ఏకాదశి ముందురోజు రాత్రి, ఏకాంతసేవ అనంతరం యథావిధిగా బంగారు వాకిళ్ళను మూసివేస్తారు. మరుసటి రోజు అనగా ఏకాదశి - తెల్లవారు ఝామున జరిగే సుప్రభాత వేళ మొదలుకొని, మరునాటి ద్వాదశి అర్ధరాత్రి జరిగే ఏకాంతసేవ పూర్తయ్యేవరకు, శ్రీవారి ఆలయానికి ఆనుకుని ఉన్న *"ముక్కోటి ప్రదక్షిణ"* మార్గాన్ని భక్తుల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. ఈ ప్రదక్షిణ మార్గం యొక్క వివరాలను మనం ఇంతకు ముందే "విమానప్రదక్షిణం" ప్రకరణంలో వివరంగా తెలుసుకున్నాం! –
ఈ రెండు రోజులు (ఏకాదశి-ద్వాదశి) శ్రీవారి దర్శనానంతరం భక్తులందరూ గర్భాలయ ప్రాకారాన్ని ఆనుకొని ఉన్న ముక్కోటి ప్రదక్షిణమార్గంలో ప్రదక్షిణ గావిస్తారు. ఈ ప్రదక్షిణమార్గం యొక్క ప్రవేశద్వారాన్ని *"వైకుంఠద్వారం"* అని, ఆ మార్గాన్ని *"వైకుంఠప్రదక్షిణ"* మని పేర్కొంటారు. ఈ రెండు రోజులు ఆ ప్రదక్షిణ మార్గమంతా విద్యుద్దీప కాంతులతో, పరిమళాలను వెదజల్లే పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకరింప బడుతుంది. సంవత్సర కాలంలో కేవలం రెండు రోజులు మాత్రమే ప్రాప్తించే ఈ వైకుంఠ ప్రదక్షిణం కావించుకున్న భక్తులు ఒక విశిష్టమైన దివ్యానుభూతికి లోనవుతారు.
ఏకాదశి పవిత్ర దినాన – ముల్లోకాలలో కొలువై వున్న మూడు కోట్ల యాభై లక్షల పుణ్య తీర్థాలు, పుష్కరిణిలు – అన్ని తిరుమల లోని స్వామిపుష్కరిణి యందు సూక్ష్మరూపంలో లీనమై ఉంటాయని ప్రతీతి. -
ఆ రోజు ఉభయ దేవేరులతో కూడిన మలయప్పస్వామి వారికి కన్నుల పండువగా రథోత్సవం జరుగుతుంది. శ్రీవారిసన్నిధిలో *"రాపత్తుతొడక్కం"* అనే వేడుకను ఘనంగా జరిపి, శ్రీనమ్మాళ్వార్ రచించిన *"భగవద్విషయం"* లేదా *"తిరువాయ్ మొళి"* అనే దివ్యప్రబంధం లోని *"నాల్గవ ఆయిరం"* అధ్యయనం ప్రారంభిస్తారు.
మరునాటి, ద్వాదశి తిథి యందలి సూర్యోదయ వేళలో *"శ్రీస్వామిపుష్కరిణి తీర్థముక్కోటి"* అనే ఘట్టం ఘనంగా జరుపబడుతుంది. ఆరోజు ఉదయం సేవలన్నీ యథావిధిగా జరిగిన తరువాత, ఆనందనిలయం లోని చక్రత్తాళ్వార్ (సుదర్శనచక్రం యొక్క ఉత్సవమూర్తి) పల్లకిని అధిరోహించి, తిరుమల మాడవీధుల్లో ఊరేగింపుగా వచ్చి శ్రీవరాహస్వామి ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. అక్కడ చక్రత్తాళ్వార్ కు అభిషేకం జరిపి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. వారితో పాటుగా వేలాది మంది భక్తులు కూడా పుష్కరిణిలో పవిత్రస్నాన మాచరించిన తదనంతరం, చక్రత్తాళ్వార్ కు వస్త్రాలంకరణ గావించి, నివేదనలనిచ్చి, హారతులు అందజేస్తారు. ఆ తరువాత చక్రత్తాళ్వార్ వారు ఆలయ పునఃప్రవేశం చేస్తారు.
శ్రీవారి దర్శనానంతరం అసంఖ్యాకమైన భక్తులు వైకుంఠ ప్రదక్షిణం గావిస్తున్నందున, ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని *"వైకుంఠద్వారస్థ భగవదవలోకన మహోత్సవం"* గా కూడా అభివర్ణిస్తారు.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి