23, జనవరి 2025, గురువారం

గణిత మేధావి గొప్పతనం*

 *రాయలసీమకు చెందిన గణిత మేధావి గొప్పతనం* 


ఓ తెలుగు వ్యక్తి గొప్పదనం.

 *కడప జిల్లా ప్రొద్దటూరు* కు గర్వకారణం. కాని ఆయన విగ్రహం లేదు 🤷‍♀️🤷‍♀️


టిప్పు సుల్తాన్ కు గౌరవం ఇచ్చారు ప్రొద్దటూరు నాయకులు 🤗


*గణితబ్రహ్మగా* పేరొందిన *లక్కోజు సంజీవరాయ* (నవంబర్ 22, 1907 - డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి. సంజీవరాయ 1907 నవంబర్ 27 న *కడపజిల్లా ప్రొద్దుటూరు* మండలంలోని కల్లూరులో జన్మించాడు.


జన్మతః అంధుడు. అప్పట్లో బ్రెయిలీ లిపి కానీ, అంధుల్ని చేరదీసే వ్యవస్థ కానీ లేదు. అక్క పాఠశాలలో చదివినవి ఇంటి దగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవి విని గుర్తు  పెట్టుకుని గణితంలో అపార విజ్ఞానం సాధించాడు.


తండ్రి మరణించడంతో తల్లి పెంచి పెద్దచేసింది. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించే వారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితుడై నేర్చుకొన్నారు.


శ్రీ సంజీవరాయ తొలిసారి *1928 లో గణితావధానం నిర్వహించారు.* అప్పటినుంచి 1995వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చాడు. మహానగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాదులలోను పలు ప్రదర్శనలను ఇచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబర్ 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ శ్రీ సంజీవరాయ గణితావధానమే.


సాధారణంగా గణితావధానంలో, పుట్టిన తేదీ ఇస్తే అది ఏ వారము అయిందో చెప్పడం ఒక అంశం-కాని, ఈ విషయంలో శ్రీ సంజీవరాయకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ పుట్టిన తేదీ ఏ వారము అయినదో చెప్పడమే కాకుండా, ఆనాటి పూర్తి పంచాంగము చెప్పేవారు. అంటే, పుట్టిన తేదీ, సమయము, ప్రదేశము చెప్పగానే, దానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, వర్జ్యము, రాశి కూడా చెప్పి, కొంత వరకు జాతకం కూడా చెప్పేవారు.


ఈ ప్రత్యేకతను (మానవ గణన యంత్రంగా [Human Computer] పేరొందిన శకుంతలా దేవితో సహా) మరెవరూ చూపలేక పోయారు. ఆవిధంగా, ఇది అనితర సాధ్యమైన ప్రత్యేకత. 1966 డిసెంబరు ఏడో తేదీ.. అది హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక 2 power 103 ఎంత? 


దానికి సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని. 

'క' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, 'స, రి, గ, మ, ప, ద, ని'' అక్షరాల లబ్దం ఎంత? ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు... 


కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా?... కాదు. 


పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా ?... కాదు. పుట్టుగుడ్డి! 

పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది.

ఆయనే గణిత బ్రహ్మడా. లక్కోజు సంజీవరాయ "అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!"  


శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా... 

 *మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది...* ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ.. అందరూ తలలు పట్టుకుంటారు!


దానికి సంజీవరాయ చెప్పిన సమాధానం... *ఒక కోటి 84 లక్షల 46 వేల 74 కోట్ల 40 లక్షల 73 వేల 70 కోట్ల 95 లక్షల 51 వేల 615 వడ్ల గింజలన్నమాట* (1,84,46,74,40,73,70,95,51,615!)

ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే...


అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల.. ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు *వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి 20 ఇంతలు!


అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!  ఇదంతా అబ్బురమని పించవచ్చు. కానీ సంజీవరాయ గణితావధాన వివరణ మహిమ అదంతా!  ఒకటి, రెండు, మూడు.... ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు!


సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షత్రాలు, వారాలు, పక్షాలు... గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు.. తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించిన అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను  పలు ప్రదర్శనలు నిర్వహించారు.. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి *రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్* ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం! 


అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా గణితావధాన.. ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్ల కీర్తించారు.


పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలుబిగ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు.

అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు.

ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది. దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేథావి ఇల్లు కదలలేక పోయారు.


వివిధ విశ్వవిద్యాలయాలు... ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి. దురదృష్టమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.


ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు.. మంచి శిక్షణ పొందారు. 


కానీ సంజీవరాయ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే... ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు


ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ *''ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు.. చేసేవాళ్లం''* అని అయన్నుద్దేశించి అన్నారు.


శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయని రక్షించుకోలేక పోయింది. 1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయ అస్తమించారు. 'అంక విద్యాసాగర విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన తన చివరి" రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు!


నిజానికి... *ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు...* ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో!


సేకరణ :  (చరిత్రలో  తెలుగు వాడు)


🍎🍎🍎🍇🍇🍇☀️☀️☀️

కామెంట్‌లు లేవు: