23, జనవరి 2025, గురువారం

కవిసార్వ భౌముని కనకాభిషేకము!

 శు భో ద యం🙏


కవిసార్వ భౌముని కనకాభిషేకము! 


కం:- కవి సార్వ భౌమ బిరుదము 


యవులే! యది నీకె తగును అవనీ స్ధలి లో

చవులూరు కవితఁ జెప్పఁగ

పవి సమమౌ వాదులాడ పరువము మీరన్ ;


డింఢిముని పరాజయానంతరము రాయలు హృష్టుఁడై, తుష్టుఁడై " శ్రీనాధ కవీంద్రా! ఓడినవారి బిరుదములను గెలిచిన వారుధరించుట విజయ నగరమున యాచారము. శ్రవణ పేయమయిన కవితఁజెప్పుటయందును, వజ్రాయుధ ఘాతమువలె తిరుగులేని వాదమొనరించుట , యందును నీవుసమర్ధుఁడవు. కావున నేటినుండి యీయాంధ్ర సాహిత్య ప్రపంచమున నీవే కవిసార్వ భౌముఁడవు. తక్కొరులెవ్వరీ బిరుదమునకు భాజనులై యుండకుందురుగాక! ఆచంద్ర తారార్కము నీకిది శాశ్వతమై వర్ధిల్లుదువుగాక" యనిపలుక "శ్రీనాధ కవిసార్వ భౌమా జయీభవ! విజయీభవ! యనువందిమాగధుల స్తోత్రములతో నాసభ కొంతవడి మారుమ్రోగెను. వందిమాగధుల బృందగానముతో నచటిపండితులెల్ల తమఠములనుగలిపి శ్రీనాధుని మనసార నుతించుట విశేషము. శ్రీనాధుని తనువు హర్ష పులకిత మయ్యెను . పరాభవాగ్నిచే దందహ్యమాన మగుచున్న నాతనిమనంబు చల్లబడెను .


అంత రాయలవారు యేమి కవిసార్వ భౌమా! మీప్రతీకారము తీరినదిగదా! ఇకనైన మీయధ్భుత కవిత్వ గానముతో మాభనలరించుఁడు. అదియే మాకుపరమ భాగ్యము. అనిపలుక, శ్రీనాధుఁడు ఆసనమునుండి పయికి లేచి వినయ వినమితుఁడై,


మ: జన నాధోత్తమ! దేవరాయ నృపతీ! చక్రేశ! శ్రీవత్సలాం

చన సంకాశ! మహీ ప్రభావ! హరి! రక్షాదక్ష! నాబోఁటికిన్

గునృప స్తోత్ర సముధ్భవంబయిన వాగ్దోషంబు శాంతమ్ముగా

గనక స్నానముఁ జేసిగాక, పొగడంగా శక్యమే దేవరన్!


యనిపలికెను. పండితవిజయమాత్రమున నాతనికి దృప్తి గలుగలేదు . కనకాభిషేక గౌరవమునుగూడ పొందవలె. అందుకు సమర్ధులు విజయ నగర ప్రభువులే! వారు మహాధనవంతులు, వదాన్యులు, కవిపండిత ప్రియులు, హిందూధర్మ పరిరక్షకులు. కావున వారికడనే తనమనోరధ మీడేరవలె. కావుననే రాయలవారితో శ్రీనాధుఁడిట్లనినాఁడు " రా జోత్తమా! దేవరాయ సార్వభౌమా! విష్ణ్వంశాసంభూతా! అనన్య సామాన్య ప్రభావా! రాజ్యరక్షాదక్షా! యేదో యల్పులగు రాజులను బొగడిన ఈనోటితో మీవంటి యుత్తములను బొగడుట పాడిగాదు . కనక స్నానముతో నావాగ్దోషము నపనయింప వచ్చును . దేవర కదేమంత భాగ్యము? పిమ్మట ప్రభువుల దయ నాభాగ్యము. అనిపలుక యతనిమాటల లోనిమర్మమును గ్రహించి రాయలు మంత్రులను జేరబిలిచి వారికేదోయాదేసించెను . కొద్దిసమయములోనే సువర్ణ నిష్కములు నింపిన పళ్ళెరములతో పరిచారికలరుదెంచి యవనిక మాటున నుండ, దేవరాయలు సింహాసనము నుండి దిగివచ్చి స్వస్తిక మంత్రములను విప్రులచ్చైస్స్వరమున జదువుచుండ నాదీనారముల నభిషేకింప సాగెను. యాశిరోపాదముగా నాయభిషేకము సాగినది. సుకవితా సన్మానమున నటు రాయలు కనకాభిషేకగౌరవ మందజాలినందుల కిటు శ్రీనాధుఁడును. చరితార్ధమునుపొందిరి. రాయలకు, శ్రీనాధకవికిని శాశ్వతమగు కీర్తి లభించినది.


శ్రీనాధుని యౌదార్యము :-


కవిృసార్వ భౌముడంత నాద్రవ్యమును నంతయు నొకచోటునకుఁ జేర్పించి , దోసిళ్ళతో నెత్తి యచటి విప్రులకు పంచిబెట్టసాగెను. రాయలు సంభ్రమాశ్చర్యములతో దిలకింపసాగెను. ఆద్రవ్యమంతయు సంపూర్ణముగా బ్రాహ్మణులకు బంచి యచ్చి నిర్లిప్తుఁడై తనయాసనమున గూర్చున్న శ్రీనాధునిగాంచి యొకింత కినుకఁదోప " ఏమిది? కవిసార్వ భౌమా! మేమిచ్చిన విత్తమంతయు నిట్లు పంచి బెట్టి రిక్త హస్తములతో నేగెదరా? రాయలవారేమిచ్చిరని ప్రశ్నంచు వారికి మీరిక్త హస్తములను ప్రదర్శించి మ మ్మవమానింతురా? తమవంటివారి కిది తగునా? యనిప్రశ్నింప,


"ప్రభూ! తమరెరుంగని దేమున్నది. అయినను విన్నవింతునుగాక! ' ప్రాజ్ఙుఁడెప్పుడును స్నానోదకమును పానమునకు వాడడుగదా! కనకమేయైనను యది తమచే నభిషేకింప బడుటచే స్నానోదక సమమైనది. కావున నాయొనర్చిన కృత్యము ధర్మ విరుధ్ధముగాక సముచితమై తమకు మరింతగా ఖ్యాతినార్జించి పెట్టినది " నకర్మణా న ప్రజయా న ధనేన త్యాగేనైకేన అమృతత్వ మానసుః" అనిగదావేద వాక్యము.(మానవుడు తనపనులవలన గానీ, తనసంతతి వలనగానీ, తనకున్న ధనమువలనగానీ అమృతత్వాన్ని పొందలేడట! ఒక్కదానము చేతనే యమృతత్వమును పొందగలడు : అనియర్ధము) ఇకరిక్త హస్తములందురా? ప్రభువులికపై కరుణించి యిచ్చెడు విత్తమును పదిలముగా నావెంట గొనిపోగలవాఁడనని పలికెను.


రాయలాతని వదాన్యతను వేనోళ్ళ గొనియాడి మరికొంత విత్తమును దెప్పించి యతని కొసంగి సంతుష్టుని యొనరించెను. అట్టి ప్రభువులు గానీ యట్టి వదాన్యులయిన కవులు గానీ లోకమున నరుదు గదా! మనమింతవరకు శ్రీనాధునిలో స్త్రీలోలత్వమునే గాంచినాము. మరి యిప్పుడు అతనివదాన్యతను గూడ సప్రమాణముగా కనుగొన గలిగినాము . ఇట్టివారు అరుదుగా నుందురు .వారిలో మనకవి సామ్రాట్ విశ్వ నాధయొకరు. వారివిషయమును వేరొకపరి  ప్రస్ధావించెదనుగాక!

                     స్వస్తి!🙏🙏🌷🌷👌🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: