23, జనవరి 2025, గురువారం

తిరుమల సర్వస్వం 126-*

 *తిరుమల సర్వస్వం 126-*

 శ్రీవారి సంవత్సర సేవలు 1* 



 *ఉగాది ఆస్థానం*


 తెలుగు లోగిళ్ళలో నూతన సంవత్సరపు తొలిరోజైన ఉగాది నాడు, సందర్భోచితంగా తెలుగువారి కొంగుబంగారమైన శ్రీవేంకటేశ్వరునికి ఉగాది ఆస్థానం జరుగుతుంది. తిరుమలేశుని వార్షికోత్సవాలు, ఉత్సవాలు అన్నీ ఉగాది తోనే మొదలవుతాయి.


 ఉగాది పర్వదినాన ప్రాతఃకాల మందు, నిత్యసేవలైన సుప్రభాతసేవ, తోమాలసేవ యథావిధిగా పూర్తయిన తరువాత; ఉభయ దేవేరుల సమేతుడైన శ్రీమలయప్పస్వామి వారికి, సేనాపతి విష్వక్సేనులవారికి ఏకాంతంగా తిరుమంజనం జరుపబడుతుంది. తరువాత, బంగారువాకిలి ముందున్న మహామణిమంటపంలో గరుడాళ్వార్ కు ఎదురుగా స్వర్ణకాంతులీనే సర్వభూపాల వాహనం లో శ్రీదేవి భూదేవి సహిత మలయప్పస్వామి వారిని వేంచేపు చేస్తారు. పట్టు పీతాంబరాలతో, కిరీటాలతో, సర్వాభరణాలతో, పరిమళ భరితమైన పూలమాలలతో ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరిస్తారు. మలయప్పస్వామికి ఎడమవైపున మరో పీఠంపై దక్షిణాభిముఖంగా విష్వక్సేనులవారు ఆసీను లవుతారు. గర్భాలయంలోని మూలమూర్తికి, మిగిలిన ఉత్సవమూర్తు లందరికీ అన్నప్రసాదాలు నివేదించ బడతాయి. తదనంతరం, జియ్యంగార్లు, వారి పరిచారకులైన ఏకాంగులు, అధ్యాపకులు, అర్చకులు, వేదపండితులు వేదపారాయణం చేస్తారు. పెద్దజియ్యంగార్ మూలవిరాట్టు అలంకరణ నిమిత్తం ఒక వెండిపళ్లెంలో ఆరు పట్టువస్త్రాలను అర్చకులకు అందజేస్తారు. తరువాత అర్చకులు స్వామివారికి బంగారుపళ్లెంతో పచ్చ కర్పూర హారతినిచ్చి, అధికారులకు తీర్థ-చందనాదులను అందజేస్తారు. మరో రెండు పట్టు వస్త్రాలను బంగారువాకిలి కెదురుగా ఉన్న మలయప్పస్వామి వారికి, విష్వక్సేనులవారికి ఒక్కొక్కటి చొప్పున అలంకరిస్తారు. 


 అనంతరం శ్రీవారి పాదపద్మాల పైనున్న పంచాంగాన్ని చేతిలోనికి తీసుకొని, ఆస్థానసిద్ధాంతుల వారు శ్రీవెంకటేశ్వరునికి నూతన పంచాంగశ్రవణం చేయిస్తారు. తరువాత, నూతన సంవత్సర ఫలాలను; అన్ని నక్షత్రాల వారి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, అవమానాలను, నిష్పత్తులతో సహా వివరిస్తారు. స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్రం గురించి వివరించి, భక్తులందరినీ కాపాడ వలసిందిగా నవగ్రహ దేవతలను ఆదేశించమని; విశ్వమంతా సస్యశ్యామలంగా, అతివృష్టి అనావృష్టి వంటి ఈతి బాధలు లేకుండా చూడమని శ్రీవారిని ప్రార్థిస్తారు. తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా నక్షత్ర ఫలితాలు చెప్పి తీర్థ ప్రసాదాలు నివేదిస్తారు


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: