12-13,14-గీతా మకరందము
భక్తియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అI ఇంతదనుక భక్తియొక్క అంగములైన వివిధసాధనలను జెప్పి, ఇక ఏడు శ్లోకములద్వారా ఉత్తమ భక్తుని లక్షణములను పేర్కొనుచున్నారు-
అద్వేష్టాసర్వభూతానాం
మైత్రః కరుణ ఏవ చ
నిర్మమో నిరహంకారః
సమదుఃఖసుఖః క్షమీ.
సంతుష్టస్సతతం యోగీ
యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనోబుద్ధిః
యో మద్భక్తస్స మే ప్రియః
తా:- సమస్తప్రాణులయెడల ద్వేషములేనివాడును, మైత్రి, కరుణగలవాడును, అహంకారమమకారములు లేనివాడును, సుఖదు:ఖములందు సమభావముగలవాడును, ఓర్పుగలవాడును, ఎల్లప్పడు సంతృప్తితో గూడియుండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరచుకొనినవాడును, దృఢమైననిశ్చయముగలవాడును, నాయందు సమర్చింపబడిన మనోబుద్ధులుగలవాడును, నాయందు
భక్తిగలవాడును ఎవడుకలడో, అతడు నాకు ఇష్టుడు.
వ్యాఖ్య:- ఎట్టివాడు తనకు ప్రియుడో భగవానుడు ఏడు శ్లోకములద్వారా చెప్పుచున్నారు. ముప్పదియెదు సుగుణములను పేర్కొని "ఇవి కలవాడే నాకు ప్రియుడు' అని శ్రీకృష్ణపరమాత్మ తెలియజేయుచున్నారు. ఈ గుణములన్నియు 'అద్వేష్టా అను పదముతో ప్రారంభమగుటచే 'అద్వేష్టృత్వాది గుణములని ప్రసిద్ధికెక్కినవి. ఈ ముప్పది ఐదున్ను ముప్పదియైదు పాఠములు, లేక పాఠ్యవిషయములు (Subjects) అయివున్నవి. విద్యార్థి పరీక్షలో అన్నిపాఠ్యవిషయములందును ఉత్తీర్ణుడైనచో మాత్రమే పై తరగతికి బోవుటకు అర్థత గలిగియుండు విధమున ఈ 35 సుగుణములను చక్కగ గలిగియుండువాడు మాత్రమే భగవంతునకు ప్రీతిపాత్రుడు కాగలడు. ఇవి లేనివాడు భగవత్కృపకు పాత్రుడుకానందుచే ఆత డీ జననమరణ సంసార ప్రవాహమునబడికొట్టుకొనుచునే యుండును, దుఃఖమునుండి విడువబడవలెననిన, భగవదనుగ్రహమును సంపాదించవలెను. వారి యనుగ్రహమో ఈ సల్లక్షణములు, ఈ సద్గుణములు గలవానిపైననే ప్రసరించును.
సమో౽హం సర్వభూతేషు
న మే ద్వేష్యో౽స్తి న ప్రియః
యే భజంతి తు మాం భక్యా
మయి తే తేషు చాప్యహమ్.
- (గీత 9-29)
అని భగవానుడు చెప్పిన రీతిగా, వాస్తవముగ వారికి ఎవనిపైనను ప్రీతిగాని, ద్వేషముగాని లేకున్నను ఎవరు వారిని భక్తితో సేవించుదురో వారిపై వారనుగ్రహమును వర్ణించుదురు. అట్టి భగవదనుగ్రహమహిమచే
ఆత్మజ్ఞానమును, తద్ద్వారా ముక్తిని అతడు పొందియేతీరును. కాబట్టి మోక్షము నభిలషించువాడు, సంసారదుఃఖమును అంతరింప జేసికొనదలంచువాడు, భగవదనుగ్రహమును పొందుగోరువాడు ఈ అధ్యాయమందు తెలుపబడిన ఈ భక్తుని లక్షణములన్నిటిని చక్కగశీలించవలెను.
అనేకులకు భగవంతునిపై ప్రీతి యుండును. కాని అది చాలదు. భగవంతునకు తనపై ప్రీతి జనించినదా యని పరీక్షించుకొనుచుండవలెను. దేవుడు జీవునకు ప్రియుడైనను, దేవునకు జీవుడు ప్రియుడుగానున్నాడా యని చూచుకొనవలెను. అట్టిస్థితి చేకూరెనా ఇక జీవుడు తరించినట్లే. అయితే భగవంతుడు తాను చెప్పిన ఈ సుగుణములు కలవానినే ప్రియుడుగ నెంచునని 'యో మద్భక్తః స మే ప్రియః' మున్నగు వాక్యములద్వారా ఇట తెలియజేసిరి గావున వానిని జీవుడు తప్పక సంపాదించవలసియుండును.
సాధ్యవస్తువగు పరమాత్మను జేరవలెననిన, సాధనయందు చక్కగ ఆరితేరవలెను. గీతాగ్రంథము సాధ్యవస్తువును గురించి ఒకింతయు, సాధనను గూర్చియే విశేషముగను తెలుపుచుపోవును, కనుకనే దీనిని అనుష్ఠానవేదాంత గ్రంథమని చెప్పుదురు. మొట్టమొదట స్థితప్రజ్ఞలక్షణములు, తదుపరి అద్వేష్టృత్వాది భక్తలక్షణములు, ఆ పిమ్మట అమానిత్వాది జ్ఞానగుణములు, ఆ వెనుక "అభయం" ఇత్యాది దైవీసంపత్తి లక్షణములు - ఈ ప్రకారముగ అనుష్ఠానమును గీతాచార్యులు జనులకు నూరిపోసిరి.
కాబట్టి ముముక్షువులు వానినన్నింటిని చక్కగ శీలించి భగవంతునకు ప్రీతిపాత్రులై జన్మసార్థకత నొందవలయును. "సర్వభూతానామ్" - అని చెప్పుటవలన ఏ ఒకరిద్దరిపై ద్వేషములేకుండుట కాదనియు, సమస్తప్రాణికోట్ల యెడల ద్వేషరాహిత్యము కలిగియుండవలెననియు బోధింపబడినది.
"సంతుష్టః సతతమ్' = ఏ కొద్దిసేపో తృప్తిగలిగి మరల విషయవాంఛలతో గూడియుండుట సరికాదు. ఎల్లప్పడు సంతృప్తుడై యుండవలయును,
" దృఢనిశ్చయ* - దైవవిషయమునగాని, ప్రపంచవిషయమునగాని స్థిరమైన నిర్ణయములు కలిగి సాధనయందు గట్టి నిశ్చయములతో దృఢవ్రతములతో గూడియుండవలెను. శాస్త్ర, గురువాక్యములందు దృఢవిశ్వాసము యుండవలెను. ఇది " ఔనో, కాదో " అను ఊగులాట పనికిరాదు. " దేవుడున్నాడు, వారిని నేను పొందితీరెదను' అనునిట్టి దృఢనిశ్చయములు గల్గియుండవలెను. లేనిచో 'మాయ' చపలమనస్కుని ఊపివేయును.
"మయ్యర్పిత మనోబుద్ధిః - మనస్సుతో బాటు బుద్ధినిగూడ తనయందు నిలుపవలెనని గీతయందు అచటచట భగవానుడు హెచ్చరికలు చేయుచున్నారు. ఏలయనిన మనస్సు వికలాత్మకమైనది గనుక, నిశ్చయాత్మకమగు బుద్ధి దానితో చేరనిచో ఆ మనస్సు చంచలముగనేయుండి లక్ష్యమును సరిగా పొందజాలకుండును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి