23, జనవరి 2025, గురువారం

భగవంతునికి దగ్గర

 తొమ్మిది మార్గాలలో మన పూర్వీకులు ఎవరు ఏ విధంగా భగవంతునికి దగ్గర అయ్యరో చూద్దాం............!!

1. శ్రవణం( వినడం ) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు.

2. కీర్తనం( పాడడం ) చేత నారద మహర్షి తరించాడు.

3. స్మరణం ( నోటితో ఎల్లప్పుడు పలకడం ) చేత ప్రహ్లదుడు తరించాడు.

4. పాదసేవనంతో లక్ష్మణుడు తరించాడు.

5. అర్చణంతో పృధు చక్రవర్తి తరించాడు.

6. వందనం చేత అక్రూరుడు తరించాడు.

7. దాస్య భక్తి (సేవ )చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించాడు.

8. సఖ్యం భక్తి చేత అర్జునుడు తరించాడు.

9. ఆత్మనివేదనంతో బలిచక్రవర్తి తరించారు.


*శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి? ఎలా ఉంటుంది తెలుసా......

* శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం" ..........


*కలియుగ వైకుంఠపతి వేంకటేశ్వరుని సుప్రభాత సేవలో కీర్తించే స్తోత్రము.*  


*"సు-ప్ర భాతము" అనగా "మంచి ఉదయం" అని అర్ధం. హిందూ పూజా విధానాలలోను, ప్రత్యేకించి శ్రీవైష్ణవం ఆచార పరంపరలోను,*


*భగవంతుని పూజామూర్తికి అనేకమైన సేవలు (షోడశోపచారములు) నిర్వహించే సంప్రదాయం ఉంది.*


*ఇలాంటి సేవలలోనిదే సుప్రభాత సేవ. ఆ ప్రభాత సేవా సమయంలో చేసే కీర్తననే "సుప్రభాతం" అని అంటారు.*


*చాలా శైవ, వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సంప్రదాయం ఉన్నా "సుప్రభాతం" అనగానే వెంకటేశ్వర సుప్రభాతం మాత్రమే  స్ఫురణకు రావడం ముమ్మాటికీ నిజం.*


*సుప్రభాతం జరుగు విధానం :........

*ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది.*


*ఆ సమయంలోనే 'సన్నిథిగొల్ల' దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి,*


*బేడిఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు.*


*అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే 'కుంచెకోల' అనే సాధనం, తాళం చెవులను ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు.*


*వారు క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి, బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు.*

   

*ఆ సమయానికి ఆలయ అధికారులు, పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు,*


*తాళ్ళపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు.*


*తాళాలు తీసిన తర్వాత సన్నిథిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు.*


*ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంలో "కౌసల్యా సుప్రజా రామా ...'' అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు.*


*ఆ తర్వాత మహంతు, మఠం వారు తెచ్చిన 'పాలు, చక్కర, వెన్న, తాంబూలం' ఉన్న పళ్లెరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకొని వెళ్తారు.*

    

*బంగారు వాకిలి ముందునున్న వేదపండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనాను కొనసాగిస్తారు.*


*సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు.*


*దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిథిగొల్ల 'కులశేఖర పడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు.*


*ఆ తరువాత అర్చకులు, ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు.*

   

*తరువాత శయన మండపంలో బంగారుపట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు.*


*ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు ఆపైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో.. మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు.*


*ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు.*


*మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి, స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు.*

 

*బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు (సుప్రభాతం) మంగళా శాసనాన్ని ముగిస్తూ ఉండగా, లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు.*


*నవనీత హారతి' అంటే నివేదనాంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు.*

    

*అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు, పుష్పాలు కూడా ఉండవు.*


*భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని 'విశ్వరూప సందర్శనం' అని భక్తితో పిలుస్తారు.*

    

*ఈ హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, శఠారిని తాము ముందుగా స్వీకరించి.*


*ఆ తరువాత జియ్యంగారికి, ఎకాంగికి ఇస్తారు. సన్నిథిగొల్లకు కూడా తీర్థం, శఠారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు.*


*స్వామివారి సుప్రభాత సేవకోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం, శఠారులను స్వీకరిస్తారు.*


*ధనుర్మాసంలో మాత్రం `సుప్రభాత గానం లేదు. ఆళ్వారులలో ఒకరయిన అండాళ్ తిరుప్పావై పాశురాన్ని గానం చేస్తారు.* 


*ఇతర మాసాలలో భోగశ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా,  ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణస్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంతరించుకొంటారు..


*కౌసల్యా సుప్రజా రామ ..గోవిందా నవనీత చొర గోవిందా.. విశ్వరూప సందర్శక.. గోవిందా..


            ఓం నమో వేంకటేశాయ.

కామెంట్‌లు లేవు: